
సాక్షి, అమరావతి: ఉత్తమ పాలన అందించే నేతలను ఎన్నుకోవడానికి ఓటే ఆయుధం. ప్రతి ఒక్కరూ ఓటు అనే ఆయుధాన్ని తప్పకుండా వినియోగించుని తన ఆశలను నెరవేర్చే నేతలను ఎన్నుకోవాలి. మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలంటే ఓటు హక్కు తప్పనిసరి. ఓటుకు ఇంత ప్రాధాన్యం ఉన్నందున ప్రతిఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకుని లేకపోతే ఈనెలాఖరులోగా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఓట్లు ఉన్నప్పటికీ ఏ కారణంగానైనా జాబితా నుంచి మీ పేరు తొలగించి ఉండవచ్చు. పొరపాటున/సాంకేతిక సమస్యవల్ల కూడా ఓటర్ల జాబితా నుంచి మీపేరు తొలగిపోయే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ మీ పోలింగ్ కేంద్రంలోని ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదా వెంటనే చూసుకోవాలి. ఒక వేళ లేకపోతే ఆధార్‌కార్డు లేదా ఇతర ధ్రువపత్రాలు సమర్పించి మీ పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలి.
యువతరం పాత్ర కీలకం
వచ్చే జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే వారంతా ఓటు హక్కునమోదుకు అరుŠహ్‌లే. వచ్చే ఏడాది లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 31వ తేదీ వరకూ ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టింది. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులంతా జనన ధ్రువీకరణ పత్రం లేదా తల్లిదండ్రులచే ధ్రువీకరణ పత్రం, తాజా ఫొటోతో సమీప పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఫారం–6 నింపి అక్కడి సిబ్బందికి సమర్పించి రసీదు తీసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తులను (ఫారం –6ను) డిప్యూటీ కలెక్టర్/ తహసీల్దారు/ మున్సిపల్ కార్యాలయాల్లో కూడా సమర్పించవచ్చు. www.nvsp.in అనే వెబ్‌సైట్‌కు ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ల నమోదు దరఖాస్తుల స్వీకరణ కోసం ఈనెల 31వ తేదీ వరకూ ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు.
అనర్హులు జాబితాలో ఉంటే..
అనర్హుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉంటే వారి పేర్లను తొలగించాలంటూ ఎవరైనా ఫారం–7ను సమర్పించవచ్చు. ఓటరు జాబితాలో పేరు రెండు చోట్ల ఉన్నా ఒకచోట తొలగింపునకు కూడా ఇదే ఫారం –7 దాఖలు చేయవచ్చు. ఓటరు జాబితాలో పేరు తప్పు ఉన్నా, తండ్రి/భార్య/భర్త పేర్లలో తప్పులు ఉన్నా సవరణ కోసం ఫారం–8 దాఖలు చేయవచ్చు. చిరునామాలో మార్పు కోసం కూడా ఇదే ఫారం సరిపోతుంది. ఒకే నియోజకవర్గంలో ఇల్లు మారినా.. ఉన్న పోలింగ్ కేంద్రం నుంచి కొత్త పోలింగ్ కేంద్రం పరిధిలోకి ఓటు మార్చుకోవాలన్నా కోసం ఫారం–8ఎ సమర్పించాలి. ఇప్పటికే నమోదైన ఉందో లేదో తెలుసుకోవాలంటే ceoandhra.nic.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓటర్ల జాబితాలో పేరు చూసుకోవచ్చు.
మిస్స్‌డ్ కాల్ ఇస్తే...
ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాలన్నా, కొత్తగా ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలన్నా 8367797101కు మిస్స్‌డ్ కాల్ ఇస్తే సీఈవో కార్యాలయం నుంచి సూచనలతో కూడిన ఎస్సెమ్మెస్ వస్తుంది. ఈ సౌకర్యం ఈనెల 31వ తేదీ వరకే అందుబాటులో ఉంటుంది. ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) ఆర్పీ సిసోడియా ఈ కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. ‘ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇందుకు అర్హులందరికీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి’ అనే నినాదంతో మిస్స్‌డ్ కాల్ సదుపాయం ప్రవేశపెట్టామని సిసోడియా చెప్పారు. ప్రజలను ఓటు హక్కుపై చైతన్యపరచడం కోసం త్వరలో సోషల్‌మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటామని చెప్పారు.