ఉంటుందా.. ఊడుతుందా.? | TDP Leaders Removes YSRCP Voters In YSR Kadapa | Sakshi
Sakshi News home page

ఉంటుందా.. ఊడుతుందా.?

Published Thu, Nov 1 2018 2:00 PM | Last Updated on Thu, Nov 1 2018 2:00 PM

TDP Leaders Removes YSRCP Voters In YSR Kadapa - Sakshi

కడప కార్పొరేషన్‌: కడప, పులివెందుల, బద్వేలు నియోజకవర్గ పరిధిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులే లక్ష్యంగా ఓట్లను తొలగించినట్లు స్పష్టమవుతోంది. ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని భావించి కడపలో గతంలో  ఏకంగా లక్షా పన్నెండు వేల  ఓట్లు తొలగించారు. ఇందులో ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీల ఓట్లు ముప్‌పై ఐదు వేల వరకు ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం రెండేళ్ల క్రితం నగరపాలక సంస్థలో కొత్త డోర్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. నగరాన్ని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌ అనే నాలుగు జోన్లుగా విభజించి ఈ డోర్‌ నంబర్లు కేటాయించారు.  ఈ క్రమంలో కొన్ని ఇళ్లకు నంబర్లు వేయకపోగా, రెండు, మూడు అంతస్తులు ఉన్న ఇంటికి గ్రౌండ్‌ఫ్లోర్‌కు మాత్రమే ఒకే డోర్‌ నంబర్‌ ఇవ్వడంతో పై రెండు అంతస్తుల్లో ఉన్నవారి ఓట్లు తొలగించారు. ఇలా కొత్త డోర్‌ నంబర్లు లేనిఇళ్లలో ఉన్న ఓట్లన్నీ ఎలాంటి విచారణ చేపట్టకుండానే తొలగించారు. దీనిపై వైఎస్‌ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులు పలుసార్లు కలెక్టర్లకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేయడంతో ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ బీఎల్‌ఓలను పంపించి విచారణ చేశారు. ఈ మేరకు కొన్ని ఓట్లు నమోదు చేయించారు. వైఎస్‌ఆర్‌సీపీతోపాటు వివిధ రాజకీయ పార్టీలు కూడా ఓటు నమోదు కార్యక్రమాలు చేపట్టి ఆన్‌లైన్‌లో ఓట్లు నమోదు చేయించారు. ఇక కడప తహసీల్దార్‌ కార్యాలయానికైతే ఓటరు నమోదు ఫారాలు గుట్టలు, గుట్టలుగా వచ్చిపడ్డాయి. వీటి సంఖ్య సుమారు 40వేలుగా ఉండవచ్చని తెలుస్తోంది. అయితే వీటన్నింటిలో ఎన్ని ఓట్లు ఓటర్ల జాబితాలో నమోదవుతాయో తెలియడం లేదు.

చెల్లాచెదురైన ఓట్లు: పోలింగ్‌ బూత్‌లను రేషన్‌లైజేషన్‌ చేయడం వల్ల గతంలో 245 పోలింగ్‌ బూత్‌లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 267 కు పెరిగింది. అలాగే ఒక డివిజన్‌లో ఓట్లు ఇతర డివిజన్లకు విసిరేయబడ్డాయి.ఉదాహరణకు అక్కాయపల్లె 47వ డివిజన్‌కు సంబంధించి 16,17,18,19 పోలింగ్‌ బూత్‌ల్లో ఉండాల్సిన ఓట్లు కొన్ని 12, 27 బూత్‌లలో ఉన్నాయి. 40వ డివిజన్‌ మరియాపురం, అరుంధతి నగర్‌లలోని ఓట్లు రామకృష్ణ కాలేజీ పోలింగ్‌ బూత్‌లో ఉన్నాయి. చెమ్ముమియ్యాపేటలోని కొన్ని ఓట్లు ఆలంఖాన్‌పల్లెలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఓటర్లు పోలింగ్‌ బూత్‌ ఎక్కడో కనుక్కోలేక గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నియమావళి ప్రకారం ఒక్క ఓటును తొలగించాలన్నా చుట్టుప్రక్కల వారి అభ్యంతరాలు స్వీకరించి, విచారణ జరిపి నోటీసు ఇచ్చిన తర్వాతే తొలగించాలి. అయితే ఎలాంటి విచారణ చేయకుండా 1.12లక్షల ఓట్లను తొలగించడంపై వైఎస్‌ఆర్‌సీపీతోపాటు పలు పార్టీలు ఆగ్రహిస్తున్నాయి. కడప, పులివెందుల, బద్వేల్‌ నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులకు ఎక్కువ మెజార్టీ వచ్చినందునే ఓట్లను గుంపగుత్తగా తొలగించారని వారంటున్నారు. దీనిపై న్యాయపోరాటం కూడా చేసేందుకు సన్నద్ధవుతున్నట్లు తెలుస్తోంది.

గడువు పెంచాలని కోరిన మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు
ఓటరు నమోదుకు మరో మూడు వారాలు గడువు పెంచాలని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషాలు ఎన్నికల కమీషన్‌కు విజ్ఞప్తి చే శారు. అవగాహనరాహిత్యంతో చాలామంది ఓటు నమోదు చేసుకోలేక పోయారని ప్రజా ప్రయోజనార్థం గడువును పొడించాలని విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. మరి ఎన్నికల కమిషన్‌ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement