
సాక్షి, అమరావతి: ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ) నిబంధనలు చెబుతున్నాయని, ఈ నిబంధనను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఆగస్టు 9న విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
25 శాతం ఉచిత సీట్ల నిబంధనను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ న్యాయవాది తాండవ యోగేష్ 2017లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గురువారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, పిటిషనర్ యోగేష్ స్వయంగా వాదనలు వినిపిస్తూ, చట్ట నిబంధనలు ఇప్పటికీ అమలు కావడం లేదన్నారు. పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ ఆగస్టు 9న ఈ వ్యాజ్యంపై విచారణ చేపడుతామని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment