పేదవాడు తెలుగు మీడియంలోనే చదవాలని మన సంస్కృతి అంటుందని చెప్పి వదిలేస్తే రేప్పొద్దున అదే సంస్కృతి అదే తెలుగు వాడిని పై నుండి కింది వరకు వెటకారంగా చూసినప్పుడు నాయకులుగా ఉన్న మనం వాళ్ల బతుకులు ఇలానే వదిలేసినందుకు సిగ్గుతో తల దించుకునే పరిస్థితి ఉండదా? ఇవాళ మన పిల్లలు పోటీ పడుతున్నది మన సమాజంతో కాదు.. మొత్తంగా ప్రపంచ జాబ్ మార్కెట్‌తో. మన బిడ్డలు ప్రపంచంతో పోటీ పడేలా చేయడం కోసం అడుగులు వేయాలా.. వద్దా? అని ఈ రోజు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది.
‘ఇదే వేదికపై ఉన్న విద్యా శాఖ మంత్రి సురేష్ ఐఆర్‌ఎస్ అధికారి. ఆయన ఏడో తరగతి వరకు తెలుగు మీడియంలో.. ఆ తర్వాత ఇంగ్లిష్ మీడియం వైపు అడుగులు వేశారు. విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, మరో ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డిలు ఇంటర్ తర్వాత ఇంగ్లిష్ మీడియం వైపు అడుగులు వేశారు’ అని సీఎం తెలిపారు.– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లిష్ మాధ్యమంలో బోధనతోపాటు, పాఠశాలల రూపు రేఖలు కూడా మారాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా ఇప్పుడు చరిత్రను మార్చబోయే తొలి అడుగు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో మనబడి నాడు–నేడు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విద్యార్థులు, ప్రజలనుద్దేశించి సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. రాష్ట్రంలో ఈరోజు పుట్టిన బిడ్డ 2040లో గ్రాడ్యుయేషన్, 2042లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటుందని, రాబోయే పదేళ్లలో ప్రపంచం ఎలా ఉండబో తుందో ఒక్కసారి ఊహించాలన్నారు. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు, యాప్‌లు, ఇంటర్‌నెట్ అందు బాటులో ఉన్నాయని, పదేళ్ల తర్వాత రోబోటిక్స్ కీలకం కానున్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో మన పిల్లలకు ఇంగ్లిష్ చదువులు లేకపోతే వారి భవిష్యత్ ఎలా ఉంటుందో ఆలోచించాలని కోరారు. ఈ సభలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
గుండెలపై చేయి వేసుకుని విమర్శించండి
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని మార్పునకు శ్రీకారం చుట్టకపోతే వారి తలరాతలు ఎప్పటికీ మారవు. ఇది మన ముందున్న సవాల్. మీరే ఆలోచించండి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలన్నందుకు నన్ను విమర్శిస్తున్న పెద్దమనుషుల్లో.. రాజకీయ నాయకులు, పత్రికాధిపతులు, చివరకు రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్న వైస్ ప్రెసిడెంట్ పదవుల్లో ఉన్న వారు సైతం ఉన్నారు. సినీ రంగంలో ప్రముఖ స్థానం సంపాదించిన వాళ్లూ ఉన్నారు. మీ బిడ్డలు, మీ మనవళ్లు మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో చదవాలా? పేద వారు మాత్రం చదవకూడదా? అని నేను వీళ్లందరిని గట్టిగా అడుగుతున్నా. గుండెలపై చేయి వేసుకుని విమర్శించండి.
ప్రతి స్కూల్లో ఇంగ్లిష్ మీడియం
ప్రతి స్కూల్‌ను ఇంగ్లిష్ మీడియం చేయబోతున్నాం. ప్రతి స్కూల్లో తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగును ఉంచుతాం. వచ్చే ఏడాది 1 నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చేస్తాం. ఆ తర్వాత ఏడాదికి ఒక క్లాస్ చొప్పున పెంచుకుంటూ పోతాం. ఇలా పదవ తరగతి కామన్ ఎగ్జామ్ నాటికి మన పిల్లలు.. సీబీఎస్‌సీ, ఐసీఎస్‌సీకి దీటైన సిలబస్‌ను ఎదుర్కొనేందుకు నాలుగేళ్లు గడువు ఉంటుంది. ఇందులో భాగంగా పేరెంట్స్ కమిటీలు వేశాం. స్కూళ్లలో జరిగే వ్యవహారాల్లో వారిని భాగస్వాములను చేస్తాం. విద్యా విధానం, మౌలిక వసతుల్లో ఇక్కట్లు ఎదురుకాకుండా వారంతా కూడా భాగస్వాములవుతారు’ అని సీఎం అన్నారు.
పదేళ్ల తర్వాత కూడా ఇలాగే ఉండి పోవాలా?
►మన రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం పేద వర్గాల పిల్లల్లో చదువు రాని వారు 33 శాతం ఉన్నారు. పదేళ్ల తర్వాత కూడా మన పిల్లలు ఇలాగే ఉండిపోవాలా? లేక ప్రపంచంతో పోటీ పడేలా వారి జీవితాలను తీర్చిదిద్దాలా? ప్రభుత్వం వారికి అండదండగా నిలబడి పేదలు చదువుకునే బడులను చదువుల దేవాలయాలుగా మార్చాలా? లేక వారి తలరాత ఇంతేలే.. అని కార్పొరేట్ చదువులకు కొమ్ముకాసి ఇప్పటికే పాడైపోయిన ప్రభుత్వ బడులను శిథిలావస్థలోనే వదిలేయాలా?
►ఈ పరిస్థితిలో మరో 10, 20 ఏళ్లు పోతే మన పిల్లలకు ఇంగ్లిష్ రాక, ప్రైవేటు స్కూళ్లలో చదివే స్థోమత లేక రోజువారీ కూలీలుగా, డ్రైవర్లుగా, నైపుణ్యం లేని పనివాళ్లుగా మారే పరిస్థితి. డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఉంటాయో ఉండవో తెలియదు. ఎందుకంటే డ్రైవర్‌లెస్ వాహనాలు కూడా వస్తున్నాయట.
►ఇలాంటి పరిస్థితుల్లో మన పిల్లలకు మంచి చేయాలని విప్లవాత్మమైన నిర్ణయం తీసుకుంటే నన్ను రాజకీయంగా, వ్యక్తిగతంగానూ టార్గెట్ చేస్తున్నారు. నేను చేస్తుంది తప్పన్నట్లుగా నా వల్ల తెలుగు జాతి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నట్లుగా అవాకులు, చవాకులు పేలుతున్నారు. నన్ను విమర్శించే వాళ్లంతా వారి గుండెలపై చేయి వేసుకుని ఒక్కసారి వారి మనస్సాక్షిని అడగండని కోరుతున్నా. హిపోక్రసీని వదిలి డెమొక్రసీకి విలువ ఇవ్వండని అడుగుతున్నా.
►ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్స్‌లో రోజురోజుకూ కొత్త మార్పులొస్తున్నాయి. డ్రైవర్ లెస్‌వాహనాలు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితిలో మనకు ఇంగ్లిష్‌చదువులు లేకపోతే, మన పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే మన బతుకులు ఎలా ఉంటాయి? ఒక్కసారి ఆలోచించండి.
చాలెంజ్‌లను అధిగమిద్దాం
మొదట్లో చాలా చాలెంజ్‌లు ఉంటాయి. టీచర్లందరికీ ఇంగ్లిష్ సరిగా రాదుకదా..? ఎలా చెప్పగలుగుతారు..?
టీచర్లకు శిక్షణ ఇస్తాం.
పిల్లలు ఒకేసారి అడాప్ట్ కాగలుగుతారా?
బ్రిడ్జి కోర్సులు ఏర్పాటు చేస్తాం. ప్రతి స్కూల్లో ఇంగ్లిష్ ల్యాబ్‌లు తీసుకొస్తాం.
సిలబస్ మారుతుంది కదా?
ఒకటి రెండు సంవత్సరాలు కష్టపడతాం. మూడో సంవత్సరానికి సన్నద్ధం అవుతాం. నాలుగో సంవత్సరానికి గాడిలో పడి టెన్త్ క్లాస్ పరీక్షలు, బోర్డు ఎగ్జామ్స్ ఇంగ్లి‹Ùలో రాసే స్థాయికి మన పిల్లలు ఎదుగుతారనే నమ్మకం నాకుంది. ఈ చాలెంజ్‌లు ఉంటాయని మన పిల్లలను గాలికొదిలేస్తే వారి బతుకులు మారవు. అందుకే మన నిర్ణయాన్ని ఎంత మంది వ్యతిరేకించి మాట్లాడినా, నన్ను టార్గెట్ చేసినా పట్టించుకోను. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజల దీవెనలతో ముందడుగు వేస్తున్నా.
Comments
Please login to add a commentAdd a comment