magistrates
-
పదవీ విరమణ వయసు పెంపు సాధ్యం కాదు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం సాధ్యం కాదని హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలని, న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు దీనితో సమానంగా ఉండటానికి రాజ్యాంగ నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేసింది. ఈ తేడా సహేతుకమైనదేనని, దీనిని అలాగే కొనసాగించాలని ఆల్ ఇండియా జడ్జిల అసోసియేషన్ కేసులో సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది. న్యాయాధికారుల రిటైర్మెంట్ వయస్సు పెంపుపై ఫుల్ కోర్టు (పాలనాపరమైన నిర్ణయాల కోసం హైకోర్టు న్యాయమూర్తులందరు సమావేశమవడం) నిర్ణయం తీసుకోజాలదని తేల్చి చెప్పింది. ఆ నిర్ణయాధికారం ఫుల్‌కోర్టుకు లేదని, అలా చేయడం సుప్రీంకోర్టు తీర్పును అతిక్రమించడమే అవుతుందని స్పష్టం చేసింది. పైపెచ్చు ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టంలోని సెక్షన్ 3(1ఏ) ప్రకారం న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లుగానే ఉందని, దానిని సవరించనప్పుడు 62 ఏళ్లకు పెంచడం సాధ్యం కాదంది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. విశ్రాంత న్యాయాధికారి కె.సుధామణి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. విజయనగరం జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న కె.సుధామణి వయసు 60 ఏళ్లకు చేరుకోవడంతో ఆమెకు పదవీ విరమణ వర్తింపజేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ సుధామణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయాధికారుల రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది జె. సుధీర్ వాదనలు వినిపించారు. హైకోర్టు తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. -
రిమాండ్ కారణాలను రికార్డ్ చేయాల్సిందే
సాక్షి, అమరావతి: నిందితుడిని రిమాండ్‌కు పంపే సమయంలో అందుకుగల కారణాలను మేజిస్ట్రేట్లు తప్పనిసరిగా రికార్డ్‌చేసి తీరాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. వారు యాంత్రికంగా వ్యవహరించకుండా కేసు పూర్వాపరాలను పరిగణనలోకి తీసుకుని ఆ తరువాతే సహేతుక ఉత్తర్వులు జారీచేయాలని స్పష్టంచేసింది. రిమాండ్ ఉత్తర్వులు లోపభూయిష్టంగా ఉన్నట్లు తాము (హైకోర్టు) గమనించినా, నిందితుల తరఫున తమ దృష్టికి తీసుకొచ్చినా ఆ మేజిస్ట్రేట్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. -
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సిందే
సాక్షి, అమరావతి: వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం పోలీసులు హాజరుపరిచినప్పుడు మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరించ కుండా.. అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ పరిధిలోని మేజిస్ట్రేట్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తామంది. అర్నేష్‌కుమార్ కేసులో తీర్పును అమలు చేయని మేజిస్ట్రేట్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. అర్నేష్‌కుమార్ తీర్పును మేజిస్ట్రేట్లు పాటించడం లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఈ విషయంలో తగిన ఆదేశాలు ఇస్తామంటూ తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మీడియాకు సంబంధించిన వ్యక్తులతోపాటు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేస్తున్నారని, ఎఫ్ఐఆర్ను 24 గంటల్లో అప్లోడ్ చేయడం లేదంటూ టీవీ 5 న్యూస్ చానల్ యజమాని బొల్లినేని రాజగోపాల్‌నాయుడు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై మంగళవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ న్యాయవాది ఉమేశ్‌చంద్ర.. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇవ్వకుండా పోలీసులు నేరుగా అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఎఫ్ఐఆర్లను 24 గంటల్లో వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. పిటిషనర్ అభ్యర్థనలను ఓసారి గమనించాలంటూ ఏజీ చదివి వినిపించారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం.. పిటిషనర్ అభ్యర్థనలు అస్పష్టంగా, పసలేకుండా ఉన్నాయని తెలిపింది. పోలీసు అధికారం లేని రాష్ట్రం మనుగడ సాధించలేదని పేర్కొంది. -
‘మెజిస్ట్రేట్లు జిల్లా జడ్జీలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హులు కారు’
న్యూఢిల్లీ: మెజిస్ట్రేట్లు, సివిల్ జడ్జీలు తదితర న్యాయ వ్యవస్థలోని దిగువ విభాగానికి చెందిన వారు జిల్లా జడ్జీల డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హులు కారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న కాలంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జీలుగా విధుల్లో చేరిన జ్యూడీషియల్ అధికారులు.. మళ్లీ తమ పాత హోదాకు తిరిగివెళ్లాలని ఆదేశించింది. మెజిస్ట్రేట్లు, సివిల్ న్యాయమూర్తులు మెరిట్‌తో, సీనియారిటీతో పదోన్నతుల ద్వారా కానీ, లిమిటెడ్ కాంపిటీటివ్ పరీక్ష ద్వారా కానీ జిల్లా జడ్జీలుగా నియామకం కావచ్చని పేర్కొంది. సాధారణంగా ఏడేళ్ల పాటు వరుసగా న్యాయవాద వృత్తిలో కొనసాగినవారు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జీలు అయ్యేందుకు అర్హులవుతారు. జ్యూడీషియల్ అధికారులుగా విధుల్లో చేరకముందు, ఏడేళ్ల వరుస సర్వీసు ఉన్నప్పటికీ.. వారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జీలు అయ్యేందుకు అర్హులు కాబోరని ధర్మాసనం స్పష్టం చేసింది. జిల్లా జడ్జీల నియామకానికి సంబంధించిన ఆర్టికల్ 233కి ధర్మాసనం వివరణ ఇచ్చింది. -
న్యాయాధికారుల వేతనం మూడు రెట్లు
న్యూఢిల్లీ: దిగువ కోర్టుల న్యాయాధికారుల వేతనాన్ని మూడురెట్ల వరకు పెంచాలని రెండో నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ సిఫారసు చేసింది. పింఛను, అలవెన్సుల మొత్తాన్ని 2016 ఏడాదినుంచి అమలయ్యేలా పెంచాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆమోదిస్తే ఇవి అమలుల్లోకి రావచ్చు. 2017లో ఏర్పాటైన ఈ కమిషన్ తన నివేదికను జనవరి 29న సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పి.వెంకట రామారెడ్డి నేతృత్వంలోని ఈ కమిషన్ దిగువ కోర్టుల్లో జడ్జీల వ్యవస్థ, పని విధానాలను పరిశీలించింది. తుది నివేదిక ప్రకారం.. జూనియర్ సివిల్ జడ్జి/ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ వేతనాన్ని రూ.27,700 నుంచి రూ.77,840కు పెంచాలి. ఆపై సీనియర్ సివిల్ జడ్జి వేతనం రూ.1,11,000 లేదా, అంతకంటే ఎక్కువ.. జిల్లా జడ్జీల ప్రారంభ వేతనం రూ.1,44,840 ఉండాలి. జిల్లా జడ్జీల వేతనం గరిష్టంగా రూ.2,24,100 ఉండాలి. చివరి వేతనంలో 50 శాతం పింఛనుగా ఇవ్వాలి. -
డ్రంకెన్ డ్రైవ్‌లో 39 కేసులు నమోదు
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ చెప్పేందుకు ఎల్బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు శుక్ర, శని, ఆదివారాలలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో 39 కేసులను నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ పుష్పా దేశ్‌ముఖ్ డ్రంక్ అండ్ డ్రై వ్‌లో పట్టుబడిన వాహనదారుల తల్లిదండ్రులు, భార్యలను పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడిపిన 37 మందికి రూ.2వేల జరిమానా, అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి నాలుగు రోజుల ట్రాఫిక్ విధులు నిర్వహించాలని తీర్పు చెప్పారు.