కలెక్టరేట్, న్యూస్‌లైన్: బాలుడి కాలు ఆపరేషన్ చేయడంలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత వైద్యుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. ఇకపై అధికారులు సెలవులు పెట్టరాదని, ఏదైనా అతిముఖ్యమైన పని ఉంటే తన దృష్టికి తీసుకువస్తే, మంజూరు చేస్తానని స్పష్టం చేశారు. సోమవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ పాల్గొని, వినతులు స్వీకరించారు. తన కుమారుడి కాలు ఆపరేషన్ అని చెప్పి మొత్తం పూర్తిగా కాలు చెడిపోవడానికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని దుర్కి గ్రామానికి చెందిన వడ్ల భాస్కర్ అనే వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో డీఎంహెచ్‌ఓ ద్వారా పూర్తివివరాలు తెలుసుకున్న కలెక్టర్ బాలుడి కాలు పూర్తిగా చెడిపోవడానికి కారణమైన వైద్యుడిపై క్రిమినల్ కేసు నమోదుచేయాలని ఆదేశించారు. అనంతం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతున్నందున ప్రభుత్వ పథకాల లక్ష్యాలు నెరవేరేలా చూడాలన్నారు. అప్పటి వరకు అధికారులెవరు సెలవు పెట్టరాదన్నారు.
జాతీయ పండుగలకు జిల్లా యంత్రాంగం ద్వారా నిర్వహించే పతాకావిష్కరణ కార్యక్రమాలకు అధికారులు విధిగా హాజరుకావాలన్నారు. ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవానికి స్థానికంగా విధులు నిర్వహించే అధికారులు,ఉద్యోగులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన ఆదేశించారు. ఈ విషయంలో హాజరు పరీక్షించే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. కార్యక్రమంలో జేసీ హర్షవర్ధన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణికి మొత్తం 274 ఫిర్యాదులు వచ్చాయి.
న్యాయం చేయండి..
అన్యాయంగా తమ భూమిని కబ్జా చేసుకున్న అనురాధపై చర్యలు తీసుకోవాలని వర్ని మండలం చందూర్ గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.తమ భూమిని (సర్వేనెంబర్ 408/38 లో ఎకరం 10 గుంటలు) అనురాధ అన్యాయంగా కబ్జా చేసుకున్నారని, దీనికి స్థానిక తహశీల్దార్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. చర్యలు తీసుకుని విచారణ జరిపి తమ భూమి తమకు ఇప్పించగలరని వారు కోరారు.
బకాయిలు చెల్లించండి
మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బకాయిలు చెల్లించాలని పీడీఎస్‌యూ నాయకులు కలెక్టర్‌ను కోరారు. అంతకుముందు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి బి.విశ్వనాథ్ మాట్లాడుతూ.. జిల్లాలో 2,347 భోజన ఏజెన్సీలు ఉన్నాయన్నారు. వాటికి 2010లో బకాయిలు చెల్లించక పోవడంతో నిర్వాహకులు మధ్యాహ్న భోజనం అందించేలేకపోతున్నారన్నారు.దీంతో వారు నిరవధిక సమ్మె చేపట్టారన్నారు. సమస్యను పరిష్కరించాలని కోరారు.
క్రిమినల్ కేసు నమోదు చేయండి
Published Tue, Jan 21 2014 6:47 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement