
సాక్షి, అమరావతి: వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం పోలీసులు హాజరుపరిచినప్పుడు మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరించ కుండా.. అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ పరిధిలోని మేజిస్ట్రేట్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తామంది. అర్నేష్‌కుమార్ కేసులో తీర్పును అమలు చేయని మేజిస్ట్రేట్‌లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. అర్నేష్‌కుమార్ తీర్పును మేజిస్ట్రేట్లు పాటించడం లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.
ఈ విషయంలో తగిన ఆదేశాలు ఇస్తామంటూ తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మీడియాకు సంబంధించిన వ్యక్తులతోపాటు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేస్తున్నారని, ఎఫ్‌ఐఆర్‌ను 24 గంటల్లో అప్‌లోడ్ చేయడం లేదంటూ టీవీ 5 న్యూస్ చానల్ యజమాని బొల్లినేని రాజగోపాల్‌నాయుడు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై మంగళవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.
పిటిషనర్ న్యాయవాది ఉమేశ్‌చంద్ర.. సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇవ్వకుండా పోలీసులు నేరుగా అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌లను 24 గంటల్లో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. పిటిషనర్ అభ్యర్థనలను ఓసారి గమనించాలంటూ ఏజీ చదివి వినిపించారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం.. పిటిషనర్ అభ్యర్థనలు అస్పష్టంగా, పసలేకుండా ఉన్నాయని తెలిపింది. పోలీసు అధికారం లేని రాష్ట్రం మనుగడ సాధించలేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment