తాజా ఓటర్ లిస్టులో సయ్యద్ ఇఫ్తికార్ ఉద్దీన్‌కు ఓటు.. జీహెచ్‌ఎంసీ డెత్ సర్టిఫికెట్
సాక్షి,సిటీబ్యూరో: ఈనెల 7న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ కూడా సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 4.93 లక్షల బోగస్ ఓట్లను ఏరివేశామని ప్రకటించారు. ఇందులో 1.80 లక్షల ఓట్లు మరణించిన వారివి ఉన్నాయన్నారు. అయితే, గ్రేటర్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ‘డబుల్’ ఓట్లు, వార్డు నంబర్ లేని బోగస్ ఓట్లు, ఒకే పేరు మీద, ఒకే పోలింగ్ బూత్‌లో సీరియల్‌గా 17 ఓట్లు, 2008 నుంచి 2018 ఆగస్టు మధ్య మరణించిన వారి పేర్లు వందలకొద్దీ తాజా లిస్టులో దర్శనమిస్తున్నాయి. అంతేకాదు గతంలో స్వచ్ఛందంగా ఓట్లు తొలగించుకున్న పేర్లు సైతం ఈ లిస్టులో ఉన్నాయి. ఫిర్యాదులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఓటరు లిస్టును పరిశీలించి సవరిస్తామని ఉన్నతాధికారులు చెప్పిన మాటలు కింది స్థాయిల అధికారులు అమలుచేసినట్టు ఎక్కడా కనిపించడం లేదు. గ్రేటర్ పరిధిలోని ఈఆర్‌ఓల నుంచి బూత్ లెవల్ అధికారుల వరకు ఓటరు లిస్టుల పరిశీలన చేశారా లేదా అన్న సందేశాలు ఉత్పన్నమవుతున్నాయి.
తాజా లిస్టులో తప్పులు మచ్చుకు కొన్ని..
నాంపల్లి నియోజకవర్గాంలో బూత్ నంబర్ 269, క్రమ సంఖ్య 28, 29లో వేర్వేరు పేర్లతో ఒకే మహిళ ఓట్లు ఉన్నాయి. ఇదే బూత్‌లో 12–2–830/ఎ/50/ఎ, 122830/1/50/1/ఎ ఇంటి నంబర్‌పై మహిళల ఫొటో ఒక్కరే. ఆమె పేరు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. ఇదే నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నంబర్ 234లో కూడా క్రమ సంఖ్య 1217 నుంచి 1233 వరకు పలువురు వ్యక్తుల ఓట్లు ఒకే ఫొటోతో మూడు నుంచి నాలుగు సార్లు నమోదు చేశారు.
వార్డు నంబర్ లేని ఓట్లు కూడా
నాంపల్లి నియోజకవర్గంలో వార్డు నంబర్ 10, 11, 12 వరకు ఇంటి నంబర్లు ఉన్నాయి. ఈ వార్డు నంబర్ల అధారంగా ఓటరు లిస్టుల్లో పేర్లు నమోదు చేశారు. అయితే పోలింగ్ బూత్ నంబర్ 1లో క్రమ సంఖ్య 1 నుంచి 30 వరకు వార్డు నంబర్లు పొంతన లేకుండా 1–1–946, 4–2, ఇలా 30 మంది ఓట్లు నమోదు చేశారు. అదే బూత్ క్రమ సంఖ్య 31 నుంచి వార్డు నంబర్లు సక్రమంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలోని 271 పోలింగ్ బూత్‌లో క్రమ సంఖ్య 1024 నుంచి 1053 వరకు ఇంటి నంబర్లు సైతం సక్రమంగా లేవు.
ఒకే పేరుపై 17 ఓట్లు
యాకుత్‌పురా నియోజకవర్గం బూత్ నంబర్ 120లో క్రమసంఖ్య 33 నుంచి 37 వరకు ఓ మహిళ పేరుతో ఓట్లు నమోదు చేశారు. అంతేకాదు ఇదే పోలింగ్ బూత్‌లో క్రమ సంఖ్య 116 నుంచి 128, 129 నుంచి 135 వరకు ఒకే వ్యక్తి పేరుతో 17 ఓట్లు ఉన్నాయి.
లిస్టులో మరణించినవారి పేర్లు సైతం..
నాంపల్లి నియోజకవర్గంలోని బూత్ 16 పరిధిలో ఉండే రఫత్ ఉన్నీసా బేగం 2008లో ఆగస్టులో మరణించినట్లు జీహెచ్‌ఎంసీ ధ్రువీకరించింది. అయినా ఆమె పేరుతో అదే బూత్‌లో క్రమసంఖ్య 555లో ఓటు ఉంది. అలాగే బూత్ నంబర్ 14 పరిధిలో ఉండే సయ్యద్ ఇఫ్తకార్ ఉద్దీన్ సైతం మరణించినట్టు జీహెచ్‌ఎంసీ ధ్రువీకించింది. అయినా తాజా ఓటర్లు లిస్టులో అతడి పేరు కూడా ఉంది. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో ఓట రు లిస్టుల్లో తప్పులు యథాతధంగా ఉన్నాయి.
♦ ఖైరతాబాద్‌లోని బూత్ నంబర్ 61, క్రమసంఖ్య 1006లో జహీరుద్దీన్ అహ్మద్‌ఖాన్‌కు ఓటుంది. ఇతడికి నాంపల్లి నియోజకవర్గం బూత్ నంబర్ 94లోనూ ఓటు ఉంది. ఇలాంటి వారు చాలామందే ఉన్నారు.
♦ గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్‌లో ఉంటున్న ఇతర జిల్లాలు, గ్రామాల ఓటర్ల పేర్లు నగరంలో కూడా ఉంటే తొలగించుకోవాలని అధికారులు సూచించారు. దీంతో పలువురు తమ ఓటును వారు సొంత ప్రాంతాల్లో ఉండాలని, నగరంలో తొలగించుకున్నారు. ప్రస్తుతం అలాంటి వారికి కూడా నగరంలో ఓట్లు తిరిగి నమోదు చేశారు. వారికి రెండుచోట్ల ఓట్లు ఉన్నాయి.
♦ నాంపల్లి, యాకుత్‌పురా నియోజకవర్గాల్లోనే కాదు.. గ్రేటర్‌లో ఇదే పరిస్థితి ఉంది. గ్రేటర్‌లోని ప్రతి నియోజకవర్గంలోను దాదాపు 150 మంది మరణించిన వారి పేర్లతో ఓట్లున్నాయి. అధికారులు ఏ స్థాయిలో ఓటరు లిస్టు పరిశీలనలో నిర్లక్ష్యం వ్యవహరించారంటే.. 2009 నుంచి 2018 మధ్య మరణించి వారు సైతం ఓటరు లిస్టులో దర్శనమిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment