పిచ్చి కుదిరింది... తలకు రోకలి చుట్టమన్నాడట! చరిత్ర పేరుచెప్పి, దేశంలో ప్రతి ఊరి పేరు, వీధి పేరు, స్థలం పేరూ మార్చేయాలని చూస్తున్న వేలంవెర్రిని గమనిస్తే, ఆ నానుడి గుర్తుకొస్తుంది. సర్వోన్నత న్యాయస్థానానికి సైతం అదే గుర్తొచ్చింది. ఆ మాటనే పస లేని పిటిషన్‌తో వచ్చిన ఫిర్యాదీతో సహా పదుగురికీ మరో పద్ధతిలో గుర్తూ చేసింది. ‘ఆటవిక విదేశీ దురాక్రమణదారులు మార్చిన’ చారిత్రక ప్రదేశాల ‘అసలు’ పేర్లను పునరుద్ధరించడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం సుప్రీమ్ కోర్ట్ కొట్టేసింది.
జస్టిస్ జోసెఫ్, నాగరత్నల ధర్మాసనం పిటిషనర్ అత్యు త్సాహాన్ని తప్పుబట్టింది. భారత్ పదేపదే దాడులకు గురైంది నిజమే. విదేశీయులు మనల్ని పాలించినదీ నిజమే. దాన్ని గుర్తిస్తూనే, ‘సమాజంలో విభేదాల’ సృష్టికి ‘చరిత్రను కొంతమేరకే తవ్వి తలకుపోస్తున్న’ ప్రయత్నాలను సుప్రీమ్ నిరసించడం సరైన సమయంలో వెలువడింది.
చరిత్ర పట్ల ఏదో నిర్ణీత దృక్పథం పెట్టుకొని, తదనుగుణంగా ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర దేశాన్ని గత చరిత్రలో బందీని చేయరాదంటూ పిటిషనర్‌కు కోర్ట్ హితవు చెప్పాల్సి వచ్చింది. వర్తమాన భారతావనిలో పరిష్కరించాల్సిన అనేక అంశాలుండగా, ఈ పేర్ల మార్పిడినే అజెండాగా పాలకులు, వారి భావజాల దాసులు తలకెత్తుకోవడం విచిత్రం.
తాజాగా మహారాష్ట్రలో మొఘల్ పాలకులు ఔరంగజేబ్, మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేర్ల మీద వెలసిన నగరాలైన ఔరంగాబాద్‌ను ఛత్రపతి శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గా ఆ రాష్ట్ర పాలకులు మార్చేశారు. గత వారమే కేంద్రం దానికి రాజముద్రా వేసింది. ఇప్పుడిక అహ్మద్‌నగర్‌ను రాణి అహిల్యాదేవి హోల్కర్ పేరిట మార్చాలన్న డిమాండ్ ఊపందుకుంది. సరిగ్గా అదే రోజున పేర్ల మార్పిడిపై సుప్రీమ్ చేసిన ఈ వ్యాఖ్యలు కళ్ళు తెరిపించేలా ఉన్నాయి. ఆత్మశోధనకు ప్రేరేపిస్తున్నాయి.
పేరులో ఏముంది పెన్నిధి అన్నారు పెద్దలు. కానీ, పేరులోనే అంతా ఉంది, ఒక వర్గం పాల కులు వచ్చి మన పేర్లు మార్చేశారంటూ రాగద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేయడం నేటి వికృత ధోరణి. పాత పేర్లను మార్చడం ద్వారా సమాజంలో ఒక వర్గం ఏకీకృతమై, తమ వైపు మొగ్గేలా చేసుకోవాలన్న వ్యూహం దేశ రాజకీయాల్లో ఇటీవల ప్రబలుతోంది. ఇది ప్రమాదకరం.
ఈ నేపథ్యంలో ‘నేను క్రైస్తవుణ్ణి. అయితేనేం, నాకు హిందూయిజమూ ఇష్టం. ఎంతో గొప్పదైన హిందూ ధర్మాన్ని తక్కువ చేయకూడదు’ అని జస్టిస్ జోసెఫ్ వ్యాఖ్యానించడం విశేషం. మన దేశానికి పునాదులుగా నిలిచిన సహనం, సౌభ్రాతృత్వం, భిన్నత్వం, సమ్మిళితత్వాలకు ఒక రకంగా ఇది పునరుద్ఘాటన.
భిన్నత్వంలో ఏకత్వానికి ఘనత వహించిన గడ్డపై ఒక విధమైన భావజాలమే ఉండాలనీ, ఈ దేశాన్ని పాలించిన విభిన్న వర్గీయులంతా వట్టి ‘దురాక్రమణదారులు, విదేశీ దోపిడీదారులు’ అనీ ప్రచారం చేస్తే మూర్ఖత్వమే. అన్ని పేర్లూ మార్చి, అన్ని ముఖాలకూ సున్నం కొట్టి ఒకే ఉనికిని ధ్రువపరచాలనుకోవడం సాంస్కృతిక, భావజాల సామ్రాజ్యవాదమే తప్ప సమానత్వం కానేరదు.
గద్దె మీది పెద్దలైనా, సమాజంలోని ఇతరులైనా ఈ ఉన్మాదాన్ని పెంచిపోషిస్తే, సామరస్యం దెబ్బతింటుంది. ఎవరైనా చేయాల్సింది మెరుగైన ప్రజాజీవనానికి తోడ్పడేలా విధానపరమైన మార్పులు తప్ప, ఒకరిపై మరొకరిని ఉసిగొలిపే పేరు మార్పులు కాదు. పాత గాయాలను కెలికి, ప్రజల్లో విభేదాలు సృష్టించే ఇలాంటి చర్యలను న్యాయవ్యవస్థే కాదు... బుద్ధిజీవులతో పాటు రాజకీయ సారథులూ నిర్ద్వంద్వంగా ఖండించాలి.
అయితే, అధికారం చేపట్టిన ప్రతి పార్టీ ఇదే పేర్ల మార్పిడి తప్పు చేస్తోంది. గతంలో కాంగ్రెస్ దేశ రాజధానిలోని ప్రసిద్ధ కన్నాట్ ప్లేస్‌ను రాజీవ్ చౌక్‌గా, కన్నాట్ సర్కిల్‌ను ఇందిరా చౌక్‌గా పేర్లు మార్చింది. రెండు తడవలుగా కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ గడచిన కొన్ని నెలల్లో ఎన్ని పేర్లు మార్చిందో లెక్కే లేదు. బ్రిటీషు, మొఘల్ పాలకుల గతాన్ని వదిలించుకోవడానికంటూ కొత్త పేర్ల కథను సమర్థించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
వర్తమానమే వివాదాలమయం అయినప్పుడు గతం అందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. వివాదాలు నిండిన ఆ గతాన్ని పట్టుకొని వేలాడి, ఆగతాన్ని వదిలేసి, నవ నామ్నీకరణలకు దిగితే... కాలహరణమే తప్ప ప్రజానీకానికి పైసా ప్రయోజనం లేదు. దాని బదులు పాలనపై శ్రద్ధపెట్టి, అందమైన భవిష్యత్తు దిశగా అడుగులు వేయడం ఇప్పుడు ముఖ్యం.
ప్రస్తుత పాలకులు రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్ అన్నా, మొఘల్ గార్డెన్స్‌ను అమృతోద్యానంగా మార్చినా, ఢిల్లీలోని ఔరంగ్‌జేబ్ రోడ్, యూపీలోని అలహాబాద్, మొఘల్ సరాయ్‌లకు కొత్త పేర్లు పెట్టినా సామాన్యుల జీవితమేమైనా మారిందా? చరిత్రను భూతంగా, ఒక వర్గం పాలకులనంతా పీడకులుగా, హిందువులు తప్ప మిగతా అందరూ ‘బయటివాళ్ళు’, ‘దోపిడీదొంగలు’గా అసత్య చిత్రణ వల్ల లాభం ఎవరికి? ఈ మిడిమిడి వాట్సప్ జ్ఞానంతో, మధ్యతరగతిని రెచ్చగొట్టే భావోద్వేగ రాజకీయ విన్యాసంతో ఓట్లు, సీట్ల లెక్కల్లో తాత్కాలిక ప్రయోజనం సిద్ధించవచ్చు.
కానీ, స్వార్థంతో నాటుతున్న నేటి ఈ విషబీజాలు రేపటి సమాజాన్ని చీలుస్తుంటే ఆ శాశ్వత ప్రమాదానికి బాధ్యు లెవరు? కులమత విభేదాలకు అతీతమైన నవ భారత నిర్మాణాన్ని నిజంగా స్వప్నించేవారెవరూ ఈ పని చేయరు. పాలకుల స్వప్రయోజనాలతో రోజుకో రకం చరిత్ర చదివితే, అసలు కథ మరుగునపడే దుఃస్థితి దేశానికి దాపురిస్తుంది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడడమంటే ఇదే!
తవ్వి తలకు పోసుకుందామా?
Published Thu, Mar 2 2023 12:33 AM | Last Updated on Thu, Mar 2 2023 12:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment