న్యూఢిల్లీ: మెజిస్ట్రేట్లు, సివిల్ జడ్జీలు తదితర న్యాయ వ్యవస్థలోని దిగువ విభాగానికి చెందిన వారు జిల్లా జడ్జీల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు అర్హులు కారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న కాలంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా జిల్లా జడ్జీలుగా విధుల్లో చేరిన జ్యూడీషియల్ అధికారులు.. మళ్లీ తమ పాత హోదాకు తిరిగివెళ్లాలని ఆదేశించింది. మెజిస్ట్రేట్లు, సివిల్ న్యాయమూర్తులు మెరిట్‌తో, సీనియారిటీతో పదోన్నతుల ద్వారా కానీ, లిమిటెడ్ కాంపిటీటివ్ పరీక్ష ద్వారా కానీ జిల్లా జడ్జీలుగా నియామకం కావచ్చని పేర్కొంది. సాధారణంగా ఏడేళ్ల పాటు వరుసగా న్యాయవాద వృత్తిలో కొనసాగినవారు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా జిల్లా జడ్జీలు అయ్యేందుకు అర్హులవుతారు. జ్యూడీషియల్ అధికారులుగా విధుల్లో చేరకముందు, ఏడేళ్ల వరుస సర్వీసు ఉన్నప్పటికీ.. వారు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా జిల్లా జడ్జీలు అయ్యేందుకు అర్హులు కాబోరని ధర్మాసనం స్పష్టం చేసింది. జిల్లా జడ్జీల నియామకానికి సంబంధించిన ఆర్టికల్ 233కి ధర్మాసనం వివరణ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment