
ఒక పోలింగ్ బూత్‌లో ఉన్న ఓటర్ల పేర్లు మరో బూత్‌లోనూ ఉన్న ఓటర్ల జాబితాలు
పశ్చిమగోదావరి, నరసాపురం: నరసాపురం నియోజకవర్గ ఓటర్ జాబితా తప్పుల తడకగా ఉంది. ఓటరు జాబితాలో తప్పులపై రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి ఇప్పటికి మూడుసార్లు అభ్యంతరాలు తీసుకున్నారు. కానీ తుది జాబితాలో మాత్రం అవే తప్పులు కొనసాగించారు. గతంలో ఉన్న డబుల్, ట్రిపుల్ ఎంట్రీలు, ఒక బూత్‌లోని పేర్లు, ఇంకో బూత్‌లో కూడా ఉండటం వంటి తప్పులు ఏ ఒక్కటీ సరిచేయకుండా మళ్లీ యథాతధంగా జాబితాలు ముద్రించేశారు. ఈ మాత్రం దానికి అభ్యంతరాలు ఎందుకు తీసుకున్నారో కూడా తెలియని పరిస్థితి. నియోజకవర్గంలో బోగస్ ఓట్లు 5వేలు పైనే ఉన్నట్టు సమాచారం. టీడీపీ నేతల వత్తిళ్లకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. 2004 ఎన్నికల సమయానికి నియోజకవర్గాల పునర్విభజన చేయడంతో జిల్లాలో నరసాపురం చిన్న నియోజకవర్గం అయిపోయింది. యలమంచిలి మండలంలోని కొన్ని గ్రామాలు పాలకొల్లు నియోజకవర్గంలో కలిశాయి. దీంతో నరసాపురం, నరసాపురం మండలం, మొగల్తూరు మండలాలు మాత్రమే ఈ నియోజకవర్గంలో మిగిలాయి. ప్రస్తుతం నియోజకవర్గం మొత్తం ఓటర్లు 1,56,432 మంది. అయితే వీటిలో 5 వేలు వరకూ బోగస్ ఓట్లు ఉన్నట్టు అంచనా. టీడీపీ నాయకులు ఇష్టానుసారం దొంగ ఓట్లు రాయించారని, వాటిని తొలగించమని వీటిని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోని పరిస్థితి.
ఒకే వ్యక్తికి పలు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు
ఒకే వ్యక్తికి పలు బూత్‌ల్లో ఓట్లు ఉన్నాయి. వేరే ఊళ్లలోని వారిపేర్లు కూడా నియోజకవర్గంలో ఉండటం విశేషం. చనిపోయినవారు, విదేశాల్లో ఉన్నవారు, వేరే ప్రాంతావారి పేర్లు చాలాకాలంగా ఓటర్ జాబితాలో కొనసాగుతున్నాయి. వివాహమై వేరే ప్రాంతాలకు వెళ్లిన మహిళల ఓట్లు చలామణిలో ఉన్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీ ఓటర్ జాబితాల పరిస్థితి ఘోరంగా ఉంది. పట్టణంలోని 54వ బూత్‌లో పంజా ఝాన్సీ, పంజా జగన్మోహన్ హరిశ్చంద్ర పేర్లు 41వ బూత్‌లో కూడా ఉండటం విశేషం. దీనిపై గ్రామ సభలో వైఎస్సార్ సీపీ, వామపక్ష పార్టీల వారు అభ్యంతరం చెప్పారు. కానీ పరిస్థితి మారలేదు.
అజమాయిషీ లేకే అలక్ష్యమా!
కీలకమైన సబ్‌కలెక్టర్ పోస్టు 9 నెలల నుంచి ఖాళీ. దీంతో డివిజన్‌లో రెవెన్యూ పాలన కుటుంపడింది. తహసీల్దార్ నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ సవ్యంగా పనిచేయడం లేదు. ఓటర్ జాబితాలు రూపొందించటంలో పాత జాబితాలనే కొత్తగా ముద్రించడం మినహా రెవెన్యూ అధికారులు ఇంకేమీ చేసినట్టు కనిపించడంలేదు. టీడీపీ నేతల ఒత్తిడితో రెవెన్యూ సిబ్బంది ఈ తతంగాన్ని కొనసాగిస్తూ వచ్చారనే విమర్శలు ఉన్నాయి. పోలింగ్‌లో లబ్ధిపొందేందుకు, దొంగ ఓట్లు వేసుకునేందుకు ఇష్టానుసారం ఓటర్ జాబితాలను మార్చేశారనే విమర్శలున్నాయి.
వెంటనే తప్పులు సరిదిద్దాలి
ఓటరు జాబితాల తయారీలో రెవెన్యూ అధికారులు సవ్యంగా వ్యవహరించలేదు. గ్రామసభల్లో మా పార్టీ నాయకులు ఆధారాలతో సహా చేసిన ఫిర్యాదులపై కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పదే పదే అవే డబుల్, ట్రిపుల్ ఎంట్రీలు ఎందుకొస్తున్నాయి. అసలు రెవెన్యూ అధికారులు పాత జాబితాలు, కొత్త జాబితాలు చూస్తున్నారో?లేదో? అర్థం కావడం లేదు. వెంటనే తప్పులు సరిదిద్దాలి. మా పార్టీ తరఫున రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తాము.–ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ
Comments
Please login to add a commentAdd a comment