సాక్షి, హైదరాబాద్: అనంత నరసింహారెడ్డి.. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. వరుసగా మూడు సార్లు రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఒక న్యాయవాది 17 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగి సేవలందించడం దేశంలోనే రికార్డు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర బార్ కౌన్సిల్ తొలి చైర్మన్‌గానూ ఆయనే ఎన్నికయ్యారు. ఐదుసార్లు బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిసిప్లినరీ కమిటీ కో–ఆప్షన్ సభ్యుడిగానూ పనిచేశారు. బార్ కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకు బార్ కౌన్సిల్‌కు నేరుగా సాయం చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని పేర్కొంటున్న నరసింహారెడ్డి వివరాలు ఆయన మాటల్లోనే..
సేవా భావంతోనే బార్ కౌన్సిల్‌కు...
జూనియర్ న్యాయవాదిగా పని చేస్తున్న సమయంలో సివిల్ కోర్టులో ఎక్కువగా కేసులు వాదించే వాడిని. అప్పటి నుంచే న్యాయవాదుల సంక్షేమానికి ఏదో చేయాలన్న తపన ఉండేది. దీంతో నన్ను బార్ కౌన్సిల్‌కు పోటీ చేయమని చాలా మంది న్యాయవాదులు ప్రోత్సహించారు. నాటి బార్ కౌన్సిల్ చైర్మన్ ఎల్లారెడ్డి కూడా ఆహ్వానించారు. అలా 1995లో తొలిసారి బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యా. సమరసింహారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో మాట్లాడి న్యాయవాదులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. సహచరులు దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి(మాజీ ఏజీ), జస్టిస్ ఏ.గోపాల్‌రెడ్డి (జడ్జి)తో కలసి పలు కార్యక్రమాలు చేపట్టాం.
మహానేత వైఎస్సార్‌తో అనుబంధం...
2006లో తొలిసారి బార్ కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టా. కొద్ది రోజుల తరువాత అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్‌ను కలిసే అవకాశం వచ్చింది. న్యాయవాదుల సంక్షేమం కోసం ఏం చేద్దాం అని ఆయన అడగడంతో కొన్ని వివరాలను చెప్పా. ఒక్కొక్కటిగా చేస్తూ పోదాం అంటూ న్యాయ శాఖ మంత్రిని పిలిచి వెంటనే రూ.1.65 కోట్లను మంజూరు చేశారు. అప్పటికే ఇతర రంగాలు సాంకేతిక వైపు పరుగులు ప్రారంభించడంతో నాటి సీజే జస్టిస్ మదన్‌లోకూర్ సూచన మేరకు బార్ అసోసియేషన్లలో కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ ఏర్పాటు చేశాం. వాటి వినియోగంపై న్యాయవాదులకు శిక్షణనిచ్చాం.
స్టైపెండ్ ఇవ్వాలని కోరుతున్నాం..
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయవాదులు సంక్షేమం కోసం బార్ కౌన్సిల్‌కు రూ.100 కోట్లు కేటాయించి.. రూ.25 కోట్లు మంజూరు చేశారు. అక్కడ కొత్త న్యాయవాదులకు ఐదేళ్ల వరకు స్టైపెండ్ ఇస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ చేపట్టాలని కోరుతున్నా.. న్యాయవాదులు వినియోగించే స్టాంప్‌ల ద్వారా న్యాయవాదుల సంక్షేమ నిధికి కొంత మేర నిధులు చేకూరుతాయి. ప్రభుత్వ అధికారులు కూడా విధిగా ఈ స్టాంప్‌లు వినియోగించాలని చట్టం చెబుతున్నా వారు
పాటించడంలేదు.
అడ్వొకేట్ లా అకాడమీ ఏర్పాటు నా కల..
రాష్ట్రంలో లా అకాడమీ ఏర్పాటు చేయలన్నది నా కల. యువ న్యాయవాదులకు శిక్షణ ఇవ్వ డం, సీనియర్ న్యాయవాదులతో మార్గనిర్దేశం చేసే కార్యక్రమాలు చేయాలని భావించాం. కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా దీనిపై అడుగు ముందుకు పడటం లేదు.
మీడియేషన్ చట్టబద్ధం కానుంది..
కోర్టుల్లో విపరీతంగా పెరిగిపోతున్న కేసులకు మీడియేషనే పరిష్కారం. న్యాయవాదులకు మీడియేషన్‌పై అవగాహన కల్పించాలి. ముందుగా ఏ కేసునైనా మీడియేషన్‌కు పంపిన తర్వాతే విచారణ చేపట్టాలి. ఆ దిశగా కేంద్ర చట్టం చేస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే అధికారికంగా మీడియేటర్లను నియమిస్తారు. వారిచ్చే ఉత్తర్వులు చట్టబద్ధం అవుతాయి. అలాగే, పాత కాలపు పద్ధతులకు స్వస్తి పలికే చర్యలు తీసుకున్నాం. కోర్టుల్లో యువరానర్, మైలార్డ్ పదాలు అవసరం లేదని సర్, మేడమ్ అంటే చాలని నిర్ణయం తీసుకున్నాం. న్యాయవాదులకు ఉజ్వల భవిష్యత్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment