చెన్నై, సాక్షి ప్రతినిధి:విచారణ ముగిసిన మూడునెలల్లోగా తీర్పు చెప్పని న్యాయమూర్తులకు కేసులు విచారించే అవకాశాన్ని ఇవ్వరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూరియన్ జోసెఫ్ అన్నారు. కేసు విచారణ తరువాత నెల లేదా మూడు మాసాల్లోగా తీర్పు చెప్పనివారు కొత్త కేసుల విచారణకు అర్హులు కారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిలభారత బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జరిగిన సదస్సులో సుప్రీంకోర్టు, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరైన సూరియన్ జోసెఫ్ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒక కేసు విచారణ ముగిసిన తరువాత తీర్పు చెప్పేందుకు కనిష్ట కాలం నెల గరిష ్టకాలం మూడు నెలలని ఆయన అన్నారు.
మూడు నెలలకు మించి కేసుల తీర్పును మూలనపడేసే న్యాయమూర్తులకు కొత్త కేసులు విచారించే అవకాశాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కల్పించరాదని ఆయన ఆదేశించారు. పెండింగ్ కేసులపై తీర్పులు పూర్తిచేసిన తరువాతనే కొత్త కేసుల బాధ్యతలను అప్పగించాలని ఆయన సూచించారు. అలాగే, న్యాయవాదులు కోర్టులను బహిష్కరించరాదని అనేక సందర్భాల్లో మూడుమార్లు తీర్పుచెప్పినా బహిష్కరిస్తూనే ఉన్నారని ఆయన తప్పుపట్టారు. కోర్టు నిర్ణయాలకు విరుద్ధంగా విధులను బహిష్కరించే చర్యలను మానుకోవాలని ఆయన కోరారు.
మీడియాకు చెప్పొద్దు:
కేసు విచారణ సమయాల్లో న్యాయమూర్తులు వెలిబుచ్చే అభిప్రాయాలను మీడియాకు తె లపడం మానుకోవాలని ఆయన హితవుపలికారు. తీర్పుకోసం వేచిచూసే కేసుల్లో మీడియానే తీర్పు చెప్పేస్తోందని ఆయన అన్నారు. నిర్భయ కేసులో నిందితునికి తీవ్రస్థాయిలో శిక్షకు గురిచేసేలా మీడియా కథనాలు వెలువడ్డాయని తీర్పు చెప్పిన న్యాయమూర్తి కూడా వ్యాఖ్యానించారని సూరియన్ జోసెఫ్ గుర్తు చేశారు. మీడియాలో సామాజిక బాధ్యతలను ఎరిగి మసలుకోవాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జే చలమేశ్వర్ మాట్లాడుతూ కేసులు సుదీర్ఘ కాలం కొనసాగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కారణమని అన్నారు. 1975లో ఆంధ్రప్రదేశ్‌లోని ఒక జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే బూడిదను వేసేందుకు తీసిన గొయ్యి స్థలం తమకు చెందినదని అటవీశాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అనేక సంవత్సరాల పాటూ సాగిన ఈ కేసులో కొన్నేళ్ల క్రితమే తీర్పు చెప్పారని ఆయన ఉదహరించారు. కాబట్టి కేసుల్లో జాప్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కారకులు కారాదని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎఫ్‌ఎమ్ ఇబ్రహీం కలీబుల్లా మాట్లాడుతూ ఎటువంటి లోపాలు లేని చట్టాన్ని తేవడం, అది సక్రమంగా అమలయ్యేలా చూడడం ప్రభుత్వాల బాధ్యతని అన్నారు. లంచం, అవినీతిని సమాజం నుంచి పారదోలాలని ఆయన కోరారు. ఎంబీబీఎస్, ఎండీ చదువులకు ఇంత ఫీజు అనే చట్టం ఉండి కూడా రూ.50లక్షలు, అంతకు మించి వసూలు చేస్తున్నారని ఆయన తప్పుపట్టారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంవై ఇక్బాల్ మాట్లాడుతూ నాకు తెలిసినంత వరకు మద్రాసు హైకోర్టులో 20 మంది వరకు ధనికులైన న్యాయవాదులు ఉన్నారు, పార్లమెంటు సభ్యల వలెనే ఈ న్యాయవాదులు సైతం గ్రామాలను దత్తత తీసుకోవాలని ఆయన కోరారు.
గ్రామాల్లో న్యాయశాస్త్రం, కంప్యూటర్ విద్య వంటి ఉన్నతమైన గ్రంథాలను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు ప్రధానంగా భాగస్వామ్యులు కావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సీ నాగప్పన్ పిలుపునిచ్చారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ మాట్లాడుతూ న్యాయమూర్తులు, న్యాయవాదులు సమాజం కోసమే పాటుపడుతున్నారని చెప్పారు. అయితే కేసుల పరిష్కారంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. కోర్టు విధుల బహిష్కరణ ఏవిధంగానూ సమస్యకు పరిష్కారం చూపదని, జపాన్ విధానంలో న్యాయవాదులు సైతం ఏడాదికి 15 రోజులు అధికంగా పనిచేయడం ద్వారా తమ నిరసనను వెలిబుచ్చాలని కోరారు. అఖిలభారత బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎంకే మిశ్రా మాట్లాడుతూ భారత్‌లోని మొత్తం న్యాయవాదుల్లో 30 శాతం మంది నకిలీలు, 20 శాతం మంది నకిలీ సర్టిఫికెట్లను దాఖలు చేసి న్యాయవాదులగా నమోదు చేసుకుని విధులను నిర్వర్తిస్తున్నారని చెప్పారు.
మరో 10 శాతం మంది చట్టాన్నే చదవకుండా బార్ కౌన్సిల్‌లో పేర్లను నమోదు చేసుకుని న్యాయవాదులుగా చలామణి అవుతున్నారని వివరించారు. ఈ కారణంగా దేశంలోని న్యాయవాదుల సర్టిఫికెట్లను తనిఖీ చేసే కార్యక్రమాన్ని తాము చేపట్టామని తెలిపారు. పవిత్రమైన న్యాయవాద వృత్తిని తప్పుడు పనులకు వాడుకునేందుకు ఎంతమాత్రం అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. న్యాయవాద వృత్తి పేరుతో వేరు వృత్తులు చేసుకుంటున్న వారిని నిరోధించేందుకు చట్టంలో సవరణలు చేయాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆర్ భానుమతి, వీ గోపాల గౌడ, హైకోర్టు న్యాయమూర్తులు సతీష్‌కుమార్ అగ్నిహోత్రి, తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్ అధ్యక్షులు టీ సెల్వం పాల్గొన్నారు.
విచారణ ముగిసిన మూడునెలల్లోగా తీర్పు చెప్పాలి
Published Mon, Jul 27 2015 2:46 AM | Last Updated on Sun, Sep 2 2018 5:50 PM
Advertisement
Advertisement