
సాక్షి, అమరావతి: చట్ట సభలో ప్రధాన మంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని న్యాయస్థానాలను కోరడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బడ్జెట్‌లో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని కోరలేరని తెలిపింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. ప్రభుత్వాలను న్యాయస్థానాలు నడపలేవని చెప్పింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదానిచ్చే విషయంలో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశామని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎన్.హరినాథ్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ వ్యాజ్యాన్ని ఇదే అంశంపై 2018లో పోలూరి శ్రీనివాసరావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ అమలాపురానికి చెందిన న్యాయవాది వి.రమేశ్‌చంద్ర వర్మ ఇటీవల దాఖలు చేసిన పిల్‌పై సీజే ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఏఎస్‌జీ హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. ప్రత్యేక హోదాపై గతంలో దాఖలైన వ్యాజ్యంలో తమ వైఖరితో కౌంటర్ దాఖలు చేశామన్నారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది మంగెన శ్రీరామారావు వాదనలు వినిపిస్తూ, ప్రత్యేక హోదా కింద కేంద్రం పలు రాష్ట్రాలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చిందన్నారు. రాష్ట్రానికి మాత్రం అలాంటివి ఏవీ ఇవ్వలేదని తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాన మంత్రి స్వయంగా చట్ట సభలో హామీ ఇచ్చారని వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ప్రధాన మంత్రి హామీని అమలు చేయాలని కోర్టును కోరలేరని చెప్పింది. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇస్తారంది. అలాగే బడ్జెట్ హామీలను అమలు చేయాలని కూడా కోరలేరని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment