విద్యార్థుల ఆధార్‌తో అనుసంధానం
మొదటి విడతలో ఐదు జిల్లాల ఎంపిక
అందులో ఒకటి చిత్తూరు
చిత్తూరు: అన్ని ప్రభుత్వ,ప్రయివేటు పాఠశాలలు,కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సర్వర్లతో వీటిని అనుసంధానం చేయనున్నారు. దీని ద్వారా పాఠశాలలకు చెందిన మొత్తం సమాచారం అందుబాటులోకి రానుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి బయోమెట్రిక్ పరికరాలను అమరుస్తారు. 200 మంది లోపు విద్యార్థులకు ఒకటి చొప్పున ఈ పరికరాలను అమర్చనున్నారు. ఇందుకోసం మొదటి విడతలో చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, గుంటూరుతోపాటు మొత్తం ఐదు జిల్లాలను ఎంపిక చేశారు. ఈ జిల్లాల్లో తొలుత బయోమెట్రిక్ విధానానికి ఆధార్ అనుసంధానం పూర్తిచేసి దీన్ని అమలుచేయనున్నారు. తరువాత మిగిలిన జిల్లాల్లోనూ బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేస్తారు.
ఈ విధానంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, పాఠశాలలకు మంజూరవుతున్న నిధులు, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, దుస్తుల పంపిణీ, చదువు మానేసిన సమాచారంతోపాటు సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ వివరాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మార్గం సుగమం కానుంది. రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించిన ఆధార్‌కార్డు నంబర్ సేకరణ ప్రక్రియ చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. విద్యాశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 5,98,676 మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్నత చదువులకు సంబంధించి విద్యార్థులను కలిపితే 10లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 97 శాతం ఆధార్ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే ఆధార్ అనుసంధానం పూర్తిచేసి బయోమెట్రిక్ అమలు చేయనున్నారు.
ఇక పాఠశాలల్లో బయోమెట్రిక్ సిస్టమ్
Published Sun, Feb 15 2015 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM
Advertisement
Advertisement