
సాక్షి, అమరావతి: పలు శాఖలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులను వెబ్‌సైట్‌లో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాల్లో విచారణ ఈ నెల 13కి వాయిదా పడింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచకపోవడం సమాచారహక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ నెల్లూరుకు చెందిన జి.ఎం.ఎన్.ఎస్.దేవి, గుంటూరుకు చెందిన కె.శ్రీనివాసరావు, అనంతపురం జిల్లాకు చెందిన ఎస్.ఆర్.ఆంజనేయులు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా పిటిషనర్ల న్యాయవాదులు వై.బాలాజీ, కె.ఇంద్రనీల్, జి.శ్రీకాంత్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఉత్తర్వులను వెబ్‌సైట్‌లో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పారదర్శక పాలనలో ఇది భాగమని చెప్పారు. సమాచారహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఉత్తర్వులను వెబ్‌సైట్‌లో ఉంచకూడదంటూ నిర్ణయం తీసుకుందన్నారు. తాజాగా వాటిని వెబ్‌సైట్‌లో ఉంచాలని, అయితే రహస్యం, అతి రహస్యం పేరుతో కొన్ని ఉత్తర్వులను వెబ్‌సైట్‌లో ఉంచబోమంటూ జీవో ఇచ్చిందని తెలిపారు. ఈ జీవో కూడా వెబ్‌సైట్‌లో ఉంచలేదని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రభుత్వ ఉత్తర్వులను ఎందుకు వెబ్‌సైట్‌లో ఉంచడం లేదని ప్రశ్నించింది. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మరో కోర్టులో ఉండటంతో ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment