నిర్మాణాలను పూర్తి చేయించండి
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : నిర్మాణాలు పూర్తయిన కళాశాలలు, పాఠశాలలు, వసతి గృహాలు తదితర భవనాలను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు సంబంధించి ప్రగతిభవన్‌లో జిల్లా విద్యామౌలిక సదుపాయాల సంస్థ ఇంజనీర్లు, రాజీవ్ విద్యామిషన్ అధికారులతో సమీక్షించారు.
వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా పాఠశాలలో అదనపు తరగతి గదులు (ఏసీఆర్) తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మరో 164 ప్రాథమికోన్నత పాఠశాలలకు అదనపు తరగతుల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు మంజూరు కోసం సమర్పించాలని సూచించారు.
జిల్లాకు రెండో విడత 20 మోడల్ స్కూల్స్ మంజూరు కోసం, అలాగే 5 కోట్లు విడుదల చేయడానికి విద్యాశాఖ కమిషనర్‌కు అధికారికంగా లేఖ రాసి పంపించాలని కార్యనిర్వాహక ఇంజనీర్ క్రిష్ణారెడ్డికి కలెక్టర్ సూచించారు. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా త్వరితంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో విద్యా, మౌలిక సదుపాయాల సంస్థ ఈఈ క్రిష్ణారెడ్డి, ఆర్వీఎం ఈఈ వినయ్‌కుమార్, డిప్యూటీ ఈఈ అధికారులు పాల్గొన్నారు.
ఆధార్ సీడింగ్ పూర్తి చేయండి
జూలై ఒకటో తేదీ నాటికి ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలని డ్వామా అధికారులను జిల్లా కలెక్టర్ పి.ఎస్. ప్రద్యుమ్న ఆదేశించారు. గురువారం ప్రగతిభవన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నీటి యాజమాన్య సంస్థ సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జూలై ఒకటి నాటికి ఆధార్ సీడింగ్ ఉన్న మండలాల్లో కూలి చెల్లింపులు జరపాలన్నారు. నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) 2014-15 సంవత్సరానికి గాను *267 కోట్ల పనులు మంజూరయ్యాయని, వాటిలో * 72 కోట్లు పంచాయతీరాజ్ ద్వారా అభివృద్ధి పనులు నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల మంది కూలీలు ఉన్నారని తెలిపారు.
ఇప్పటి వరకు నమోదు కాని, నమోదైన కూలీలకు ఆధార్ సీడింగ్ ద్వారా చెల్లింపులు నిర్వహించాలని సూచించారు. ప్రతి మండలానికి మంజూరైన నిధులు, పనులపై ఏపీఓలకు అవగాహన కల్పించాలన్నారు. నీటి యాజమాన్య సంస్థ ద్వారా భూ అభివృద్ధి, మోడల్ స్కూల్స్, రోడ్ల నిర్మాణం, కచ్చా రోడ్ల పునరుద్ధరణ వంటి పనులు నిర్వహించాలన్నారు. అన్ని మండలాల్లో ఎస్సీ, ఎస్టీ అధికంగా ఉన్న గ్రామ పంచాయతీలను గుర్తించి భూ అభివృద్ధి, ఉద్యానవనం ఏర్పాటు వంటి పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ శివలింగయ్య , ఏపీఓలు పాల్గొన్నారు.