
కూన.. ఇది తగునా !
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయనపై చర్యలు తీసుకునేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని మహబూబ్‌నగర్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ వాచ్‌వాయిస్ ఆఫ్ ది పీపుల్ కార్యదర్శి డి.ప్రవీణ్‌కుమార్ దాఖలు చేశారు.
ఇందులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కూన శ్రీశైలంగౌడ్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2009లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన శ్రీశైలంగౌడ్ నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో తను 10వ తరగతి మాత్రమే చదివినట్లు పేర్కొన్నారని.. రంగారెడ్డి జిల్లాలో కోర్టులో దాఖలైన ఓ కేసులో తాను బీకాం చదివినట్లు పేర్కొన్నారని పిటిషనర్ వివరించారు.
అంతేకాక గౌడ్ సంపాదించిన ఆస్తులకూ, అఫిడవిట్‌లో పేర్కొన్న అస్తులకు ఏ మాత్రం పొంతన లేదని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని, తప్పుడు సమాచారంతో మోసం చేసిన శ్రీశైలంగౌడ్‌పై చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.