
సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాన్ని విజయవాడకు తరలించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. లోకాయుక్త కార్యాలయాన్ని విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది వై.సోమరాజు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్యకార్యదర్శి, లోకాయుక్త రిజిస్ట్రార్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘2019 మేలో లోకాయుక్త, ఉప లోకాయుక్త డిప్యూటీ రిజిస్ట్రార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఉద్యోగులు, పోస్టుల విభజన చేపట్టాలని కోరారు.
విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో కార్యాలయాన్ని కేటాయించాలని కోరారు. ప్రభుత్వం ఈ అభ్యర్థనను ఆమోదించింది. ఆర్ అండ్ బీ భవనంలో గదులు కూడా కేటాయించింది. విజయవాడలో లోకాయుక్త, ఉప లోకాయుక్త కార్యాలయం నిర్మాణంలో ఉందని, ఇది పూర్తయ్యే వరకు లోకాయుక్త, ఉప లోకాయుక్త కార్యాలయం హైదరాబాద్ నుంచి పనిచేస్తుందంటూ ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పటి నుంచి లోకాయుక్త హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
లోకాయుక్త ముందు ఫిర్యాదులు దాఖలు చేయడానికి హైదరాబాద్ వెళ్లాల్సి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫిర్యాదుదారులే న్యాయవాది సాయం లేకుండా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వ కార్యాలయాలన్నీ కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలి వచ్చాయి. హైకోర్టు కూడా అమరావతి నుంచి కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. లోకాయుక్త కార్యాలయం విజయవాడలో ఉంటే ఫిర్యాదుదారులకు, అధికారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్‌లో ఉన్న లోకాయుక్త కార్యాలయాన్ని విజయవాడకు తరలించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి.’అని సోమరాజు తన పిటిషన్‌లో కోర్టును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment