ఓటు కుతంత్రం | Mistakes in Voter Lists Chittoor | Sakshi
Sakshi News home page

ఓటు కుతంత్రం

Published Wed, Feb 13 2019 12:23 PM | Last Updated on Wed, Feb 13 2019 12:23 PM

Mistakes in Voter Lists Chittoor - Sakshi

ఓటమి భయంతో అధికార పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపొందేందుకు  కుయుక్తులు పన్నుతున్నారు. అధికారులను పావుగా వాడుకుని తమకుఅనుకూలంగా లేని ఓటర్లను తొలగించే పనిలో పడ్డారు. దీనికోసం ఆక్షేపణాస్త్రాన్ని వినియోగిస్తు న్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు తమకు అనుకూలంగా లేని వారిని పోలింగ్‌ కేంద్రాల వారీగా గుర్తించారు. వారి పేర్లు ఓటర్ల జాబితాలో తొలగించేందుకు ఆన్‌లైన్‌లో ఫారం–7కు ఆ పార్టీ నేతలే దరఖాస్తు చేశారు.  దీనిపై ఓటర్లు రగిలిపోతున్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలాగైనా గద్దెనెక్కాలన్న దురుద్దేశంతో టీడీపీ నాయకులు కుతంత్రాలు చేస్తున్నారు. అధికారబలంతో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారు. తమ పార్టీకి అనుకూలమైన వారిని బీఎల్వోలుగా నియమించుకున్నారు. జిల్లాలోని 3,800 పోలింగ్‌ కేంద్రాల్లో గుర్తించిన వారిద్వారా తమ ఇష్టానుసారం ఓట్లను తొలగిస్తున్నారు. ఎలాంటిఆధారాలు లేకుండానే, ఎన్నికల నియమాలకు విరుద్ధంగా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు.

చంద్రగిరిలో చేస్తున్న అక్రమాలే నిదర్శనం
చంద్రగిరి నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని కుట్ర రాజకీయాలను టీడీపీ అమలుచేస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో ఎన్నికల్లో కుతంత్రాలకు పాల్పడుతోంది. ఆ నియోజకవర్గంలోని 321 పోలింగ్‌ కేంద్రాల్లో ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 25 నుంచి 40 ఓట్లు ఎత్తివేసేలా ఆ పార్టీ నాయకులు ప్రణాళికలు సృష్టించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో అనుకూలంగా లేని వారిని గుర్తించి ఓట్లను తొలగించేందుకు సన్నద్ధమయ్యారు. ఆ నియోజకవర్గంలో తాజాగా విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం 2,70,495 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,33,434 మంది పురుషులు, 1,37,018 మంది మహిళలు, ఇతరులు 43 మంది ఉన్నారు. వారిలో టీడీపీకి అనుకూలంగా లేని వారిని ఐవీఆర్‌ఎస్‌ వాయిస్‌ ద్వారా గుర్తించారు. వారి ఓట్లను తొలగించేందుకు బీఎల్వోలను వాడుకుంటున్నారు. గుర్తించిన వారి పేర్లపై ఆన్‌లైన్‌లో ఫారం–7 (ఆక్షేపణలు)కు భారీగా దరఖాస్తు చేయించారు. సంబంధిత వ్యక్తులకు తెలియకుండానే ఆన్‌లైన్‌లో ఓట్ల నమోదు, సవరణ కోసం చంద్రగిరి నియోజకవర్గంలో 23,516 మంది దరఖాస్తులు చేయించారు. అందులో ఫారం–7 ద్వారా 10,164 మందిని ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేయించి, తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారు. అలా చేసిన దరఖాస్తులు క్షేత్ర స్థాయి పరిశీలన కోసం బీఎల్వోకు అదే నియోజకవర్గంలోని బీఎల్వోల వద్దకు వస్తాయి. టీడీపీ నేతలు అక్కడి నుంచి అసలు ప్రక్రియ మొదలుపెట్టారు. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే టీడీపీ నేతలు ఇచ్చిన జాబితాను పెట్టుకుని ఓట్లను ఇష్టానుసారం తొలగించేస్తున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే చంద్రగిరి నియోజకవర్గంలో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

ఆధారాలే ఉండవు
ఓటర్ల జాబితాలో తొలగిస్తున్న ఓట్లకు ఆధారాలు లేకుండానే చేస్తున్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 30,25,222 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 15,03,477 మంది, మహిళలు 15,21,401 మంది, ఇతరులు 344 మంది ఉన్నారు. గత ఏడాది జరిగిన ముసాయిదా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల్లో 5,350 మంది మృతి చెందిన వారిని, 8,942 మంది వలస వెళ్లిన వారిని, డూప్లికేట్‌ పేరుతో 2,030 మందిని తొలగించారు. ఆ తరువాత జరిగిన ప్రక్రియలో సవరణ కోసం 12,255 దరఖాస్తులు అందాయి. అందులో తంబళ్లపల్లెలో 355, కుప్పంలో 32, పలమనేరులో 67, పూతలపట్టులో 296, చిత్తూరులో 154, జీడీనెల్లూరులో 78, నగరిలో 31, సత్యవేడులో 167, శ్రీకాళహస్తిలో 600, తిరుపతిలో 133, చంద్రగిరిలో 10,164, పుంగనూరులో 52, మదనపల్లెలో 63, పీలేరులో 63 కలిపి 12,255 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు టీడీపీ కుట్ర పన్నింది. అదేవిధంగా 14 నియోజకవర్గాల్లో లేని వ్యక్తులను ఉన్నట్లుగా సృష్టించి 38,344 మందిని బోగస్‌ ఓటర్లుగా చేర్చేందుకు ప్రయత్నిస్తోంది.

కావాలనేరెచ్చగొడుతున్నారు
నాకు తెలియకుండానే నా పేరుతో నా ఓటు తొలగించాలని దరఖాస్తు చేశారు. ఓటమి భయంతో అధికార పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా నీచానికి దిగారు. కావాలనే రెచ్చగొడుతున్నారు. ఈ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే మరిన్ని నిజాలు బయటకు వస్తాయి.
– మొక్కల తిమ్మారెడ్డి, వైఎస్సార్‌సేవాదళ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

పల్లెల్లో చిచ్చు పెట్టేందుకేపల్లెల్లో చిచ్చు పెట్టాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. నాకు తెలియకుండానే నా ఓటు తొలగించాలని నా పేరుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. బీఎల్వో చెప్పేంతవరకు తెలియదు. ఇలా మా కుంట్రపాకం పంచాయతీలో 50కు పైగానే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని దరఖాస్తులు చేశారు. మా ప్రమేయం లేకుండా మా పేరుతో దరఖాస్తు చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి.    – శ్రావణ్‌కుమార్‌రెడ్డి, కుంట్రపాకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement