
నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో ఎంపీపీ తండ్రి పెట్ల అచ్చియ్యనాయుడు మరణించి రెండేళ్లు అవుతున్నా ఓటు తొలగించలేదు
ఓటర్ల జాబితాలో అవకతవకలు చూస్తుంటే అధికార పార్టీనాయకుల సిఫార్సులకు అధికారులు కొమ్ము కాస్తున్నట్టుంది. ఓటర్ల జాబితాల్లో ఇష్టానుసారంగా మార్పులు చేసినట్టు కనిపిస్తోంది. పురుషులను స్త్రీలుగాను, స్త్రీలను పురుషులుగాను మార్చేశారు.ఇంటిపేర్లను అటు ఇటుగా మార్చి రెండు మూడు చోట్ల ఓటు హక్కు కల్పించేలా చూశారు. ఒకే బూత్‌లో ఓటరు పేరు, తండ్రి పేరు, డోర్ నెంబరు ఒకేలా ఉంటూ.. వేర్వేరు ఐడీ నంబర్లు, వయసులతో ఓటరుకు రెండు నుంచి మూడు ఓటర్ కార్డులు జారీ చేశారు.
సాక్షి, విశాఖపట్నం: అధికార పార్టీ నేతలు వ్యూహాత్మకంగా ఓటర్ల పేర్లు, ఇంటి పేర్లను కుడి ఎడమలుగా చేసి వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు పథక రచన చేశారు. ప్రస్తుత ఓటర్ల జాబితాను పరిశీలిస్తే కళ్లు తిరిగే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. అయితే వీరి ఎత్తుగడతో జిల్లాలో వేలాది మంది తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదంలో పడనున్నారు.
పాయకరావుపేటలో1320 ఓట్లు
పాయకరావుపేట నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,24,492లు ఉండగా వీరిలో పురుషులు 1,10,961, స్త్రీలు 1,13,531 మంది ఉన్నారు. ఇక తప్పుడు ఓట్లు (ఒకే పేరు, తండ్రి పేరు మార్పు, లేదా వయసు మార్పు, లేదా ఒక ఓటరు పేరు స్మాల్‌లెటర్స్‌లో ఉంటే ఇంకొక చోట అవే వివరాలతో క్యాపిటల్ లెటర్స్‌తోను, ఫొటోలు మార్చి నమోదయినవి) ఏకంగా 1320 ఓట్లు ఉన్నాయంటే పరిస్థితి ఏంటనేది అర్థమవుతోంది.
♦ పాయకరావుపేట మండలం పెంటకోటలో నాలుగు బూత్‌లలో 3,700 ఓట్లు ఉండగా వీటిలో వెయ్యి ఓట్లు ఒకే డోర్ నంబరుతో ఉన్నాయి. ఇదే గ్రామంలో టీడీపీ సానుభూతిపరుల అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయినా వారికి ఇక్కడ ఓట్లు పదిలంగా ఉంచారు.
♦ విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో 45 నుంచి 49వ వార్డుల్లో చాలా మంది ఓటర్లకు తమ పేర్లు జాబితాలో లేకపోవడం, ఉన్నవారికి మూడు, నాలుగు చోట్ల నమోదవడంతో ఒకే డోర్ నంబర్, ఒకే పేరుతో ఇద్దరు వేర్వేరు వ్యక్తులకు ఓట్లున్నాయి. 48వ వార్డు ఇందిరాకాలనీ–1, బూత్ నంబరు 112, డోర్ నెంబర్ 63–2–146/3లో సుధీర్ సబ్బతి పేరుపై ఒక వ్యక్తి పొటో ఉంటే అదే డోన్ నంబర్, అదే చిరునామాపై సుధీర్ సబ్బాతి అనే పేరుపై మరో వ్యక్తికి ఓటు ఉంది. తొలి వ్యక్తి ఓటర్ కార్డులో ఓటరు భర్తపేరు లక్ష్మి సబ్బతి అనే ఉంటే రెండో వ్యక్తి ఓటర్ కార్డులో తండ్రి పేరు అర్జునరావు అని ఉంది. ఇదే వార్డులో సుమారు 20 మంది వైఎస్సార్‌సీపీ అభిమానుల పేర్లు ఓటర్ల జాబితాలో లేకుండా చేశారు. గతంలో ఈ ప్రాంతంలోకి సర్వే పేరిట కొంతమంది స్థానిక టీడీపీ నేతలతో రావడంతో టీడీపీ అనుకూలురను జాబితాలో ఉంచి, ఇతర పార్టీల వారిని తొలగించారని స్థానిక ఓటర్లు చెబుతున్నారు.
తవ్వే కొద్దీ వెలుగులోకి అక్రమాలు..
ఉత్తర నియోజకవర్గంలో సుజాత దార అనే మహిళ ఓటరు భర్త/తండ్రి పను రమేష్‌చందు దార అని పోలింగ్ బూత్ నెంబరు 183, సీరియల్ నెంబరు 403గా నమోదైంది. అదే ఓటరుకు తిరిగి తండ్రి/భర్త పేరు చందు (ఇంటి పేరు లేదు)గా పోలింగ్ బూత్ 183లో సీరియల్ నంబరు 894గా నమోదైంది.
స్థానికంగా లేకపోయినాఓట్లు పదిలం..
ఇతర జిల్లాలకు తరలిన వెళ్లిన వారితో పాటు నగరంలోని వేరే చోట్లకు ఇళ్లు మారిపోయిన వారి ఓట్లు రద్దు చేయకపోగా వారికి మరిన్ని ఓటరు గుర్తింపు నంబర్లు ఇవ్వడం విడ్డూరంగా మారింది. వీరి ఓట్లకు సరిహద్దులే లేని విధంగా ఉన్నాయి.
♦ ఉదాహరణకు వార్డులోని 22వ బూత్‌లో లక్ష్మి నక్కా (బీజీవై 6208078) (డోర్ నంబరు 37–11–192 పట్టాభిరెడ్డి గార్డెన్స్) (వయసు 56) అనేపేరుతో ఉత్తర నియోజకవర్గంతోపాటు, ఆమె పేరు ఓటరు ఐడీ నంబరు సీవై జెడ్ 1554021తో నక్కాలక్ష్మిగా(వయసు 35) నరసన్నపేట(శ్రీకాకుళం జిల్లా)లో డోర్‌నంబరు 1–5లో నమోదైంది.
♦ బూత్ నంబరు 23లో భాగ్యలక్ష్మి బొట్ట(32)(ఐడీవై 1224138) డోర్ నంబరు 37–12–36/1గా పట్టాభిరెడ్డి గార్డెన్స్‌లో నమోదైంది. ఈమె పేరు డోర్‌నంబరు మారుస్తూ (5–401) విశాఖ తూర్పు బూత్ నంబరు 65లో నమోదు అయింది.
♦ కామాక్షినగర్‌లోని బూత్ నంబరు 42లో షేక్ ఖలీల్ భాషా (31), డోర్‌నంబరు 36–92–22, చాకలి గెడ్డ, ఓటరు ఐడీ నంబరు ఏసీకే 8383465, నమోదు కాగా అతని పేరు కొద్దిగా మారుస్తూ షిఫ్టెడ్ ఓటుగా ఖలీల్ భాషా షేక్ (30)గా డోర్‌నంబరు 4–69 మర్రిపాడులోని ఆత్మకూరులో (నెల్లూరు) నమోదైంది. ఖలీల్ భాషా షేక్ పేరును అటుఇటు తారు మారు చేస్తూ 8 ఓట్లు నమోదయ్యాయి.
♦ షిఫ్టెడ్ ఓట్లకు సంబంధించి టెక్కలి వెళ్లిపోయిన ప్రభావతి రోణంకి (ఎంజేడబ్ల్యూ 0928244) అదే నంబరుతో 25వనంబరు బూత్Œ లో ఉంది. ఆమె భర్త శ్యామలరావు (ఎంజేడబ్లు్య 0928251) పేరు కూడా రెండు చోట్ల ఉంది. ఎచ్చెర్లకు తరలి వెళ్లిన చెల్లా లక్ష్మి (38సం) (ఏపీ 030180039243)తో ఎచ్చెర్లో ఉండగా, ఉత్తర నియోజకవర్గంలోని బూత్‌నంబరు 36లో లక్ష్మి చెల్లా (43సం)గా బర్మా కాలనీలో (ఏసీకే 9019209) నమోదైంది. ఆమె పేరు చల్లా లక్ష్మిగా నెల్లిమర్లలో కూడా నమోదైంది. ఆమె పేరున ఆరు ఓట్లు ఉన్నాయి.
నర్సీపట్నంలో అధికశాతం బోగస్
నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఇతర ప్రాంతాల్లో ఉన్న టీడీపీ సానుభూతిపరుల వివరాలు సేకరించి అధిక సంఖ్యలో బోగస్ ఓట్లను చేర్పించారు. నియోజకవర్గంలోని కొందరి ఓట్లు ఒకే పేరు, తండ్రి, భర్త పేర్లు ఒకేలా ఉంచి పొటోలు మార్చేశారు. నాతవరం మండలం వైబీ అగ్రహారానికి చెందిన ఓటరు జాబితాలో ఓటరు వనిమిన సూర్యకాంతం పొటోకు బదులుగా ఎవరో గుర్తు తెలియని పురుషుడి పొటో అమర్చారు. మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం 210 పోలింగ్ బూత్‌లో నమ్మి దేముడమ్మ ఓటు ఉంది. వాస్తవంగా ఈ పేరు గల ఆమె ఊరులో లేదు. కానీ ఆమె పేరున ఇక్కడ ఓటరుగా చేర్పించారు. ఇదే పోలింగ్ బూత్‌లో వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రస్తుత తాజా మాజీ సర్పంచ్ భర్త అసలు పేరు పోలిరెడ్డి రమణ కాగా ఓటు హక్కు లేకుండా చేసేందుకు ఓటరు జాబితాలో టీడీపీ నాయకులు రమణకు బదులు వెంకటరమణగా నమోదు చేయించారు.
రెండు మూడు కార్డులు..
ఉత్తర నియోజకవర్గంలో ఒకే వ్యక్తికి రెండు, మూడు ఓట్లు జారీ చేశారు. భర్త పేరు, వయసు, చిరునామా అంతా ఒకేలా ఉన్నా , రెండు వేర్వేరు పేర్లతో ఒకే వ్యక్తికి ఓట్లు ఇచ్చేశారు.
జీవీఎంసీ 12వ వార్డు రామకృష్ణానగర్‌లో ఉంటున్న మహిళకు భారతి వూన, ధనలక్ష్మి వూన వేర్వేరు పేర్లతో రెండు ఓటరు కార్డులు జారీ చేశారు. భర్త పేరు, వయసు, చిరునామా ఒకటే ఉన్నాయి. ఏసీకే0764481, ఏసీకే0911685 వేర్వేరు ఐడీలతో కార్డులు ఉన్నాయి.
♦ 12వవార్డు శంఖువానిపాలెంలో ఉంటున్న మహిళలకు ఒకే పోలింగ్ బూత్‌లో ఏసీకే1039502, ఏసీకే1039486, ఏసీకే1039494 ఐడీలతో మూడు ఓటు కార్డులు జారీ అయ్యాయి. రెండు కార్డులలో వెంకట శివలక్ష్మి జ్యోత్స్నరెడ్డి, మూడవ కార్డులో వెంకట శివలక్ష్మి జ్యోత్స్న అని ఉన్నాయి. ఆమె భర్త పేరు పేరు మాత్రం ఒక్కో కార్డులో ఒక్కోలా ఉంది. వెంకట రవిశంకర్, రాఘవరపు వెంకట రవిశంకర్, రాంబాబు రెడ్డి ఇలా వేర్వేరుగా ఉన్నాయి. వయసు, చిరునామా ఒకేలా ఉన్నాయి.
♦ 12వ వార్డు శంఖువానిపాలెంకు చెందిన సతీష్‌కుమార్ ఆకుల పేరుతో రెండు ఓటరు కార్డులు జారీ చేశారు. తండ్రి పేరు, చిరునామా, ఒకటే ఉన్నాయి. ఏకేసీ1008812, ఏసీకే1002617 వేర్వేరు ఐడీలతో రెండు కార్డులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment