సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా తయారీకి అనుసరిస్తున్న విధానంతోపాటు ఓట్ల తొలగింపు, చేర్పులకు అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి? దాని వల్ల లాభనష్టాలు ఏమిటి? తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు గురువారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించింది. ఓట్ల తొలగింపు విషయంలో రిటర్నింగ్ అధికారికి ఉన్న అధికారాలు ఏమిటో కూడా చెప్పాలంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
సాఫ్ట్‌వేర్ ఏమిటో వెల్లడించాలి...
ఓటర్ల జాబితా తయారు సమయంలో చట్టం గుర్తించని సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా ఓట్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, అసలు జాబితాలో మార్పులు, చేర్పులకు అనుసరిస్తున్న విధానాన్ని, అందుకు ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్ వివరాలను వెల్లడించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని హైదరాబాద్ మియాపూర్‌కి చెందిన ఇంజనీర్ కొడాలి శ్రీనివాస్ హైకోర్టులో గత ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం దానిని మరోసారి విచారించింది.
సమాచారమంతా బయటకు పొక్కుతోంది...
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎన్‌ఆర్‌డీహెచ్)కు అందచేస్తున్న ఓటర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారమంతా, ఆధార్ కార్డు వివరాలతో సహా బయటకు పొక్కుతున్నాయని చెప్పారు. ఓటరు కులం ఏమిటి..? ఓటరు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనే వివరాలను తెలుసుకోవడం సులభవుతుందని, దీని వల్ల ఇష్టమొచ్చిన రీతిలో ఇతరుల ఓట్లను తొలగించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇటీవల కాలంలో ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయన్నారు. ఎన్నికల సంఘం ప్రతి దశలోనూ పారదర్శకంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎన్నికల సంఘం తన సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా తెలంగాణలో 27 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో 17 లక్షల ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించిందని వివరించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఓ వ్యక్తి వివరాలు తెలుసుకోవడం పెద్ద కష్టం కాదని వ్యాఖ్యానించింది. గూగుల్‌లో బోలెడంత సమాచారం దొరుకుతుందని తెలిపింది. అయితే, ఓటరు గోప్యత హక్కు, ఓటర్ల జాబితా స్వచ్ఛత రెండు వేర్వేరుగా అంశాలని, వీటిని అలాగే చూడాల్సిన అవసరం ఉందంది.
డూప్లికేట్ ఓటర్లను గుర్తిస్తుందే తప్ప.. తొలగించదు...
ఆ తరువాత ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ చెబుతున్నదాంట్లో వాస్తవం లేదన్నారు. తాము ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్ డూప్లికేట్ ఓటర్లను గుర్తిస్తుందే తప్ప, దానంతట అది ఓటర్లను జాబితా నుంచి తొలగించదన్నారు. ఎవరైనా పేరును ఓటరు జాబితా నుంచి తొలగిస్తే, ఆ వ్యక్తికి ముందు నోటీసు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తిరిగి ఓటరుగా చేరేందుకు దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కూడా ఉందని వివరించారు. ఎన్‌ఆర్‌డీహెచ్ ఉన్న డేటాను ఏ రాజకీయ పార్టీ అడిగినా ఇస్తామన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపు విషయంలో రిటర్నింగ్ అధికారికి విస్తృతాధికారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల సంఘం సైతం ఈ విస్తృతాధికారాల్లో ఏ రకంగానూ జోక్యం చేసుకోజాలవన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఓటర్ల జాబితాలో తొలగింపులు, చేర్పులకు అనుసరిస్తున్న విధానం ఏమిటి? అలాగే ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు? దాని వల్ల ఉన్న లాభనష్టాలు ఏమిటి? తదితర వివరాలను కౌంటర్ రూపంలో తమ ముందుంచాలని అవినాశ్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment