ప్రద్యుమ్నపై ఈసీ కన్నెర్ర | EC Series On Chittoor Collector Pradyumna | Sakshi
Sakshi News home page

ప్రద్యుమ్నపై ఈసీ కన్నెర్ర

Published Sat, Apr 20 2019 7:55 AM | Last Updated on Sat, Apr 20 2019 7:55 AM

EC Series On Chittoor Collector Pradyumna - Sakshi

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న వ్యవహరించిన తీరును ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిస్తోంది. ముఖ్యంగా... పోలింగ్‌ ముందు రోజు చిత్తూరు జిల్లా పీలేరు పరిధిలోని 273 పోలింగ్‌ బూత్‌లోని ఈవీఎంలో ఓటు వేస్తున్న వీడియో బయటకు వచ్చింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు, ముఖ్యమంత్రి సన్నిహితుడు వేమూరి హరికృష్ణప్రసాద్‌తో జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న సుదీర్ఘంగా చర్చించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తితో, అందులోనూ ఈవీఎం దొంగతనం కేసులోని నిందితునితో జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ మాట్లాడటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. ఎన్నికలకు సంబంధించిన కీలకమైన అంశాలను, గోప్యంగా ఉంచాల్సిన ఈవీఎంల సమాచారాన్ని ప్రతిరోజూ వేమూరి హరికృష్ణప్రసాద్‌తో చర్చించినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆ జిల్లాలో ఎన్నికలరోజు హింసాత్మక సంఘటనలు జరిగినా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్‌ నివేదిక ఇవ్వడంపైనా దృష్టి పెట్టింది. మరోవైపు ఇతర అంశాలపై కూడా ఈసీ ఆరాతీస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ కలెక్టర్‌ మెడకు ఉచ్చుగా మారే అవకాశం ఉందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఈసీ యాక్టివ్‌...
ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా ఉండాల్సిన అధికారులు ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాయటంపై ఎన్నికల సంఘం సీరియస్‌ అయినట్లు తెలిసింది. నాలుగు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ నేత మేనకా గాంధీ, బీఎస్పీ చీఫ్‌ మాయావతి, ఎస్పీ నేత ఆజంఖాన్‌లపై ఎన్నికల కమిషన్‌ కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఈసీకి అక్షింతలు వేసిన అనంతరమే ఈ చర్యలు తీసుకుంది. ‘మీ అధికారాలు మీకు తెలియవా’ అని ఎన్నికలను ఎంతో పకడ్బందీగా నిర్వహించాలనే విషయాన్ని స్పష్టం చేసింది. జాతీయస్థాయి నేతలపైనే సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం... రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల అధికారి ద్వివేదిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కూడా తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని సీఎం సంజాయిషీ కోరింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై సాక్షాత్తు రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీనే ఎన్నికల విధుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈవీఎంల ట్యాంపరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న జిల్లా ఎన్నికల అధికారిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి తీసుకున్న నిర్ణయాలపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి నివేదిక కోరనున్నట్లు తెలుస్తోంది.

వేమూరి–కలెక్టర్‌ మధ్య ఉన్న సంబంధాలపై ఆరా
ఈవీఎం దొంగతనం కేసులో ముంబైలో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్నకు మధ్య ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయనే అంశంపై ఈసీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫైబర్‌ గ్రిడ్‌ కాంట్రాక్టులు, ఇతర సర్వీసుల కాంట్రాక్టులన్నీ సీఎంతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని వేమూరి తన సన్నిహితులకే ఇప్పించుకున్నారు. వేమూరికి కలెక్టర్‌తో ఎప్పటి నుంచి చర్చలు కొనసాగుతున్నాయి, ఎన్నికలకు సంబంధించి ఏయే అంశాలు చర్చకు వచ్చాయనేదానిపై దృష్టిపెట్టినట్లు సమాచారం. కలెక్టర్, వేమూరి సుదీర్ఘంగా చర్చించినట్లు వేమూరే ఓ మీడియా ఇంటర్య్వూలో ఒప్పుకున్నాడు. సాధారణంగా ఎన్నికల రోజు ఉదయం 5.30లకు అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్‌పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయి. అయితే ముందు రోజే పీలేరులోని 273 బూత్‌లో ఈవీఎంలో టీడీపీకి ఓటేసిన వీడియో ఎలా బయటకు వచ్చిందనే విషయాన్ని ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇది ఈవీఎంల ట్యాంపరింగ్‌ కిందకు వస్తుందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారం కూడా జిల్లా కలెక్టర్‌ మెడకు చుట్టుకుంటోంది. ట్యాంపరింగ్‌ అంశానికి వేమూరి హరికృష్ణ ప్రసాద్, కలెక్టర్‌ మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చోటుచేసుకున్న ఈ పరిణామాలపై ఇప్పటివరకూ ఎటువంటి విచారణ చేపట్టకపోవడంపై కూడా కలెక్టర్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చిత్తూరు జిల్లాలో ఓటింగ్‌ ప్రశాంతమట...
చిత్తూరు జిల్లాలో ఈనెల 11న జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్‌ ప్రద్యుమ్న ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కలెక్టర్‌ ఇచ్చిన నివేదికపై రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రశాంతంగా నిర్వహించాల్సిన పోలింగ్‌ని టీడీపీ నేతలు రక్తసిక్తం చేశారు. కుప్పం పరిధిలోని 170, 173, 174, 175 పోలింగ్‌ బూత్‌లలోని వీవీప్యాట్స్‌ను పగులగొట్టారు. పోలింగ్‌ పూర్తయిన రోజు అర్ధరాత్రి దాటాక ఆ బూత్‌లలోకి ప్రవేశించి వీవీప్యాట్‌లను పగులగొట్టటం వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానాలు ఉన్నాయి. విషయం తెలిసి వైఎస్సార్‌సీపీ శ్రేణులు రావటంతో జడ్పీటీసీ రాజ్‌కుమార్‌ సోదరుడు సతీష్‌ దాడిచేశారు. దళవాయికొత్తపల్లి, కృష్ణదాసనపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప పోలింగ్‌ బూత్‌ల వద్దకు రాకుండా అడ్డుకున్నారు. తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థి శంకర్‌యాదవ్‌ సొంత ఊరు పీటీఎం మండలం టి. సదుంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆర్‌పీ వెంకట్రామిరెడ్డిని రాళ్లతో కొట్టి చంపేశారు.

పూతలపట్టులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ బాబుపైనే దాడికి దిగారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓట్లు వేస్తారని పొలకల కట్టకిందపల్లిలో దళితులను బూత్‌ వద్దకు రాకుండా అడ్డుకున్నారు. పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంఎస్‌ బాబును బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి పిడిగుద్దులు గుద్దారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను కొట్టారు. మీడియా కెమెరామెన్‌ రమణపై దాడిచేసి కెమెరాను పగులగొట్టారు. బందార్ల పల్లెలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారు. చంద్రగిరి నియోజక వర్గంలోని రామచంద్రాపురం, తిరుపతి అర్బన్, రూరల్‌ మండలంలోని పలు బూత్‌లలో యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. రావిళ్లవారిపల్లి, కమ్మపల్లి, కమ్మకండ్రిగ, టీటీ కండ్రిగ, ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, గణేశ్వరపురంలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓట్లేస్తారని తెలిసి స్థానికులు ఎవ్వరినీ పోలింగ్‌ బూత్‌ వద్దకు రాకుండా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.

విషయం తెలుసుకుని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పత్రికా విలేకరులు, మీడియా ప్రతినిధులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వీరెవ్వరినీ గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించారు. విలేకరులపై దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. కెమెరాలు, ఐడీ కార్డులు లాక్కున్నారు.  సొరకాయలపాలెం, తుమ్మలగుంటలో టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డేలేకుండా పోయింది. ఇతర పార్టీలకు చెందిన ఏజెంట్లను కూడా గ్రామంలోకి అడుగుపెట్టనివ్వలేదు. తాటితోపు కండ్రిగ పోలింగ్‌ కేంద్రం వద్ద స్వతంత్ర అభ్యర్థి పూర్ణిమపై దాడికి తెగబడ్డారు. నిర్బంధించి మొబైల్‌ ఫోన్‌ లాక్కున్నారు. ఇంత జరిగినా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని పోలింగ్‌ ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్‌ ప్రద్యుమ్న ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇవ్వటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్నికల అక్రమాలకూ చిత్తూరు జిల్లాలోనే బీజం
ఓట్ల తొలగింపు ప్రక్రియ నుంచి ఈవీఎంల ట్యాంపరింగ్‌ వరకు సాగిన కుట్రలన్నింటికీ చిత్తూరు జిల్లాలోనే బీజం పడినట్టు తెలుస్తోంది. 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కొంత కాలం తరువాత నుంచే 2019 ఎన్నికల కోసం కుట్రలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత జిల్లా కలెక్టర్, గతంలో సీఎం పేషీలో పనిచేసిన అధికారి ప్రద్యుమ్న 2015లో స్మార్ట్‌ పల్స్‌ సర్వే యాప్‌ను తయారుచేయించారు. ఆ యాప్‌ ద్వారా గోప్యంగా ఉంచాల్సిన రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. సర్వే ద్వారా సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారం సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన దాకవరపు అశోక్‌ ఎండీగా ఉన్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు బదిలీ అయ్యింది. ఆ తరువాత టీడీపీ సేవామిత్ర యాప్‌కు బదిలీచేశారు.

ఆ డేటా ఆధారంగా వైఎస్సార్‌సీపీ అనుకూల ఓటర్లను టార్గెట్‌ చెయ్యడం ప్రారంభించారు. టీడీపీ సేవామిత్రలు సేకరించిన సమాచారంతో వైఎస్సార్‌సీపీకి అనుకూలురైన ఓటర్లను ఫాం–7 ద్వారా తొలగించే కుట్రకు శ్రీకారం చుట్టారు. ఇదికూడా చిత్తూరు జిల్లా నుంచే మొదలైంది. రాష్ట్రంలో దాదాపు ఐదు కోట్ల మంది ఆధార్‌ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ యాప్‌ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్‌ చేతిలో పెట్టింది ఎవరు? సెంట్రల్‌ ఐడెంటిటీ డేటా, రెసిపోటరీ (సీఐడీఆర్‌), స్టేట్‌ రెసిడెంట్‌ డేటా హబ్‌ (ఎస్‌ఆర్‌డీహెచ్‌), వద్ద భద్రంగా ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత  సమాచారం ఎలా బయటకు వచ్చింది? అన్నదానిపైనే ప్రధానంగా సిట్‌ విచారణ చేపట్టింది. ఈ లీకేజీ వెనుక కలెక్టర్‌ పాత్రపై కూడా విచారణ చేపట్టినట్లు సమాచారం. రేపో మాపో నోటీసులుకూడా వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంపై కూడా ఎన్నికల సంఘం సీరియస్‌ అయినట్లు తెలిసింది. కలెక్టర్‌ మీద ఇన్ని ఆరోపణలు రావడంతో స్ట్రాంగ్‌ రూమ్‌లలోని ఈవీఎంల భద్రతపై కూడా రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఇలా మార్చారు
ఈనెల 11న చిత్తూరు నగరంలోని మురుగానిపల్లె పోలింగ్‌ కేంద్రంలో 22వ పోలింగ్‌ స్టేషన్‌లో అధికారులు ఈవీఎంలను మార్చారు. 1,295 ఓట్లు ఉన్న ఈ బూత్‌లో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో అసెంబ్లీ అభ్యర్థి ఈవీఎంలో 50 ఓట్లు, పార్లమెంట్‌ అభ్యర్థి ఈవీఎంలో 48 ఓట్లు ఎక్కువగా పోలైనట్లు అధికారులు గుర్తించారు. 17ఏ రిజిస్టర్‌లో నమోదు చేసిన ఓట్లు, ఈవీఎంలలో పోలైన ఓట్ల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి ఈవీఎంలను సైతం మార్పు చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించిన అధికారులు అసలు విషయాన్ని దాచేశారు. రిజిస్టర్‌లో ఉన్న ఓట్లకు, ఈవీఎంలో పోలైన ఓట్లకు తేడా వచ్చిన 98 ఓట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎదురు చూస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement