అభయ కేసు.... ఎప్పుడేం జరిగిందంటే.. | Kolkata doctor Case: What Happened Till Today Date Wise Highlights | Sakshi
Sakshi News home page

కేసు హైలైట్స్‌.. ఎప్పుడేం జరిగిందంటే..

Published Wed, Aug 28 2024 9:52 AM | Last Updated on Wed, Aug 28 2024 2:56 PM

Kolkata doctor Case: What Happened Till Today  Date Wise Highlights

కోల్‌కతాలో ఆర్‌జీ కర్‌ ఆసుపత్రిలో ట్రెయినీ డాక్టర్​పై హత్యాచారం ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటన జరిగి 20 రోజులు కావస్తున్న దేశ వ్యాప్తంగా ఆగ్రహాజ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో రోజురోజుకీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.  విషాదకర ఘటనను ఖండిస్తూ రాజకీయ పార్టీలు, విద్యార్ధి సంఘాలు నిరసనలు చేపట్టడం.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ నెలకొంది. పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో, మమతా బెనర్జీ ప్రభుత్వం, పోలీసులకు తీరుకు నిరసనగా బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రస్తుతం బెంగాల్‌లో బంద్‌ కొనసాగుతోంది. 

ఇదిలా ఉండగా.. ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం, ఈ కేసుకు సంబంధించి హైలైట్స్‌.. 

ఆగష్టు 8
ఆర్‌జీకర్‌ మెడికల్‌ ఆసుపత్రిలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న  జూనియర్‌ వైద్యురాలు గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్‌ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇద్దరు ట్రెయినీ డాక్టర్లలో ఒకరు బాధితురాలి మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే ఆసుపత్రి యాజమాన్యానికి, పోలీసులకు ఈ విషయాన్ని అందించారు.

ఆగష్టు 9
ఈ కేసులో పోలీసు వాలంటీర్‌ అయిన నిందితుడు సంజయ్‌ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నేరం జరిగిన ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలోని అర్ధరాత్రి సమయంలో నిందితుడు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అందులో నిందితుడి మెడ చుట్టూ బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్‌ కన్పించాయి. సెమినార్‌ హాల్‌లో వైద్యురాలి మృతదేహం గుర్తించిన ప్రాంతంలో ఈ బ్లూటూత్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సీసీటీవీ రికార్డుల ఆధారంగానే ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు.

ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కోల్‌కతా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారాంగా ఈ ఘోరానికి పాల్పడిని నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితుడు ఆసుపత్రిలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగిగా, అతడికి హాస్పిటల్‌లోని పలు విభాగాల్లో ప్రవేశించేందుకు అనుమతి ఉన్నట్లు గుర్తించారు.

ఆగష్టు 10
ఆసుప్రతిలోనే వైద్య విద్యార్ధినిపై లైంగిక దాడికి పాల్పడటం, ఆపై హత్య చేయడంపై వైద్యులు, వైద్య సిబ్బంది భగ్గుమన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ డాక్టర్లు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు.  దోషులందరికీ కఠిన శిక్షలు పడాలంటూ సోమవారం నుంచి దేశవ్యాప్తంగా విధులు బహిష్కరించి ఆందోళనలకు తెర తీశారు.

దీదీ తొలి స్పందన
ట్రైయినీ డాక్టర్‌ మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం తొలిసారి స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని, వైద్యుల నిరసనలకు తాను మద్దతిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు కూడా వారి డిమాండ్లను అంగీకరించారని అన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఈ కేసులో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అవసరమైతే నిందితులను ఉరితీస్తారని అన్నారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా కేసును వేగంగా విచారించి, నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించినట్లు  చెప్పారు.

ఆగష్టు 11
పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ట్రైనీ డాక్టర్‌ శవ పరీక్ష నివేదిక వెలువడింది. ఆమెపై లైంగిక దాడి చేసిన అనంతరం హత్య చేసినట్టు అది నిర్ధారించింది. బాధితురాలి ముఖం,కుడి చేయి, మెడ, ఎడమకాలు,పెదవులు వంటి శరీర భాగాల మీద గాయాల గుర్తులు ఉన్నాయని, ఆమె కళ్లు, నోటి నుంచి, ప్రేవేటు భాగాల నుంచి రక్తస్రావం జరిగినట్లు వెల్లడైంది.

ఆగష్టు 12
ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్య తర్వాత ఆసుపత్రి ప్రిన్సిపల్‌ సందీప్ ఘోష్ ఆగస్టు 12న ఆర్‌జి కర్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు.   సోషల్‌ మీడియాలో జరుగుతున్న అవమానాన్ని తాను భరించలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. ‘నా పేరుతో రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. నా వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న అవమానాన్ని భరించలేకపోతున్నా. నన్ను తొలగించేందుకే కొందరు కుట్రపన్ని విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. నిందితులకు శిక్ష పడాలని కోరుతున్నాను. చనిపోయిన అమ్మాయి నా కూతురు లాంటిది. నేను కూడా ఓ పేరెంట్‌నే.. పేరెంట్‌గానే రిజైన్‌ చేస్తున్నాను’ అని డాక్టర్‌ ఘోష్‌ తెలిపారు.

ఆగష్టు 13
కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిల్స్‌పై  కలకత్తా హైకోర్టు మంగళవారం విచారించింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. ఐదు రోజులు దాటినా ప్రగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది.

సీబీఐకి బదిలీ
ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిల్స్‌పై కలకత్తా హైకోర్టు మంగళవారం విచారించింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. ఐదు రోజులు దాటినా ప్రగతి లేదంటూ వైద్యురాలి కేసు  విచారణను సీబీఐకి బదలాయించింది.  అనంతరం గంటల వ్యవధిలోనే ఫోరెన్సిక్, వైద్య నిపుణులతో కూడిన సీబీఐ ప్రత్యేక బృందం హుటాహుటిన కోల్‌కతా చేరుకుంది. కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. నిందితున్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టింది.

ఆగష్టు 14
హత్యకు గురైన 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌కు న్యాయం చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్, దేశవ్యాప్తంగా బుధవారం రాత్రి 'రీక్లైమ్ ది నైట్' నిరసన ప్రారంభమైంది. అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది కాని అర్ధరాత్రి సురక్షితంగా జీవించే హక్కు స్త్రీలకు రాకపోవడంపై ఈ నిరసన చేపట్టారు.  వేలాది మహిళలు వీధుల్లోకి వచ్చారు, ప్లకార్డులు పట్టుకుని బాధితురాలు కుటుంభానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఆందోళన తొలుత శాంతియుతంగా సాగింది. అయితే, ఆసుపత్రికి చేరుకున్నాక ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రిని ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టారు. కుర్చీలు, ఇతర ఫర్నిచర్‌ను విరగ్గొట్టారు. ఆసుపత్రి బయట ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎమర్జెన్సీ వార్డును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బయట పార్క్ చేసిన పోలీసు వాహనాలపైనా ప్రతాపం చూపారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బాష్ప వాయువు ప్రయోగించారు.

ఆగష్టు 15
వైద్యురాలి హత్యాచార ఉదంతంలో ప్రధాన నిందితుడు పోలీస్‌ వాలంటీర్‌ సంజయ్‌ రాయ్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉండవచ్చన్న అనుమానాలను పోస్ట్‌మార్టం నివేదిక బలపరిచింది. మృతురాలి జననాంగంలో 151 గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించిందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఇది కచ్చితంగా గ్యాంగ్‌ రేపేనని ఆలిండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సువర్ణ గోస్వామి చెప్పారు. ‘‘మృతురాలి శరీరంలో తీవ్రమైన గాయాలున్నాయి. ఒక్క వ్యక్తి ఇన్ని గాయాలు చేయలేడు! ఎక్కువ మంది దాడి చేసినట్లు అనిపిస్తోంది’’ అన్నారు.

ఆగష్టు 16 
ఆస్పత్రి విధ్వంసంపై మమత, బెంగాల్‌ బీజేపీ నేతలు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారు. సీపీఎం, బీజేపీ కార్యకర్తలే విధ్వంసానికి పాల్పడ్డారని మమత ఆరోపించగా, అది ఆమె పంపిన తృణమూల్‌ గూండాల పనేనని బీజేపీ తిప్పికొట్టింది. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. ఆస్పత్రి విధ్వంస ఘటన పౌర సమాజానికి సిగ్గుచేటని బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనంద బోసు అన్నారు. దాన్ని తీవ్రంగా ఖండించారు.
ఆగష్టు 17
వైద్యురాలి హత్యకు నిరసనగా శనివారం వైద్యుల దేశవ్యాప్త సమ్మెకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది. నివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు ఓపీ వైద్య సేవలు బంద్‌ చేయనున్నట్లు తెలిపింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఫలితంగా దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. కొన్ని కీలక విభాగాలు మాత్రమ పనిచేశాయి.  

ఆగష్టు 18 
కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం, హత్య.. తదనంతరం దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళన, నిరసన కార్యక్రమాల ఉధృతం అవుతుండడం, ఆసుపత్రల్లో వైద్య సేవలు నిలిచిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచి్చంది. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి తగిన భద్రత కలి్పంచడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేసింది. వారి భద్రతకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై సిఫార్సులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

సుమోటోగా స్వీకరించిన సుప్రీం
కోల్‌కతా ఆర్‌జీకార్‌ ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్‌  కేసును ఆగష్టు 18న అత్యున్నత న్యాయ స్థానం సుమోటోగా స్వీకరించింది. ఈ నెల 20వ తేదీన (మంగళవారం) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది..

ఆగష్టు 19
వైద్యురాలి ఉదంతంపై పద్మ అవార్డు పొందిన 70 మందికి పైగా వైద్యులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోల్‌కతా ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో ప్రధానిని కోరారు. అలాగే వైద్య సిబ్బంది భద్రతను కోరుతూ పలు డిమాండ్లను ఆయన ముందు ఉంచారు. ప్రధాని మోదీకి లేఖ రాసిన వారిలో ప్రముఖ వైద్యులు హర్ష్ మహాజన్, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా,  ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్కే సరిన్ తదితరులు ఉన్నారు.

ఆగష్టు 20
వైద్యురాలి అత్యాచార ఘటనపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ తీరుపై మండిపడింది.  అంత ఘోరం జరిగితే.. ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ ప్రశ్నించింది.బాధితురాలి ఫొటో, పేరును ప్రచురించడంపై మీడియా సంస్థలపైనా మండపడింది. ఆలస్యంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదుపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆందోళనలపై బెంగాల్‌ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈనెల 22 లోపు ఘటనపై నివేదిక ఇవ్వాలని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మెడికల్‌ కాలేజీలో భద్రత కోసం.. 10 మందితో నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది.

ఆగష్టు 21
నిందితుడు సంజయ్ రాయ్ అత్త ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాజీ భార్యను తీవ్రంగా కొట్టేవాడని తెలిపారు. తీవ్రంగా కొట్టటంతో మూడు నెలల గర్భిణీ అయిన ఆయన భార్య గర్భస్రావానికి కారణమయ్యాడని ఆరోపణలు చేశారు. సంజయ్‌ మంచివాడు కాదని, చాలా రాక్షసంగా ప్రవర్తించేవాడని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన సంజయ్‌ను ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఆర్జీకర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యురాలి హత్యోదంతం వేళ ఆ ఆస్పత్రి తాజా మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌పై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. గతంలో ఆయన పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని అదే ఆస్పత్రి మాజీ డెప్యూటీ సూపరింటెండెంట్‌ అఖ్తర్‌ అలీ ఒక జాతీయ ఛానెల్‌ ఇంటర్వ్యూలో చెప్పారు. సందీప్‌ సెక్యూరిటీ సిబ్బందిలో నిందితుడు సంజయ్‌ రాయ్‌ కూడా ఉన్నాడని,. ఆస్పత్రి, వైద్యకళాశాలలోని అనాథ మృతదేహాలను సందీప్‌ అమ్ముకునేవాడని ఆరోపించారు.

వైద్య విద్యార్థుల డిమాండ్‌ మేరకు ఆర్‌జి కర్‌ మెడికల్‌ కాలేజీ కొత్త ప్రిన్సిపల్‌ సుహ్రిత పాల్‌ను బెంగాల్‌ ప్రభుత్వం తొలగించింది. వైస్‌–ప్రిన్సిపల్‌ బుల్‌బుల్, మరో ఇద్దరిని కూడా తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది.

ఆగష్టు 22 
తో దర్యాప్తు పురోగతిపై గురువారం సీబీఐ స్థాయీ నివేదిక సమరి్పంచింది. బెంగాల్‌ సర్కారు కూడా ఓ నివేదిక సమర్పించింది. ఈ కేసులో కోల్‌కతా పోలీసుల దర్యాప్తు అత్యంత లోపభూయిష్టమంటూ జస్టిస్‌ పార్డీవాలా ఈ సందర్భంగా మండిపడ్డారు. అర్ధరాత్రి పోస్టుమార్టం తర్వాత గానీ క్రైం సీన్‌ను పోలీసులు అధీనంలోకి తీసుకోలేదంటూ సీజేఐ ఆక్షేపించారు. అసహజ మరణమని పొద్దున్నే తేలినా ఎందుకంత ఆలస్యం చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌ దాఖలులో కోల్‌కతా పోలీసుల అసాధారణ జాప్యం అత్యంత తీవ్రమైన అంశమంటూ దుయ్యబట్టారు.

డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ గురువారం అభ్యర్థించారు.ఈ పరిస్థితిని రాజకీయం చేయవద్దని, చట్టం తన పని తాను చేసుకుంటోందని తెలిపారు. వైద్యుల సంక్షేమం, భద్రతపై తాము ఆందోళన చెందుతున్నామన్నారు.  ఈ నేపథ్యంలో 11 రోజుల సమ్మెను విరమిస్తున్నట్లు ఎయిమ్స్‌ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్‌డీఏ) తెలిపింది.

ఆగష్టు 23
కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ ఆస్పత్రిలో తమ కుమార్తెపై అత్యాచారం, హత్య ఘటనపై సీబీఐ చేపట్టిన విచారణపై విశ్వాసముందని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. ‘ఈ ఘటన వెనుక ఉన్న వారిని రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు మాకున్న అనుమానం నిజమేనని తేలింది. ఈ నేరానికి కేవలం ఒక్కరు మాత్రమే కారణం కాదు’అని శుక్రవారం నార్త్‌ 24 పరగణాల జిల్లాలోని తమ నివాసంలో మీడియాతో వారన్నారు. ఆర్‌జీ కార్‌ ఆస్పత్రిలో జరిగే అక్రమాల గుట్టును బయటపెట్టాలన్నారు.

నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీ
వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్​ రాయ్​కి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీ విధించింది. శుక్రవారంతో సీబీఐ కస్టడీ ముగియగా.. సంజయ్​ను భారీ భద్రత నడుమ పోలీసులు సీల్దా సివిల్​ అండ్​ క్రిమినల్​ కోర్టుకు తరలించారు. కాగా, కోర్టు జ్యుడీషియల్‌‌ కస్టడీ విధించడంతో.. పోలీసులు అతడిని జైలుకు తరలించారు

ఆగష్టు 24
సంజయ్‌రాయ్‌తో పాటు మరో ఏడుగురికి పాలిగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతినిచ్చింది.  కేసులో పాలీగ్రాఫ్‌ పరీక్షకు నిందితుడు సమ్మతించడంతో కోర్టు అధికారులకు అనుమతినిచ్చింది. సంజయ్‌ రాయ్‌, ఆర్జీ కర్‌ హాస్పిటల్‌ మాజీ ప్రిన్సిపల్‌ సందీష్‌ హోష్‌, మరో నలుగురు డాక్టర్లకు పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ చేస్తున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌కు జైలులోనే పాలిగ్రాఫ్‌ పరీక్ష నిర్వహిస్తామని, మిగతావారికి సీబీఐ కార్యాలయంలో టెస్ట్‌లు కొనసాగుతున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.

అయితే, విచారణ సందర్భంగా సంజయ్‌రాయ్‌ న్యాయస్థానంలో సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. తనను కావాలనే ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ  పాలిగ్రాఫ్ పరీక్షతో ఆ విషయం బయటపడుతుందని ఆశిస్తున్నానని కోర్టుకు తెలిపాడు.

ఆగష్టు 25
నిందితుడు సంజయ్‌ రాయ్‌కి పాలీగ్రాఫ్‌ టెస్ట్‌ నిర్వహించారు. నేరం జరిగిన రోజున వారు రెడ్‌ లైట్‌ ఏరియాకు వెళ్లినట్టు నిందితుడు చెప్పుకొచ్చాడు. ఆగస్టు 9వ తేదీన తెల్లవారుజామున  ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్‌ హాల్‌ వద్ద నిందితుడు ఉన్నాడు. ఆ సమయంలో బాధితురాలు సెమినార్‌ హాల్‌లోనే నిద్రిస్తోంది. కాసేపటి తర్వాత సంజయ్‌ రాయ్‌ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. అలాగే, తాను చూసే సరికే లేడీ డాక్టర్ మరణించిందని ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ చెప్పాడు.

ఆగష్టు 26
ట్రెయినీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ వాడే బైక్ సిటీ పోలీస్ కమిషనర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నది. దీంతో ఈ కేసులో పోలీసుల ప్రమేయంపై కూడా సీబీఐ విచారణ జరుపుతున్నది. ఇప్పటికే అతని బైక్​ను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. నిందితుడు సంజయ్ రాయ్ పోలీస్‌‌‌‌ డిపార్ట్​మెంట్​లో సివిక్ వాలంటీర్‌‌‌‌ అని తెలిపారు. కోల్‌‌‌‌కతా పోలీసుల వాహనాలు అన్నీ సిటీ పోలీస్ కమిషనర్‌‌‌‌ పేరుతోనే అధికారికంగా రిజిస్టర్ అయి ఉంటాయని చెప్పారు.

ఆగష్టు 27
అత్యాచారం, హత్యను ఖండిస్తూ ‘పశ్చిమబంగా ఛాత్ర సమాజ్‌‌‌‌’ స్టూడెంట్ యూనియన్ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ‘నబన్నా అభియాన్’ పేరుతో కోల్​కతాలో స్టూడెంట్లు మంగళవారం ఉదయం హౌరా నుంచి సెక్రటేరియెట్​కు ర్యాలీగా బయలుదేరారు. వీరిని సంత్రాగచి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్టూడెంట్లు, పోలీసులకు మధ్య ఘర్షణ మొదలైంది. బారికేడ్లు తోసుకుంటూ స్టూడెంట్లు ముందుకెళ్లే ప్రయత్నం చేశారు.

దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆగ్రహించిన స్టూడెంట్లు పోలీసులపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. దీంతో పోలీసులు వాటర్ కెనాన్​లతో వారిని చెదరగొట్టారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు స్టూడెంట్లు, పోలీసులకు గాయాలయ్యాయి. ఎంజీ రోడ్, హాస్టింగ్ రోడ్, ప్రిన్సెప్ ఘాట్ దగ్గర్లో, హౌరా మైదాన్​లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలువురు స్టూడెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఆగష్టు 28
స్టూడెంట్ యూనియన్ నేతలపై పోలీసుల దాడిని ఖండిస్తూ బీజేపీ బుధవారం 12 గంటల పాటు జనరల్ స్ట్రైక్​కు పిలుపునిచ్చింది. నిరసనల వెనుక బీజేపీ హస్తం ఉందని టీఎంసీ నేతలు చేస్తున్న కామెంట్లను ఖండించింది. స్టూడెంట్లపై లాఠీచార్జ్ చేయించిన మమతా బెనర్జీ తన సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. బుధవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా స్ట్రైక్ చేస్తామని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ తెలిపారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులను పోలీసులే రెచ్చగొట్టారని మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement