సాక్షి, అమరావతి: సీక్రెట్, టాప్ సీక్రెట్ అంశాలకు సంబంధించినవి తప్ప, రొటీన్ అంశాలకు సంబంధించిన జీఓలన్నింటినీ ఎందుకు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయకూడదని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అన్ని జీఓలను వెబ్‌సైట్‌లో ఉంచడంవల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటని అడిగింది. సీక్రెట్, టాప్ సీక్రెట్ వ్యవహారాలకు సంబంధించిన వాటిని వెబ్‌సైట్‌లో ఉంచకపోవడాన్ని ఎవరూ తప్పుపట్టరని.. అయితే, రొటీన్ జీఓలను కూడా వెబ్‌సైట్‌లో ఉంచకపోవడం సరికాదేమోనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాధనంతో ముడిపడి ఉన్న విషయాలకు సంబంధించిన జీఓలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం మేలని సూచించింది. అన్ని జీఓలను 24 గంటల్లో వెబ్‌సైట్‌లో ఉంచేలా చూడాలంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
ఆ హక్కు ప్రజలకుందని..
జీఓలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచకపోవడం సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ కొందరు వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై గురువారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు శ్రీకాంత్, యలమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ.. జీఓలను వెబ్‌సైట్‌లో ఉంచకపోవడం సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. వీటి గురించి తెలుసుకునే హక్కు ప్రజలకుందని తెలిపారు.
వెబ్‌సైట్ మాత్రమే మార్చాం..
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ, కాన్ఫిడెన్షియల్, సీక్రెట్, టాప్ సీక్రెట్ జీఓలు మినహా మిగిలిన వాటిని వెబ్‌సైట్‌లో ఉంచుతున్నామన్నారు. అంతకుముందు.. జీఓఐఆర్ వెబ్‌సైట్‌లో ఉంచే వారమని, ఇప్పుడు ఏపీ ఈ–గెజిట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నామని, కేవలం వెబ్‌సైట్ మాత్రమే మార్చామని చెప్పారు. చిన్నచిన్న చెల్లింపులకు సంబంధించిన జీఓలను పెట్టడంలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. అసలు కాన్ఫిడెన్షియల్ జీఓలు అంటే ఏమిటని ప్రశ్నించింది. ఏపీ సెక్రటేరియట్ మాన్యువల్‌లో కాన్ఫిడెన్షియల్, సీక్రెట్, టాప్ సీక్రెట్ జీఓలంటే ఏమిటో వివరించారంటూ సుమన్ వాటి గురించి చదివి వినిపించారు. రొటీన్ విషయాలకు సంబంధించిన జీఓలను కూడా వెబ్‌సైట్‌లో ఎందుకు ఉంచడం లేదని, అలా ఉంచడంవల్ల ప్రభుత్వానికి నష్టంలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఆన్‌లైన్‌లో ఉంచితే నష్టమేంటి?
Published Fri, Oct 1 2021 3:46 AM | Last Updated on Fri, Oct 1 2021 3:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment