
సాక్షి, అమరావతి: భూముల రీసర్వే కార్యక్రమం ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్షణ పథకం’ పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భూముల రీసర్వే వల్ల గిరిజన ప్రాంతాల్లోని భూములు గిరిజనేతరులపరమయ్యే ప్రమాదముందన్న పిటిషనర్ ఆందోళన నేపథ్యంలో దీనిపై స్పష్టతనివ్వాలని స్పష్టం చేసింది. అలాగే ఈ పథకం కింద పట్టాల జారీ విషయంలోనూ స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్షణ పథకం’ వల్ల గిరిజన ప్రాంతాల్లోని గిరిజనుల భూములు గిరిజనేతరులపరం అయ్యే ప్రమాదముందని, అందువల్ల ఆ భూములపై గిరిజనేతరులకు ఎలాంటి హక్కులు కల్పించకుండా ఆదేశాలివ్వాలంటూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కుంజా శ్రీను ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ రమణ వాదనలు వినిపించగా, దీనిపై ప్రభుత్వ న్యాయవాదులు జీఎల్ నాగేశ్వరరావు, రంగారావు ప్రతిస్పందిస్తూ.. ఇది కేవలం భూముల రీ సర్వేకు సంబంధించి మాత్రమేనని, దీనివల్ల ఎవరి హక్కులు ప్రభావితం కావని తెలిపారు. ఈ పథకం కింద ప్రత్యేకంగా పట్టాలు ఏవైనా జారీ చేస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై వివరాలు తెలుసుకుని చెబుతామని వారు కోర్టుకు నివేదించారు. అలాగైతే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.