ముగిసిన తొలి ఘట్టం.. | Voter list Ready in Vizianagaram | Sakshi
Sakshi News home page

ముగిసిన తొలి ఘట్టం..

Published Fri, Nov 2 2018 7:59 AM | Last Updated on Fri, Nov 2 2018 7:59 AM

Voter list Ready in Vizianagaram - Sakshi

విజయనగరం గంటస్తంభం: ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించి తొలిఘట్టం ముగిసింది. ఓటర్ల నమోదు, తొలగింపులు, సవరణ, ఓటు బదిలీలకు సంబంధించిన గడువు గత నెలాఖరుతో ముగిసింది. మొత్తం రెండు నెలల పాటు సాగిన ఈ ప్రక్రియలో ఓటు నమోదుతో పాటు తొలగింపులకు సైతం భారీగా దరఖాస్తులు రావడం విశేషం. అయితే వీటి విచారణ పూర్తయిన తర్వాత ఎంతమంది ఓటర్లు చేరుతారు.. ఎంతమంది వైదొలుగుతారన్నది చూడాలి. ఈ ఏడాది సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ వరకు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన విషయం విధితమే. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ ఒకటో తేదీన అంతకుముందున్న ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రచురించి అదే రోజు నుంచి ఓటు నమోదుకు ఫారం–6, ఓటు తొలిగింపునకు ఫారం–7, తప్పుల సవరణకు ఫారం–8, ఓటు నియోజకవర్గ అంతర్గత బదిలీకి ఫారం–8ఎ లను స్వీకరించారు. ఈ ప్రక్రియ అక్టోబర్‌ 31వ తేదీతో ముగిసింది. ఇలా వచ్చిన దరఖాస్తుల్లో అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన నవంబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభించారు. ఈ నెలాఖరు వరకు వాటిని పరిశీలించి, విచారణ చేసి అర్హత ఉన్న వాటిని పరగణలోనికి తీసుకుంటారు. వచ్చే నెలలో తుది జాబితా తయారు చేసి జనవరి 4న అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఫైనల్‌ లిస్ట్‌ ప్రకటిస్తారు. 

నమోదుకు భారీగా దరఖాస్తులు
ఓటు నమోదుకు ఈసారి భారీగానే దరఖాస్తులు వచ్చాయి. ఈ రెండు నెలల్లో ఓటు కోసం ఏకంగా 68,755 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 49,409 మంది నేరుగా ఫారాలు కార్యాలయాలకు సమర్పించారు. మరో 19,346 మంది ఆన్‌లైన్‌ ద్వారా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్నారు. విచారణ తర్వాత కొన్ని దరఖాస్తులు తిరస్కరించినా అవి రెండువేల లోపే ఉంటాయి. అంటే కొత్తగా 66 వేల వరకు ఓట్లు పాత జాబితాకు కలుస్తాయి.  తొలిగింపులకు 11 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. 11 వేల ఓట్లు పోయినా ప్రస్తుతం ఉన్న ఓటర్లకు 55 వేల ఓటర్లు అదనంగా కలుస్తారు. పాత ఓటర్లు 16.78 లక్షల వరకు ఉన్నందున కొత్తవి కలిస్తే జనవరి 4వతేదీ నాటికి జిల్లా ఓటర్ల సంఖ్య 17.33 లక్షలు దాటిపోనుంది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం జనాభాలో 70 శాతం మంది ఓటర్లు  ఉండాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 23,44,474 మంది జనాభా ఉండగా ఎనిమిదేళ్లలో పెరుగుదల ప్రకారం 24,25,128 మంది ఉంటారని అధికారుల అంచనా. ఈలెక్కన జిల్లాలో 16,97,589 మంది ఉండాలి. అంటే జనాభా నిబంధన కంటే ఎక్కువ మంది ఓటర్లు భవిష్యత్‌లో ఉండడం విశేషం. ఒక విధంగా ఇది అనుమానించాల్సిన విషయమే. 

తొలిగింపులకు అంతే
తొలిగింపులకు కూడా ఎప్పుడూ లేనంతగా దరఖాస్తులు రావడం విశేషం. ఈసారి దరఖాస్తుల స్వీకరణలో 11,588 దరఖాస్తులు రాగా ఇందులో నేరుగా కార్యాలయాల్లో ఫారం–7 ఆఫ్‌లైన్‌లో ఇచ్చిన వారు 10,915 మంది కాగా ఆన్‌లైన్‌ ద్వారా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్న వారు 673 మంది. అయితే రెండు రోజుల కిందట వరకు 4 వేల వరకు దరఖాస్తులు రాగా అఖరిలో ఏకంగా 11వేలకు చేరడం విశేషం. అధికార పార్టీ నాయకులు భారీగా దరఖాస్తులు ఇచ్చి వాటిని తొలిగించాలని కోరడంతో ఒకేసారి తొలిగింపులకు ఇన్ని దరఖాస్తులు వచ్చాయన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. వాస్తవానికి జులై, ఆగస్టులో జరిగిన ఇంటింటికి సర్వే పక్రియలో ఏకంగా 14,359 ఓట్లు తొలిగించారు. తాజాగా వచ్చిన వాటిలో కొన్ని తిరస్కరించినా 10 వేలకు పైగానే తొలిగిస్తారు. అంటే ఈఏడాదిలో 24 వేలకు పైగా ఓట్లు తొలిగించడం అనుమానాలకు తావిచ్చే అంశం. దీనివెనుక ఏమి జరుగుతుందో గమనించాల్సిన అంశం ఓటర్లపై ఉంది. కావున ముందే అప్రమత్తమై ప్రస్తుతం అభ్యంతరాలు స్వీకరిస్తున్నందున తొలిగింపులపై కన్నెసి ఉంచితే ఓటు కోల్పోకుండా ఉంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement