
260 మంది లాయర్ల గుర్తింపు రద్దు
పెద్ద సంఖ్యలో లాయర్ల గుర్తింపును రద్దు చేస్తూ త్రిపుర బార్ కౌన్సిల్(టీబీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది.
అగర్తల(త్రిపుర):
పెద్ద సంఖ్యలో లాయర్ల గుర్తింపును రద్దు చేస్తూ త్రిపుర బార్ కౌన్సిల్(టీబీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ వీరంతా కోర్టుల్లో ఎటువంటి న్యాయవాద వృత్తి సంబంధ కార్యకలాపాలు చేపట్టలేదని తెలిపింది. న్యాయవాద వృత్తిలో కొనసాగని వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని 2010లో సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వుల మేరకు తాము ఈ చర్యలు చేపట్టినట్లు త్రిపుర బార్ కౌన్సిల్ ఛైర్మన్ పియూష్ కాంతి బిశ్వాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం డిబార్ అయిన 260మంది న్యాయవాదులు హైకోర్టుతోపాటు రాష్ట్రంలోని వివిధ బార్ కౌన్సిళ్లలో నమోదయి ఉన్నారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ త్రిపుర కార్యాలయంలో వారి పేర్ల జాబితాను ఉంచింది.
ఏళ్ల క్రితమే లా డిగ్రీ పొందిన చాలామంది ప్రాక్టీస్ కోసం బార్ కౌన్సిల్‌లో పేర్లను నమోదు చేసుకున్నారని, అయితే వారిలో చాలా మంది వివిధ కారణాలతో ప్రాక్టీస్ చేపట్టలేదని టీబీసీ పేర్కొంది. కొందరు రాజకీయాల్లో, మరికొందరు వేరే వృత్తుల్లో కొనసాగుతున్నారని పేర్కొంది. గుర్తింపు రద్దయిన న్యాయవాదుల్లో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో త్రిపుర అసెంబ్లీ స్పీకర్ రామేంద్ర చంద్ర దేబ్‌నాథ్, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మన్‌తోపాటు ఆయన తండ్రి మాజీ సీఎం సమీర్ రంజన్ బర్మన్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబాల్ భౌమిక్ తదితరులున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు తాము ఈ చర్య తీసుకున్నట్లు బిశ్వాస్ తెలిపారు. టీబీసీ సభ్యుల్లో న్యాయవాద వృత్తి చేపట‍్టని వారు, తప్పుడు ధ్రువీకరణలతో నమోదైన వారు, నేరచరితులు ఉన్నట్లు తమ పరిశీలనలో గుర్తించినట్లు పేర్కొన్నారు.
న్యాయవాద పట్టా పొందిన వారు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేస్తున్న వారిని కూడా డిబార్ చేసినట్లు బిశ్వాస్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం దేశమంతటా ఉన్న బార్ కౌన్సిళ్లు కూడా ఇదే విధమైన చర్యలు చేపడతాయని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ మేరకు డిబార్ అయిన వారిని బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పాల్గొనేందుకు అనర్హులని ప్రకటించారు. డిబార్ అయిన లాయర్లు ఎవరైనా తిరిగి ప్రాక్టీస్ చేపట్టాలని భావిస్తే వారు బార్ కౌన్సిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆమేరకు వారి పేర్లను, వారు పనిచేయదలచిన ప్రాంతం వివరాలను తెలపాల్సి ఉంటుందని, 2015 వెరిఫికేషన్ నిబంధనల ప్రకారం అంతిమ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.