ఓట్లు తొలగింపు దరఖాస్తులపై వేటపాలెం తహశీల్దార్‌కు ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్లు
ఒంగోలు సిటీ: వీరు మనోళ్లు కాదు. మనకు ఓటెయ్యరు. ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా పని చేస్తారు. ఒక వర్గాన్ని ప్రభావితం చేస్తారు. వీరి వల్ల ఫలితాల్లో నష్టపోతాం. ఇలా రకరకాలుగా ఓటర్లను బేరీజు వేసి, వారి ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోంది. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ సానుబూతి పరుల ఓట్లనే టార్గెట్ చేశారు. జిల్లాలో ఓట్ల తొలగింపునకు కనీ వినీ ఎరుగని రీతిలో దరఖాస్తులు వచ్చిపడ్డాయి. ఒక ప్రాంతంలో పుట్టి, పెరిగి నివాసం ఉంటున్న వారివి, దాదాపు 30 ఏళ్ల పైబడి ఒకే చోట నివాసం ఉంటున్న వారి ఓట్లను తొలగించమని ఫారం–7లు వేలాదిగా దాఖలయ్యాయి. మార్చి 27వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా 25వేల ఫాం–7 దరఖాస్తులు అందాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. గడచిన రెండు రోజుల్లో ఈ సంఖ్య మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది. ఓట్ల తొలగింపు కుట్రల వెనుక అధికారపార్టీ నేతలున్నారనే ఆరోపణలు ప్రభలంగా వినిపిస్తున్నాయి.
జిల్లాలో 24,95,383 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 12,43,411 మంది, మహిళలు 12,51,823 మంది ఉన్నారు. థర్డ్ జన్ ఓటర్లు 149 మంది ఉన్నారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 11వ తేదీన ప్రకటించిన ఎన్నికల సంఘం కొత్తగా ఓటు హక్కు పొందడానికి అర్హులైన వారికి, ఓటరు జాబితాలో తమ ఓట్లు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. దీనిని ఆసరాగా అధికార పార్టీ నేతలు తెగబడ్డారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని గుర్తించడం. వారి ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులను పెట్టడం పనిగా పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఫారం–7 (ఓటు తొలగింపునకు దరఖాస్తు)లు పెద్ద సంఖ్యలోనే దాఖలయ్యాయి.
ఫారం–7 దరఖాస్తులు దాఖలు 24,650
జిల్లాలోని ఒంగోలు, చీరాల,దర్శి, కందుకూరు, కొండపి, అద్దంకి, కనిగిరి, సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు, పర్చూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల నుంచి బుధవారం నాటికి ఓట్ల తొలగింపునకు 24,650 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇందులో చీరాలలో 3,827, దర్శిలో 2,458, కందుకూరు 3,084, అద్దంకి 4,673, గిద్దలూరు 2,098, పర్చూరు 2,986 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఎక్కువ భాగం పారం–7లు ఆన్‌లైన్ ద్వారానే వచ్చాయి. అధికార పార్టీ నాయకులు ఆన్‌లైన్‌ను బాగా ఉపయోగించుకున్నారు. మాన్యువల్‌గా వందల సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చాయి. ముందుగా తమకు వ్యతిరేకులను గుర్తించడం, వారి వివరాలను తీసుకొని ఆన్‌లైన్ ద్వారా తొలగింపునకు దరఖాస్తు చేశారు. వచ్చిన దరఖాస్తుల్లో 4,712 దరఖాస్తులను ఇంకా పరిశీలించనే లేదు. వీటిలో 9,237 దరఖాస్తులను పరిశీలనకు బీఎల్వోలకు ఇచ్చారు. 1,127 దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో బీఎల్వోలు పరిశీలించారు. పరిశీలించిన వాటిలో అధిక భాగం ఓట్లను తొలగింపునకే సిఫార్సు చేయడం గమనార్హం. దాఖలయిన ఫారం–7 దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 1,641 తిరస్కరించారు. 19,011 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు..
జిల్లా వ్యాప్తంగా ఓట్ల తొలగింపునకు అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు నానాటికి పెరుగుతున్నాయి. జిల్లాలో 3,269 మంది బీఎల్వోలు ఈ దరఖాస్తులను పరిశీలించే పనిలో ఉన్నారు. వీరిలో అత్యధిక భాగం బీఎల్వోలపై టీడీపీ నేతల ఒత్తిళ్లు ఉన్నాయి. కొందరైతే తెగబడి నేతలు చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రం ఒంగోలులో పోలింగ్ బూత్ 192లో విశ్వాస్‌నగర్‌కు చెందిన బ్రహ్మయ్య, 180 పోలింగ్ బూత్‌లో రాజపానగల్‌రోడ్డు 14వ అడ్డరోడ్డుకు చెందిన సుంకర మేఘనాథ్, 176వ బూత్‌లో సంజయ్‌గాంధీ కాలనీకి చెందిన దాసరి చిరంజీవి, 183వ బూత్‌లో గద్దలగుంట ఎస్సీకాలనీకి చెందిన జ్యోతుల తిరుపతిరాయుడు ఇలా పలువురి ఓట్లును తొలగించారు.చీరాల, దర్శి, కందుకూరు, అద్దంకి, సంతనూతలపాడు, గిద్దలూరు, పర్చూరు, మార్కాపురంలో ఓట్లను పెద్ద ఎత్తున తొలగించడానికి వచ్చిన దరఖాస్తులపై అధికార పార్టీ ఒత్తిళ్లు పని చేస్తున్నాయి.
తూతూ మంత్రంగానే విచారణ..
అక్రమ దరఖాస్తులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించడం ఈ సందర్భంగా గమనార్హం. ఓటర్లకు తెలియకుండానే జాబితా నుంచి పేర్లను తొలగించాలని , కొత్త వారిని చేర్చడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు దాఖలయ్యాయి. ఒంగోలు శివారు మండవవారిపాలెంలో వందల సంఖ్యలో ఓట్లను చేర్చడానికి దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో ఇదే పరిస్థితి నెలకుంది.ఇలాంటి ఘటనలపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నది ఎన్నికల సంఘం ఆదేశం. ఓటర్లకు తెలియకుండా జాబితా నుంచి వారి పేర్లను తొలగించమని ఫారం–7 వస్తే అలాంటి వ్యక్తులను గుర్తించి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోమన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ ఈ ఆదేశాలను ఇప్పటికే వీడియో సమావేశం ద్వారా ఆర్వోలకు సమాచారాన్ని ఇచ్చారు. తప్పుడు పద్దతిలో మోసగిస్తున్న వారి వివరాలను ప్రజలు సేకరించి ఇవ్వవచ్చు. బీఎల్వోలు క్షేత్ర స్థాయిలో పూర్తిగా పరిశీలించి తొలగింపు దరఖాస్తు కచ్చితమైనది అయితేనే తొలగించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే బీఎల్వోలు బాధ్యులే. జిల్లాలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన బీఎల్వోలు కొందరు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. తొలగింపులకే చర్యలు తీసుకుంటున్నారు. జాబితా నుంచి ఓట్లు పోయిన వారు వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసే వీలుంది. జిల్లా ఎన్నికల అధికారి, తొలగింపునకు దరఖాస్తు చేసిన వ్యక్తిపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి వీలుంది. ఓటర్లు చైతన్యవంతులై ముందుగా జాబితాలో తమ ఓట్లు ఉన్నాయో లేవో చూసుకొని ఎందుకు తొలగింపునకు గురయిందో అధికారులకు ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చు. నగరంలో పేరున్న న్యాయవాది ఓటును జాబితా నుంచి తొలగించారు. ఆయన అధికారులను నిలదీశారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరు తమ ఓటు ఉందో లేదో ముందుగా తెలుసుకొనే బాధ్యత ఉంది.
తేలిన దొంగ ఓట్లు..
ఎన్నికల్లో అడ్డదారిలో గెలవడానికి తమకు అనుకూలమైన వారి ఓట్లను చేర్పించుకొనే పనిలో టీడీపీ నేతలు ఉన్నారు. జిల్లాలో 5,927 ఓట్లు దొంగ ఓట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. సాప్ట్‌వేర్‌తో సరి చూసినప్పుడు మొత్తం 8,518 ఓట్లు డీ డూప్లికేట్ ఓట్లుగా గుర్తించారు. దొంగ ఓట్లు 5,927 తేలాయి. అసలు గుర్తింపు కార్డులోనే ఫొటో సరిపోలనివి(పేరుకు, ఫోటోకు) 1,581 ఉన్నాయి. వీటిలో 264 ఓట్లను క్షేత్ర స్థాయిలో విచారించారు. 5,539 ఓట్లను బీఎల్వోలు విచారిస్తున్నారు. వీటిలో 1,010 ఓట్లను పెండింగ్‌లో ఉంచారు. ఒంగోలు నగరం శివారులో డోర్ నంబర్లు లేకుండానే పొరుగు ప్రాంతాల వారు ఓటర్లుగా నమోదయ్యారు. రకరకాల మతలబులు చేసి దొంగ ఓటర్లను టీడీపీ చేర్చింది. వీటిని విచారించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు నెలకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment