సాక్షి, అమరావతి: శిశు విక్రయాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా మలిచిన హైకోర్టు బుధవారం వాటిపై విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), రాష్ట్ర డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఒకే శిశువు ఆరుసార్లు విక్రయం
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మెడబలిమి మనోజ్ తన మూడు నెలల ఆడ శిశువును నల్గొండ జిల్లా కొండప్రోలు గ్రామానికి చెందిన మేఘావత్ గాయత్రికి రూ.70 వేలకు విక్రయించాడు. తరువాత ఆ శిశువును పలువురు కొనుగోలు చేశారు. చివరకు ఏలూరుకు చెందిన వర్రే రమేశ్ రూ.2.50 లక్షలకు కొనగా.. ఆ దశలో శిశువు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలను చదివిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఈ కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దీంతో రిజిస్ట్రీ ఆ కథనాన్ని పిల్‌గా మలిచింది.
స్పందించిన జువెనైల్ జస్టిస్ కమిటీ
ఇదే రీతిలో ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన జి.చిలకమ్మ అనే మహిళకు పుట్టిన శిశువును తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో విక్రయించారు. దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వడ్డిబోయన సుజాతలతో కూడిన జువెనైల్ జస్టిస్ కమిటీ స్పందించింది. ఈ కథనాన్ని సుమోటో పిల్‌గా మలచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ రెండు సుమోటో వ్యాజ్యాలు బుధవారం సీజే ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి.
శిశు విక్రయాలపై హైకోర్టు నోటీసులు
Published Thu, Apr 7 2022 4:28 AM | Last Updated on Thu, Apr 7 2022 8:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment