గతనెలలో కోల్‌కతాలోని ఆర్‌జీకర్ ఆసుపత్రిలో పీజీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరుతున్నాయి. పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది.
తాజాగా ఈ వ్యవహారంలో మరో పరిణామం చోటుచేసుకుంది. కామాంధుడి చేతిలో హత్యాచారానికి గురైన వైద్యురాలి తల్లి తన కూతురి కోసం రాసిన ఓ లేఖ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో వైద్యురాలు కావడం తన కూతురు చిన్ననాటి కల అని, డబ్బు కోసం కాకుండా వీలైనంత ఎక్కువమందికి మెరుగైన వైద్యం అందిచాలనేది ఆమె కోరికగా ఆ లేఖలో పేర్కొంది.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బాధితురాలి తల్లి ఈ లేఖను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో తన కూతురు చిన్ననాటి కలను సాకారం చేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను చనిపోయిన వైద్యురాలి తల్లిని. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా కూతురు తరపున ఉపాధ్యాయులందరికీ పాదాభివందనం చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనేది ఆమె కల. ఆ కలను నడిపించిన శక్తులు మీరే.
మేము తల్లిదండ్రులుగా తమకు చేతనైనంత సపోర్ట్ చేసినా.. మీలాంటి మంచి ఉపాధ్యాయులు లభించినందున, ఆమె డాక్టర్ కావాలనే తన కలను నెరవేర్చుకోగలిగింది. నా కూతురు ఎప్పుడూ చెప్పేది. అమ్మా, నాకు డబ్బు అవసరం లేదు. నా పేరు ముందు నాకు చాలా డిగ్రీలు కావాలి. వీలైనంత ఎక్కువ మంది రోగులను నయం చేయాలనుకుంటున్నాను.
హత్య జరిగిన గురువారం కూడా ఆమె ఇల్లు వదిలి వెళ్లి ఆసుపత్రిలో చాలా మంది రోగులకు సాయం చేసింది. డ్యూటీలో ఉన్నప్పుడు హంతకులు ఆమెను హత్య చేశారు. ఆమె కలలను దారుణంగా చంపారు.’ అని లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా తన కూతురైన డాక్టర్‌కు న్యాయం చేయాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా బుధవారం, ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వద్ద నిరసనలో పాల్గొన్న బాధితురాలి తల్లిదండ్రులు.. తొలుత పోలీసులు ఈ కేసును అణిచివేసేందుకు, సమగ్ర దర్యాప్తు లేకుండా మూసివేయడానికి ప్రయత్నించిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. పోలీసులు తమకు డబ్బులు ఇవ్వాలని కూడా చూశారని తెలిపారు.
కాగా ఈ ఘటన తర్వాత నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినా.. అన్ని వేళ్లు మాత్రం ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వైపే చూపించాయి. ఈ క్రమంలోనే ఈ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి వ్యవహారం బయటపడటం తీవ్ర దుమారం రేపింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో ఇప్పటికే సీబీఐ ఆయనను అరెస్టు చేయగా.. తాజాగా కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అప్పగించింది.
ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఘోష్ నివాసంపై శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేసింది. ఘోష్, అతడి సహచరులకు సంబంధించిన వివిధ ప్రదేశాలలో దర్యాప్తు సంస్థ అధికారులు దాడులు చేశారు. ఆస్పత్రి డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రసూన్ ఛటర్జీ ఇంట్లో కూడా సోదాలు చేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment