ఓట్ల గల్లంతు | Mistakes In Voterlists Vizianagaram | Sakshi
Sakshi News home page

ఓట్ల గల్లంతు

Published Thu, Nov 1 2018 8:39 AM | Last Updated on Thu, Nov 1 2018 8:39 AM

Mistakes In Voterlists Vizianagaram - Sakshi

ఓ వైపు ఓటర్లనమోదుపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. కొత్తగా ఓటర్ల చేర్పింపు ప్రక్రియ జోరుగాచేపడుతున్నారు. కానీ మరోవైపు చాపకింద నీరులా పాతవాటి తొలగింపు ప్రక్రియ కూడా అంతే జోరుగా సాగుతోంది. తాజా పరిస్థితులు ఓటర్లను ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి. నిరంతరం జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో కాపలా కాసుకోవడానికీ సమయం కేటాయించాల్సి రావడం ఇబ్బందికరంగా మారుతోంది.

విజయనగరం గంటస్తంభం: జిల్లాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2014 ఎన్నికలతో పోల్చి చూస్తే వేలాది ఓట్లు తగ్గిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చేర్పులు ఓ వైపు సాగుతుండగా ఇంతగా తగ్గుతున్నాయంటే దీనివెనుక అసలు కారణాలేమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఓట్లు చాలా కీలకం. భారతీయ పౌరుడై 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలి. అర్హులకు ఓటుహక్కు లేకపోతే, వారే ఓటువినియోగించుకోకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇం తటి కీలకమైన ఓటర్ల విషయంలో ఏమాత్రం తప్పు జరిగినా మెజార్టీ ప్రజల అభిప్రా యం ప్రతిబింబించదు. అంతేకాదు సరైన పాలకులు చట్టసభలకు ఎన్నికయ్యే అవకా శం ఉండదు. కానీ జిల్లాలో అనేక మంది ఓట్లు జాబితా నుంచి ఆదృశ్యమవుతున్నాయి. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

40,247 ఓట్లు తగ్గుదల
2014లో సాధారణ ఎన్నికల నాటికి జిల్లాలో 17,18,744మంది ఓటర్లు జాబితాలో ఉన్నా రు. అధికశాతం మంది ఓటుహక్కు కూడా వినియోగించుకున్నారు. ఈ సంఖ్య నాలుగేళ్లలో గణనీయంగా తగ్గింది. తాజాగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించి 2018 సెప్టెంబర్‌ ఒకటోతేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించిన విషయం విదితమే. అందులో జిల్లాలో 16,78,497మంది ఓటర్లే ఉన్నట్టు తేలింది. అంటే జిల్లాలో 40,247 ఓట్లు తగ్గాయి. వాస్తవానికి ఏటా మృతి చెందిన, ఇతర ప్రాంతాల కు శాశ్వతంగా వలస వెళ్లినవారి ఓట్లను తొలగించడం సహజం. కానీ అదే సమయంలో ఓటర్లు చేర్పులు కూడా జరుగుతున్నందున సంఖ్యలో పెద్ద తేడా రాకూడదు. పైగా తొలగింపులు కంటే చేర్పులు ఎప్పుడూ ఎక్కువగా ఉంటున్నందున గత జాబితా కంటే కాస్తో కూస్తో పెరగాలి. కానీ గత ఎన్నికలతో పోల్చి చూస్తే వేలాది ఓట్లు మాయం కావడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు సాలూరు నియోజకవర్గంలో స్వల్పంగా పెరిగి, నెల్లిమర్ల నియోజకవర్గంలో వందల్లో ఓట్లు తగ్గగా మిగతా నియోజకవర్గాలో భారీగా తగ్గడం గుర్తించాల్సిన అంశం.
           
ఒకేసారి కాకుండా...: ఇన్ని ఓట్లు ఒకేసారి కాకుండా దశలవారీగా తొలగిస్తూ వచ్చారు. 2014 ఎన్నికల తర్వాత ఈ మధ్య కాలంలో ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు జరగలేదు. దీనివల్ల ఓట్లు ఉన్నాయా? లేదా? అన్న విషయం ఓటర్లు తెలుసుకోలేదు. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలు లేనందున ఓటర్ల జాబితా సవరణపై పెద్దగా దృష్టి పెట్టలేదు. బీఎల్‌వోలు స్థానికంగా లేకపోతే చాలు తీసేశారు. తాత్కాలికంగా వలస వెళ్లిన వారి ఓట్లు కూడా లేపేశారు. ఇక ప్రతిపక్షాలకు చెందిన సానుభూతిపరుల ఓట్లు అధికారపార్టీ నాయకులకు తలొగ్గి తీశారు. గుర్లమండలం చింతలపేటలో బీఎల్‌వో అధికారపార్టీ నాయకులకు ఒత్తిడికి తలొగ్గి వైఎస్సాఆర్‌సీసీ సానుభూతిపరుల ఓట్లు తొలిగించారని ఆపార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త జేసీకి గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. ఓట్ల తొలగింపుపై సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర పలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఓట్ల తొలిగింపుపై అప్రమత్తంగా ఉండాలి. బుధవారంతో ఓటర్ల చేర్పులు, తొలగింపులు, ఇతర దరఖాస్తులు స్వీకరణ గడువు ముగియడంతో గురువారం నుంచి అభ్యంతరాలు తెలపవచ్చు. ఈ అవకాశాన్ని పేర్లు గల్లంతైనవారు వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జనాభాకు తగ్గట్టుగానే ఓటర్లు ఉన్నారు
2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుత జనాభా అంచనా వేయగా అందులో 70శాతం ఓటర్లు ఈ ఏడాదికి ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఉన్న ఓటర్ల కంటే తగ్గే ప్రసక్తి లేదు. ఒకవేళ అప్పట్లో బినామీ ఓటర్లు, తర్వాత వలస వెళ్లిన వారి ప్రకారం అప్పట్లో ఎక్కువ ఉండొచ్చు. ఏదిఏమైనా పరిశీలిస్తాం. అనవసరంగా ఒక్క ఓటు తొలగిపోవడానికిగానీ, చేరడానికిగానీ లేదు. అలాంటిదేమైనా జరిగి ఫిర్యాదులు వస్తే తహసీల్దార్లు బాధ్యులవుతారు.         – జె.వెంకట్రావు, డీఆర్వో, విజయనగరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement