విజయనగరం గంటస్తంభం: ఓటర్ల జాబితాలో లోపాలుంటే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరం. ఓటు నమోదు చేసుకున్న ఓటరుకు ఓటు లేకపోయినా... ఒకరు అనేక ఓట్లు వేసే అవకాశం కల్పించినా ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ఈ పరిస్థితికి ఓటర్ల జాబితా సక్రమంగా తయారు చేయలేని ఎన్నికల సంఘానిది. అందులో పని చేసే అధికారులది. అందుకే ఎన్నికలసంఘం ముందే మేల్కొంది. ఓటర్ల జాబితాలో లోపాలపై వస్తున్న ఆరోపణలపై స్పందించింది. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాను సరి చేసే పక్రియ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఎన్ని బోగస్ ఓట్లు తేలుతాయి? ఎంతమందిని తొలిగిస్తారన్నది వేచి చూడాలి. ఎనలిస్టు అండ్ స్ట్రాటజీ టీమ్ రెండు రాష్ట్రాల్లో ఇటీవల జరిపిన ఆధ్యయనంలో ఓటర్ల జాబితాలో అనేక లోపాలు వెలుగుచూసిన విషయం విధితమే. ఒకే ఓటరు ఐడీతో బహు ఓట్లు.. రెండేసి ఓటరు ఐడీతో వేర్వేరు చోట్ల ఓట్లు.. ఒకే పేరుతో పలు పోలింగు కేంద్రాల్లో ఓట్లు.. తదితర లోపాలతో ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 57 లక్షలకు పైగా ఓట్లు ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో బోగస్ ఓట్లు చాలా వరకు ఉన్నాయి. జిల్లాలో కూడా వేలాది ఓట్లు ఉన్నట్లు తేలింది. దీనిపై ‘సాక్షి’ దినపత్రిక పలు వరుస కథనాలు ప్రచురిస్తున్న విషయం విధితమే. ఈ నేప్యథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్పందించింది. ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న లోపాలను సవరించాలని నిర్ణయించింది. ఒక ఓటరు బహు ఓట్లు పొందడం.. స్థానికంగా లేని వారికి ఓటుహక్కు ఉండడం వంటి విషయాలపై దృష్టి పెట్టింది.
జిల్లాకు అనుమానిత ఓటర్ల వివరాలు
ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తించిన డవుట్ ఫుల్ (అనుమానాస్పద) ఓటర్ల వివరాలు జిల్లా అధికారులకు పంపించింది. జిల్లా అధికారులకు తాజాగా చేరిన వివరాల ప్రకారం జిల్లాలో 1,10,036 మంది అనుమానిత ఓటర్లున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి ఓటర్లు వేలాదిగా ఉన్నారు. ఇందులో బోగస్ ఓటర్లు ఉండవచ్చునని ఎన్నికలసంఘం భావిస్తోంది. ఒకే పేరుతో ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండడం.. వేర్వేరు ప్రాంతాల్లో అదే పేరుతో ఓట్లు ఉండడం.. ఓటరు ఐడీ మారి జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలు పరిశీలించి బోగస్ ఓట్లు తొలగించాలని నిర్ణయించింది. అదేవిధంగా వయస్సు, లింగం, ఇతర వివరాలు తప్పుగా నమోదైన ఓట్లు కూడా 7 వేలకుపైగా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి పరిశీలించి సరి చేయడం వంటివి కూడా చేయాలని నిర్ణయించారు.
నేటి నుంచి పరిశీలన
ఓటర్ల జాబితా ఆధారంగా శుక్రవారం నుంచి ప్రతి పోలింగ్ కేంద్రంలో రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరిశీలించనున్నారు. బీఎల్‌ఓ ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటేనే ఆ వివరాలు అప్‌లోడ్ చేస్తారు. అనుమానంగా ఉన్నా, ఓటరు లేకపోయినట్లు తేలినా, బోగస్ ఓటుగా తేలినా వెంటనే తొలిగించేందుకు సిఫార్సు చేస్తారు. ఇందుకు సంబంధించి పోలింగ్ బూత్ వారీగా అనుమానిత ఓటర్ల జాబితా జిల్లా అధికారులకు చేరింది. వాటిని జిల్లా అధికారులు తహసీల్దార్లకు పంపించారు. వారు బీఎల్‌వోలకు ఇచ్చి శుక్రవారం నుంచి పరిశీలన చేయిస్తారని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment