సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బార్ కౌన్సిళ్ల ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరిగాయి. న్యాయమూర్తులు జస్టిస్ అంబటి శంకర నారాయణ, జస్టిస్ పి.కేశవరావు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించారు. హైకోర్టులో తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం 3,461 మంది ఓటర్లకు గాను 2,590 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణవ్యాప్తంగా 80%పైగా పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల 100% పోలింగ్ నమోదైనట్లు బార్ కౌన్సిల్ వర్గాలు వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 85% మేర పోలింగ్ జరిగినట్లు సమాచారం. ఇక హైకోర్టులో ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 2,746 మంది ఓటర్లకు గాను 1,552 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ కొందరు ఉద్దేశపూర్వకంగా చేసిన గొడవతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోగా అధికారుల జోక్యంతో తిరిగి పోలింగ్ ప్రారంభమైంది. ఇరు రాష్ట్రాల్లోని బ్యాలెట్ బ్యాక్సులకు సీలు వేసి వాటిని హైదరాబాద్‌కు తరలించనున్నారు. బార్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యే 25 మంది తమలో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఏపీ బార్ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు జూలై 11న, తెలంగాణ బార్ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు జూలై 23న ఉంటుంది.
ఢిల్లీలో 60 శాతం పోలింగ్..
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బార్ కౌన్సిళ్ల ఎన్నికల్లో పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులు ఢిల్లీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడు అల్లంకి రమేశ్ ఎన్నికల అధికారిగా, న్యాయవాదులు ప్రభాకర్, ఎస్‌ఏ.నఖ్వీ సహాయ అధికారులుగా వ్యవహరించారు. మొత్తం 60% పోలింగ్ నమోదైందని రమేశ్ తెలిపారు.
ప్రశాంతంగా బార్ కౌన్సిళ్ల ఎన్నికలు
Published Sat, Jun 30 2018 1:51 AM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment