
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ల జాబితా తయారు, ముసాయిదా జాబితా ప్రచురణ తదితర అంశాలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి బోగస్ ఓటర్లను, అనర్హులను, డూప్లికేట్ ఓటర్లను తొలగించేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఓటర్ల జాబితాలో 34.17 లక్షల డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. 17 లక్షలమంది ఓటర్లు అటు ఏపీ, ఇటు తెలంగాణ ఓటర్ల జాబితాలో ఉన్నారని వివరించారు. అంతేగాక అధికారపార్టీకి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో స్లీపర్ సెల్స్‌గా ఓటర్ల జాబితాలో ఉన్నారని తెలిపారు.
ఓటర్ల జాబితా తయారీలో అనేక అవకతవకలున్నాయని, ఏడాది వయస్సున్న చిన్నారిని వివాహితగా పేర్కొన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కొందరు ఓటర్ల వయస్సును 248 సంవత్సరాలుగా కూడా పేర్కొన్నారని తెలిపారు. ఎప్పుడో రాజుల కాలంలో పుట్టినట్లుగా వయస్సును ఓటర్ల జాబితాలో పేర్కొన్నారని, దీన్నిబట్టి ఓటర్ల జాబితా తయారీ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చునని నివేదించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రక్రియ ఏ దశలో ఉందని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది బదులిస్తూ.. 2019 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన వారందరికీ ఓటు హక్కు కల్పిస్తున్నామని, జనవరి 4 నాటికి ముసాయిదా ప్రచురిస్తామని బదులిచ్చారు. ఈ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment