కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కృషి
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కృషి
Published Sat, Nov 26 2016 11:28 PM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM
– రాజ్యసభ సభ్యుడు టీజీ
కర్నూలు(లీగల్): కర్నూలులో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ అన్నారు. జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన న్యాయవాదుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లా అదనపు న్యాయమూర్తులు వి.వి.శేషుబాబు, జి.రఘురాం ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో టీజీ మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టుతో పాటు రాష్ట్ర రెండో రాజధానిని కూడా సాధిద్దామన్నారు. న్యాయవాదుల సంఘం కార్యాలయ నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.80 లక్షలు మంజూరు చేయిస్తానన్నారు. అర్హత కల్గిన న్యాయవాదులందరికీ ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులతో పాటు జిల్లా, మున్సిఫ్ కోర్టుల్లో వాహనాల పార్కింగ్ షెడ్డులతో పాటు మున్సిఫ్ కోర్టు ఆవరణలో మినరల్ వాటర్ ప్లాంటు నిర్మాణానికి హామీ ఇచ్చారు. 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి వి.వి.శేషుబాబు మాట్లాడుతూ న్యాయవాదులు బాధ్యతతో పనిచేసి గౌరవాన్ని నిలపాలన్నారు. నాలుగో అదనపు జిల్లా జడ్జి జి.రఘురాం మాట్లాడుతూ సమాజంలో చట్ట వ్యతిరేక నిబంధనలు వచ్చినప్పుడు న్యాయవాదులు ముందుండి పోరాడతారని చెప్పారు. అంతకుముందు బార్ అసోసియేషన్ రూపొందించిన పతాకాన్ని సీనియర్ న్యాయవాది బి.జంగంరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో 40 ఏళ్లు పైబడి వృత్తిలో ఉన్న న్యాయవాదులు బి.జంగంరెడ్డి, ఎం.డి.వై.రామమూర్తి, పోలూరి ఎల్లప్ప, జి.నాగలక్ష్మిరెడ్డిలను న్యాయమూర్తులు, న్యాయవాదులు సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.చాంద్‌బాషా, సి.వి.శ్రీనివాసులు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రవిగువేరా, సీనియర్ సివిల్ జడ్జీలు ఎం.సోమశేఖర్, గాయత్రి దేవి, శివకుమార్, జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ స్వప్నారాణి, పి.రాజు, మహిళా ప్రతినిధి గీతామాధురి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి స్కూల్ విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.
Advertisement
Advertisement