సాక్షి, అమరావతి: సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లకు అధికార పార్టీ జెండాను పోలిన రంగులను వేస్తున్నారని, అలాంటివి వేయకుండా అధికారులను నియంత్రించాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. జై భీం యాక్సిస్ జస్టిస్ సంస్థ కృష్ణా జిల్లా ప్రతినిధి పరసా సురేశ్‌కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన దర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ కార్యాలయాలకు అధికార పార్టీ రంగులు వేయడాన్ని తప్పుపడుతూ గతంలో హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఈ తీర్పును సుప్రీంకోర్టు సైతం సమర్థించిందన్నారు.
ఇప్పుడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పరిధిలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లన్నింటికీ అధికార పార్టీ జెండా రంగులను పోలిన రంగులు వేస్తున్నారని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీలను ఈ నెల 16న స్వయంగా కోర్టు ముందు హాజరై ఈ రంగుల విషయంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లకు వేస్తున్న రంగులు అధికార పార్టీ రంగులు కావన్నారు.
ఆకుపచ్చ, నీలం రంగులను వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలకు దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఈ రంగులను కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించిందని చెప్పారు. నిబంధనల ప్రకారం ఆ రంగులనే ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఆ రంగులు, అధికార పార్టీ జెండా రంగులు దాదాపు ఒకటేగా ఉండటం కేవలం యాధృచ్ఛికం మాత్రమేనన్నారు. కేంద్రం నిర్ణయించిన రంగులను తాము మార్చడానికి వీల్లేదని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, ఈ విషయాలను అధికారుల నుంచే వింటామని, వారు వ్యక్తిగతంగా హాజరు కావడంలో తప్పేమీ లేదంది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లకు దేశవ్యాప్తంగా ఒకే రంగులు
Published Thu, Sep 9 2021 3:37 AM | Last Updated on Thu, Sep 9 2021 8:53 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment