
పెండింగ్ కేసులతో నివేదికలు
దేశంలోని పెండింగ్ కేసుల వివరాలతో కోర్టులు వార్షిక నివేదిక విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
ఏటా వెలువరించాలని కోర్టులను కోరిన ప్రధాని మోదీ
పట్నా: దేశంలోని పెండింగ్ కేసుల వివరాలతో కోర్టులు వార్షిక నివేదిక విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. శనివారమిక్కడ పట్నా హైకోర్టు శతాబ్ది వేడుకల ముగింపు సభలో మాట్లాడుతూ... కోర్టులు సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకునే విషయంలో సలహాలు ఇవ్వాలని కోరారు. ‘నా ఆలోచనతో ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. కోర్టుల్లో పేరుకుపోయిన పాత కేసుల వివరాలు ప్రస్తావిస్తూ... ఏటా బులెటిన్ విడుదల చేయాలి. 40, 50 ఏళ్ల పాత కేసులు కూడా అందులో ఉన్నాయి.
అలా చేస్తే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది. కేసుల పరిష్కారానికి ఈ సమాచారం స్ఫూర్తిగా నిలుస్తుంది. కేసు ఎందుకు పెండింగ్ ఉందో తెలుసుకుని పరిష్కారం కనుగొనేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది..’ అని చెప్పారు. ఇదివరకు లేని సాంకేతికత మన దగ్గర ఉందని, బార్, బెంచ్, కోర్టుల్లో డిజిటల్ టెక్నాలజీ ప్రవేశపెడితే... మంచి తీర్పులు ఇవ్వడంలోను, వాదనల్లో సాయపడుతుందన్నారు. వందేళ్లలో పట్నా హైకోర్టు ఎన్నో కీర్తి శిఖరాలు అధిరోహించిందని కొనియాడారు. బార్ కౌన్సిల్, కోర్టు కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వ్యవస్థలు తరచూ మారకపోతే కాలానికనుగుణంగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చలేమన్నారు.
ఖాళీలు భర్తీ చేయండి: టీఎస్ ఠాకూర్
దేశంలో పెద్దసంఖ్యలో జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కేసుల పరిష్కారంలో ఇదే అడ్డంకిగా మారిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీ.ఎస్.ఠాకూర్ అన్నారు. హైకోర్టుల్లో 900 మంది జడ్జిలు ఉండాల్సి ఉండగా 468 మందే ఉన్నారన్నారు. జడ్జిల భర్తీలో అనుమతుల్ని వేగవంతం చేయాలని, ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. గత రెండు నెలల్లో 150 మంది జడ్జిల్ని వేర్వేరు హైకోర్టుల్లో నియమించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం నితీశ్, కేంద్ర న్యాయ మంత్రి సదానందగౌడ, బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌లు పాల్గొన్నారు.
మోదీ, నితీశ్ భాయ్ భాయ్?
సభలో పరస్పర ప్రశంసలు
హాజీపూర్: బిహార్ ఎన్నికల్లో ఉప్పు-నిప్పులా ఉన్న ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ శనివారం ఒకే వేదికపై ఆప్యాయంగా పలకరించుకున్నారు. బిహార్‌లోని హాజీపూర్ రైల్-కమ్-రోడ్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి మోదీ, సీఎం నితీశ్ హాజరయ్యారు. ఇతర వక్తలు మాట్లాడుతుండగా ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. తొలుత నితీశ్ ప్రసంగిస్తూ ‘గంగానదిపై కూలేస్థితిలో ఉన్న బ్రిడ్జి అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసు కుంది. మీరు(మోదీ) ప్రధాని అయ్యా క అభివృద్ధిపై నా అంచనాలు మరింత పెరిగాయి. ప్రజలకు తప్పకుండా మేలు జరుగుతుంది. ఎన్నికల తర్వాత తొలిసారి బిహార్ వచ్చారు. రాష్ట్రపురోగతికోసం ఇకపై మీరు తరచూ రావాలి’ అని అన్నారు. ఆ సమయంలో జనం మోదీ-మోదీ అని నినాదాలు చేయగా, ప్రధాని లేచి వచ్చి వారిని శాంతపరిచారు. ప్రసంగంలో మోదీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ‘ప్రధాన మంత్రి గ్రామీణ విద్యుదీకరణ పథకాన్ని నితీశ్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈయన వల్లే బిహార్‌లో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ముందడుగేస్తే బిహార్ ఊహించనంత పురోగతి సాధిస్తుంది’ అని అన్నారు.