హైకోర్టును వెంటనే విభజించాలి
- టీ న్యాయవాదుల జేఏసీ డిమాండ్
- ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయం
- ఈనెల 31న ప్రత్యేక సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టు, బార్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 31వ తేదీన నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో తెలంగాణకు చెందిన అన్ని జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, బార్ కౌన్సిల్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఏడు నెలలు గడచినా హైకోర్టు విభజనతోపాటు బార్ కౌన్సిల్ ఏర్పాటుపై జాప్యం చేస్తున్నారని, దీంతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని వారు అంటున్నారు. తెలంగాణ న్యాయవాదుల సంక్షేమంకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించిందని, ఈ నేపథ్యంలో ప్రత్యేక కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని జేఏసీ ప్రతినిధులు కోరుతున్నారు. 31న సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వెంటనే హైకోర్టు విభజన, ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు దిశగా చొరవ తీసుకోవాలని కోరనున్నారు. దీంతోపాటు హైకోర్టు ఎదుట ఆందోళ చేపట్టాలని యోచిస్తున్నట్టు జేఏసీ నేతలు శ్రీరంగారావు, కొండారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి తదితరులు గురువారం విలేకరులకు తెలిపారు.
నియామకాలు ఆపాలి: జూనియర్ లాయర్లు
న్యాయవ్యవస్థలో విభజన ప్రక్రియ చేపట్టకుండా నియామకాలు చేస్తే తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. న్యాయవ్యవస్థలో ఇప్పటికే తెలంగాణ అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని సంఘం అధ్యక్షుడు ఒద్యారపు రవికుమార్ పేర్కొన్నారు. ఏపీలో 595 కోర్టులు ఉండగా, తెలంగాణలో 439 కోర్టులు ఉన్నాయని...జూనియర్ సివిల్ జడ్జి కేడర్‌లో ఏపీకి చెందిన వారు 338 మంది ఉండగా, తెలంగాాణకు చెందిన వారు 159 మంది మాత్రమే ఉన్నారన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి కేడర్‌లో ఏపీకి చెందిన వారు 155 మంది ఉండగా, తెలంగాణకు చెందిన వారు కేవలం 44 మంది మాత్రమే ఉన్నారన్నారు. జిల్లా జడ్జి కేడర్‌లో 181 మంది ఏపీ వారు ఉండగా, తెలంగాణకు చెందిన వారు 39 మంది మాత్రమే ఉన్నారని వివరించారు. జేసీజే నియామకాలను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, అయితే ఈ దశలో నియామకాలు చేపడితే తెలంగాణకు మరోసారి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని తెలంగాణ న్యాయవాదులకు మరోసారి అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆయన కోరారు.