శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న
చిత్తూరు కలెక్టరేట్: ఓట్ల లెక్కింపు రోజున నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న హెచ్చరించారు. శుక్రవారం స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో ఆర్వో, ఏఆర్వో, నోడల్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌంటింగ్‌లో పాటించాల్సిన జాగ్రత్తలను డిప్యూటీ ఎన్నికల అధికారి గిరీషాతో కలసి ప్రాక్టికల్‌గా తెలియజేశారు. ప్రద్యుమ్న మాట్లా డుతూ గతంతో పోల్చితే ఈ ఎన్నికలు ఎంతో భిన్నమైనవని పేర్కొన్నారు. కౌంటింగ్, పోలింగ్‌కు సంబంధించిఈసీకి ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయన్నారు. పోలింగ్ జరిగిన రోజున కొందరు తహసీల్దార్లు తమకేమి సంబంధం లేనట్లు ప్రవర్తించారని, ఇలాగే కౌంటింగ్ రోజున కూడా వ్యవహరిస్తే.. మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఆయా మండల పోలింగ్ కేంద్రాలకు ఆయా తహసీల్దారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కౌంటింగ్‌కు జారీ చేసిన చెక్‌లిస్టు ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేసి ఆర్వో సంతకం చేసి 11వ తేదీ సాయంత్రంలోగా అందజేయాలన్నారు. కౌంటింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను సీల్ చేసి కలెక్టరేట్‌లోని గోడౌన్‌కు తరలించాల్సిన బాధ్యత సీలింగ్ నోడల్ ఆఫీసర్‌లదేనన్నారు. ఈ శిక్షణలో సబ్ కలెక్టర్లు మహేష కుమార, కీర్తి, డీఆర్వో గంగాధరగౌడ్, ఆర్వోలు కమలకుమారి, కనకనరసారెడ్డి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
వీటిపై అవగాహన తప్పనిసరి..
ఈ సారి కౌంటింగ్‌లో కొత్తగా వీవీప్యాట్ స్లిప్పులు, ఈబీపీబీఎస్ ఓట్ల లెక్కింపును అమలు చేస్తున్నారని వీటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ నెల 15న మొదటి దశ ర్యాండమైజేషన్, 16న ఆర్వోలు కంప్లీట్ సర్టిఫికేట్ అందజేయడం, 17న కౌంటింగ్ కేంద్రాల వద్ద బయట బారికేడింగ్‌ను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అదేరోజున ఆర్వోలకు విజయవాడలో శిక్షణ ఉంటుందన్నారు. 18న కౌంటింగ్ ఏజెంట్లకు అనుమతి కార్డుల పంపిణీ, 20న రెండవ దశ ర్యాండమైజేషన్, 23న మూడో దశ ర్యాండమైజేషన్ చేసి ఉద్యోగులు ఏ టేబుల్ లో విధులు నిర్వహించాలనే విషయాన్ని ప్రకటిస్తామన్నారు. 23వ తేదీ కౌంటింగ్ మొదలయ్యే ముందు వరకు వచ్చే పోస్టల్ బ్యాలెట్‌లన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు.
గైర్హాజరైన నలుగురు తహసీల్దార్లకు నోటీసులు
ఓట్ల లెక్కింపు శిక్షణకు గైర్హాజరైన నలుగురు తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న తెలిపారు. వీరిని సస్పెండ్ చేస్తేనే జాగ్రత్తగా ఉంటారని, ముందస్తు అనుమతి లేకుండా శిక్షణకు రాకపోవడం దారుణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment