అవినీతి కేసుల్లో దర్యాప్తును ఆపరాదు
- ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పులిచ్చింది
- అవినీతిపై దర్యాప్తునకు ఆదేశించే అధికారం ఏసీబీ కోర్టుకు ఉంది
- హైకోర్టుకు నివేదించిన ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు
- తదుపరి విచారణ నేటికి వారుుదా
సాక్షి, హైదరాబాద్: అవినీతికి సంబంధించిన కేసుల్లో దర్యాప్తును అడ్డుకోరాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పులిచ్చిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ‘ఓటుకు కోట్లు’కేసులో హైకోర్టుకు నివేదించారు. అవినీతి కేసులో దర్యాప్తునకు ఆదేశించే అధికారం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు ఉందని, దాని అధికారాలను హరించే హక్కు ఈ కోర్టుకు లేదని వివరించారు. కేసు తీవ్రత ఎక్కువగా ఉన్నా...విచారణ పరిధిని అతిక్రమించి ఈ కేసులో దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారని ఆయన పేర్కొన్నారు. కేసు తొలిదశలోనే, సాక్షులను విచారించకుండానే దర్యాప్తును నిలిపివేయడం సరికాదన్నారు. ఏసీబీ కోర్టు దర్యాప్తు(ఇన్వెస్టిగేషన్) చేసి నివేదిక సమర్పించమని ఆదేశించిందని, తమ ఉద్దేశం ప్రకారం ఇన్వెస్టిగేషన్, ఎంక్వరుురీ పర్యాయ పదాలేనని తెలి పారు. అలాగే ఓటుహక్కు వినియోగించుకోవడం పబ్లిక్‌డ్యూటీలో భాగమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందన్నారు.
అవినీతి ఆరోపణల కేసుల్లో దర్యాప్తును అడ్డుకోరాదంటూ అత్యున్నత న్యాయస్థానాలిచ్చిన తీర్పులను ఈ సందర్భంగా పొన్నవోలు కోర్టు దృష్టికి తెచ్చారు. ‘ఓటుకు కోట్లు’కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగట్లేదని, ఈ కేసులో చంద్రబాబు పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నా ఆ దిశగా ఏసీబీ దర్యాప్తు చేయట్లేదని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రరుుంచారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం చంద్రబాబు హైకోర్టును ఆశ్రరుుంచారు. విచారణ జరిపిన హైకోర్టు.. దర్యాప్తును నిలిపివేస్తూ స్టే ఇచ్చింది.
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రరుుంచగా.. ఈ వ్యవహారంపై 4 వారాల్లో విచారణను పూర్తి చేయాలని హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ సునీల్‌చౌదరి మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. ‘‘రాజకీయ ప్రోద్బలంతో ఆర్కే పిటిషన్ వేశారనడం సరికాదు. ఈ కేసుకు సంబంధించిన పత్రాలు సంపాదించడాన్ని తప్పుబట్టడం సరికాదు. తమ వాదనలో బలముందా లేదా అన్నదే పరిశీలించాలి’’అని పొన్నవోలు వివరించారు. కోర్టు సమయం ముగియడంతో...న్యాయమూర్తి తదుపరి విచారణను బుధవారానికి వారుుదా వేశారు.