సమగ్ర విచారణ చేయాలి ఆర్డీఓకు వినతి పత్రం అందజేస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వరూప్, పీఏసీ సభ్యుడు చిట్టబ్బాయి తదితరులు
ఓట్లను తొలగించడానికి తప్పుడు ఫారం–7 లను ఆన్‌లైన్‌లో సమర్పించి, అధికార పార్టీ కుట్రలకు పాల్పడుతోందంటూ వైఎస్సార్ సీపీ నేతలు గురువారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. కొందరు మీ సేవ నిర్వాహకులతో ఈ పని చేయిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించారు. తప్పుడు ఫారాలు దాఖలు చేస్తున్న ముఠాపై చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
తూర్పుగోదావరి, అమలాపురం రూరల్: నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలవే కాకుండా పార్టీ సానుభూతిపరుల ఓట్లను ఓ పథకం ప్రకారం తొలగించేందుకు కొందరు అజ్ఞాత వ్యక్తులు ఆన్‌లైన్ ద్వారా కుట్రలు చేశారని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని ఆర్డీఓ బి.వెంకటరమణకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పినిపే విశ్వరూప్, పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, లోకేష్ కుట్రతోనే వైఎస్సార్ సీపీ ఓటర్ల తొలగింపునకు చర్యలు తీసుకున్నారని వారు ఆరోపించారు. అమలాపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలకు చెందిన 4390 ఓటర్లు తొలగింపునకు దరఖాస్తులు చేయడంపై నియోజకవర్గంలో పార్టీ నాయకులతో కలిసి గురువారం ఆర్డీఓ వెంకటరమణ కలసి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి వెనుక ఉన్న నాయకులపై చర్యలు తీసుకోవాలన్నారు. తమ పార్టీకి చెందిన ఒక్క ఓటు తొలగించినా సహించేది లేదని హెచ్చరించారు.
ఈ సంఘనపై విచారణ చేస్తున్నామని ఆర్డీఓ అన్నారు. నోటీసులు ఇవ్వకుండా ప్రజల ఓట్లను తొలగించే అధికారం తమ పరిధిలో లేదన్నారు. ఆనంతరం విలేకర్లతో విశ్వరూప్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో గెలవలేక దొడ్డిదారిన కుట్రలు చేస్తోందన్నారు. 60 గ్రామాలకు సంబంధించి ఒక్కో గ్రామంలో 40 నుంచి 200 వరకు ఓట్లు తొలగించారని ప్రయత్నాలు చేశారని ఆయన గుర్తు చేశారు. తమ పార్టీకి చెందిన బూత్ కన్వీనర్లే ఆన్‌లైన్ ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసుకున్నట్టు ఆ అజ్ఞాత వ్యక్తులు నకిలీ అభ్యర్థనలతో మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. దీనిపై తాను ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు. గ్రామగ్రామాన వీఆర్వోలతో ప్రత్యేక తనిఖీలు చేయించి ఓట్ల తొలగింపు చర్యలను అడ్డుకుని, తొలగించిన ఓట్లు తిరిగి జాబితాలోకి చేర్చకపోతే ధర్నాలు చేస్తామని విశ్వరూప్ హెచ్చరించారు. మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు చెల్లుబోయిన శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్, నియోజకవర్గం పార్టీ బూత్ కమిటీల ఇన్‌చార్జి సంసాని నాని, కౌన్సిలర్ వాసంశెట్టి సత్యం, పార్టీ నాయకులు గొవ్వాల రాజేష్, కముజు రమణ రాజులపూడి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment