సాక్షి, ఒంగోలు : ‘అసలే రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉంది. అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తాం. మాకోసం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. మీకెంత ధైర్యం సార్. మీ దగ్గర ఏమైనా అక్షయ పాత్ర ఉందా. మా కోసం ఇంగ్లీషు ప్రవేశపెడుతున్నారు. మీకు ధన్యవాదాలు’ అంటూ ఙ్ఞాన ప్రసూన అనే విద్యార్థిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. జిల్లాపరిషత్ హైస్కూళ్లో పదో తరగతి చదువుతున్న ఆమె ఇంగ్లీషు ప్రసంగానికి సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు- నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. బాలల దినోత్సవం సందర్భంగా గురువారమిక్కడ పీవీఆర్ బాలుర పాఠశాలలో బృహత్తర కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థినులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం గురించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. పిల్లలను కార్పోరేట్ స్కూళ్లలో చదివిస్తూ.. తమను మాత్రం ఇంగ్లీషు మాధ్యమానికి ఎందుకు దూరం చేయాలని చూస్తున్నారంటూ సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిని సభా వేదికగా ప్రశ్నించారు.
ఇందులో భాగంగా వేమూరి ఙ్ఞాన ప్రసూన మాట్లాడుతూ.. ‘గతంలో అబ్దుల్ కలాం ప్రతిభా అవార్డులు కార్పోరేట్, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇచ్చేవారు. అయితే సీఎం జగన్ ఈ విధానాన్ని మార్చారు. కేవలం ప్రభుత్వం విద్యార్థులకు పురస్కారాలు అందజేసేలా నిర్ణయం తీసుకున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు. ఇక ఇప్పుడు నాడు- నేడు కార్యక్రమం ప్రవేశపెట్టడం మాకు అద్భుత అవకాశం. రాష్ట్రాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్తానన్న మీ మాటలు మాకు స్ఫూర్తి. ఆయనకు ఎంత ధైర్యం ఉంటే ఈ సవాలును స్వీకరించి ఉంటారు. సీఎం జగన్ చొరవతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం రావడం మా అదృష్టం. అయితే ఇది కొంతమందికి నచ్చడం లేదు. వారి పిల్లలు మాత్రమే ఇంగ్లీషు మీడియం చదివాలని.. వారికి మాత్రమే ఈ అర్హత ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. మాకు వారి మాటలు అస్సలు నచ్చడం లేదు. ఏదేమైనా మీ నిర్ణయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు.. అన్ని వర్గాల వారు ఆమోదిస్తున్నారు. మా కోసం ఇంత మంచి కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నందుకు కృతఙ్ఞతలు’ అని తన వాగ్ధాటితో సీఎం జగన్‌తో పాటు వేదిక మీద ఉన్న పెద్దలను సైతం ఆశ్చర్యపరిచింది.
ఓటు హక్కులేదనే కాబోలు..
మా అక్క ట్రిపుల్ ఐటీలో చదువుతోంది. సార్ నిజానికి ఎంతోమంది గొప్పవాళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారే. అయితే ఇప్పుడు అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. రాజకీయ నాయకులు వస్తారు. కానీ మాకోసం ఏమీ చేయరు. బహుశా మాకు ఓటు హక్కు లేదనే కాబోలు. మా గురించి మంచిగా ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు. నాడు నేడు తర్వాత మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టండి.
- వి.హేమలత, 8వ తరగతి
తెలుగు రాని లోకేశ్ కూడా..
సార్ మా నాన్న ఆటోడ్రైవర్. ఆయనకు రూ. 10 వేలు ఇస్తున్నందుకు థాంక్స్. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు ప్రవేశ పెడుతున్నందుకు ధన్యవాదాలు. అయితే కొంతమంది ఇంగ్లీషు మీడియం వద్దని చెబుతున్నారు. తెలుగు భాష రాని నారా లోకేశ్, ఇంటర్ పాస్ కాని పవన్ కల్యాణ్ ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు. ఎందుకిలా చెబుతున్నారో అర్థం కావడం లేదు. వాళ్లు, వాళ్ల పిల్లలు మాత్రం విదేశాల్లో చదువుకోవచ్చు. మేం మాత్రం ఏం పాపం చేశాం సార్. పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే మాకు ఇంగ్లీష్ చాలా అవసరం.
- హారిక
Comments
Please login to add a commentAdd a comment