
సాక్షి, అమరావతి: ఆరోపణలకు నిర్ధిష్టమైన ఆధారాలేవీ చూపకుండానే ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. వీధుల్లో మాట్లాడుకునే మాటల ఆధారంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయిందని వివరించారు. ప్రజాప్రయోజనాలను ఓ జోక్‌గా భావిస్తున్నారన్నారు. దేవదాయ నిధులను అమ్మఒడి పథకానికి మళ్లిస్తున్నారని ఆరోపిస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వ్యక్తి, అందుకు ఒక్క ఆధారాన్ని కూడా కోర్టుకు సమర్పించలేదని తెలిపారు.
దేవదాయ శాఖలో బ్రాహ్మణ కార్పొరేషన్ భాగం కాదని, నిధులను అమ్మఒడి కోసం మళ్లిస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎక్కడా లేదన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, పిల్‌ను కొట్టేసేందుకు సిద్ధమైంది. ఈ దశలో విజయవాడకు చెందిన పిటిషనర్ చింతా ఉమామహేశ్వరరెడ్డి తరఫు న్యాయవాది ఎన్ రవిప్రసాద్, తగిన డాక్యుమెంట్లను కోర్టు ముందుంచుతానని అభ్యర్ధించడంతో న్యాయస్థానం అందుకు అంగీకరిస్తూ విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.