నేడు బార్ కౌన్సిళ్ల ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదింటిదాకా ఓటింగ్ జరుగుతుంది. తెలంగాణలో 88, ఏపీలో 146 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో నమోదైన ఉభయ రాష్ట్రాల లాయర్లు సుప్రీంకోర్టులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేయనున్నారు. రిటర్నింగ్ అధికారులుగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అంబటి శంకర నారాయణ, పి.కేశవరావు వ్యవహరిస్తున్నారు. ఏపీ ఎన్నికలను జస్టిస్ కేశవరావు, తెలంగాణ ఎన్నికలను జస్టిస్ శంకర నారాయణ పర్యవేక్షిస్తున్నారు. ఏపీ బార్ కౌన్సిల్ బరిలో 107 మంది, తెలంగాణ కౌన్సిల్‌కు 86 మంది బరిలో ఉన్నారు.
తెలంగాణలో 21,077 మంది లాయర్లకు, ఏపీలో 27,676 మందికి ఓటు హక్కుంది. ఏపీ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు జూలై 11న, తెలంగాణకు జూలై 23న జరగనుంది. ఒక్కో రాష్ట్ర బార్ కౌన్సిల్ నుంచి 25 మందిని ఎన్నుకుంటారు. వీరిలోంచి చైర్మన్, కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. ఉభయ రాష్ట్రాలకు వేర్వేరుగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో లాయర్లు వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్థుల్లో కొందరు భారీగా ఖర్చు చేస్తున్నారు. ఎల్‌ఈడీ టీవీలు, ఖరీదైన సెల్‌ఫోన్లు, వాచీలు, విదేశీ మద్యం, లాయర్లు వేసుకునే గౌన్లు, పుస్తకాలు... ఇలా ఏది కావాలంటే అది ఓటర్లకు తాయిలాలుగా ఇస్తున్నారు. మరికొందరు ఓట్లను కొనేస్తున్నారు.
తెలంగాణ అభ్యర్థులతో పోలిస్తే ఏపీ అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారు. కొందరైతే వ్యక్తిగత ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఖర్చు చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు ప్రధాన పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్నారు. వారికి దన్నుగా ఆయా పార్టీల నేతలు భారీ విందులు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలనూ బాగా ఉపయోగించుకుంటున్నారు. కరపత్రాలు, వాట్సాప్ మెసేజ్‌లు, ట్విటర్, ఫేస్‌బుక్‌ల్లో ప్రచారం హోరెత్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment