Government Website
-
కేసీఆర్ ఫొటోలపై సీఎస్‌కు కేటీఆర్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్ల డిజిటల్ విధ్వంసానికి సంబంధించి జోక్యం చేసుకుని చర్యను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ‘ఎక్స్’వేదికగా మరోసారి విజ్ఞప్తి చేశారు.Smt. Santhi Kumari Garu @TelanganaCSThis is a gentle reminder to kindly intervene and expedite action regarding the digital vandalism of Telangana government websites and social media handlesImportant content from former CM Sri KCR’s tenure has been removed from these… https://t.co/NjQe6SjNWf— KTR (@KTRBRS) July 29, 2024 ‘‘సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి మాజీ సీఎం కేసీఆర్ హయాంలోని ముఖ్యమైన కంటెంట్ తొలగించబడింది. ఈ కంటెంట్ ప్రజల ఆస్తి, తెలంగాణ చరిత్రలో అంతర్భాగం. ఈ డిజిటల్ ఆస్తులను రక్షించడానికి, భవిష్యత్ తరాలకు ఈ విషయాన్ని భద్రపరచడానికి మీ తక్షణ చర్య అవసరం. మీరు చర్య తీసుకోకుంటే, మేము న్యాయపరమైన పరిష్కారాన్ని కోరవల్సి వస్తుంది’’ అని కేటీఆర్ అన్నారు. -
డేటా భారతంలో లీకుల భాగోతం
రకరకాల సందర్భాల్లో, డిజిటల్ వేదికల్లో మనం అందజేస్తున్న వ్యక్తిగత సమాచారం ఏ మేరకు సురక్షితం? చాలాకాలంగా వేధిస్తున్న ఈ ప్రశ్న సోమవారం మరోసారి ముందుకొచ్చింది. కోవిడ్ టీకాకరణకు డిజిటల్ బుకింగ్ సర్వీస్ వేదికైన ప్రభుత్వ పోర్టల్ ‘కోవిన్’ డేటాబేస్ నుంచి ప్రముఖుల వ్యక్తిగత డేటా సైతం టెలిగ్రామ్ యాప్‌లో దర్శనమిచ్చి, మనవాళ్ళ సమర్థతను వెక్కిరించింది. మలయాళ మీడియా ‘ది ఫోర్త్’ తన యూట్యూబ్ వీడియోలో చూపిన డేటా చోరీ వైనం దిగ్భ్రాంతికరం. అనేక వార్తాసంస్థలూ సదరు టెలిగ్రామ్ బాట్‌ను పరీక్షించి, లీక్ నిజమేనని నిర్ధారించాయి. ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ దీనిపై విచారణ చేపట్టిందే తప్ప, కనీసం అప్రమత్తత జారీ చేయకపోవడం విచారకరం. ప్రభుత్వం అసలీ వార్తల్నే కొట్టిపారే యడం మరీ విడ్డూరం. కానీ, కోవిన్లోనే లభించే మైనర్లు, మేజర్ల సమాచారం ఈ లీకుల్లో ఉంది. ఇది అనుమానాల్ని పెంచుతోంది. సైబర్ సెక్యూరిటీ, డేటా చట్టాల తక్షణావసరాన్ని గుర్తు చేస్తోంది. గతంలో 2018లోనే మన ఆధార్ డేటాబేస్ నుంచి భారీగా లీక్ జరిగినట్టు వార్తలొచ్చాయి. ఆ హ్యాకింగ్‌ను ప్రభుత్వం ఇప్పటి దాకా బాహాటంగా ప్రస్తావించ లేదు. ‘కోవిన్’ సంగతికే వస్తే, 2021 జూన్‌లోనూ ‘కోవిన్’ పోర్టల్ హ్యాకైంది. 15 కోట్ల మంది భారతీయుల డేటా అంగట్లో అమ్ముడైంది. అప్పుడూ మన సర్కార్ అదేమీ లేదంది. ఇక గత ఏడాది జనవరిలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయి. అప్పుడూ డేటాబేస్ ‘సురక్షితంగా ఉంద’ని నేషనల్ హెల్త్ అథారిటీ వాదించింది. కానీ, అసలు గోప్యతా విధానమంటూ ఏదీ లేకుండానే ‘కోవిన్’ జనంలోకి వచ్చింది. చివరకు 2021లో ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించాక, తప్పక విధాన ప్రకటన చేసింది. తాజా ఉదంతంలో ‘కోవిన్’ వేదిక నుంచి ‘నేరుగా ఉల్లంఘన’ జరగలేదని ప్రభుత్వం తెలివిగా జవాబిచ్చింది. గతంలో కోవిన్‌లో కాక వేరెక్కడో చోరీ అయిన సమాచారమే ఇదంటోంది. మరి ఒకప్పుడు ఇలాంటి చోరీలే జరగలేదన్న సర్కార్... ఇప్పుడు తాజా చోరీ సమాచారం పాతదే అంటోందంటే ఏది నిజం? ఏది అబద్ధం? అసలీ వార్తలన్నీ ‘ఆధారరహితం, తుంటరి చేష్టలు’ అన్నది ఎప్పటి లానే సర్కారు వారి పాత పాట. ఒకవేళ అదే నిజమనుకున్నా, ప్రభుత్వ సంస్థల చేతుల్లోని డిజిటల్ డేటా భద్రత, సత్వరమే వ్యక్తిగత డేటా రక్షణ చట్టం అవసరమైతే ఉంది. తాజా రచ్చ మరోసారి మనకు చెబుతున్న పాఠం అదే. ఢిల్లీలోని వైద్యసంస్థ ఎయిమ్స్ గత 8 నెలల్లో రెండుసార్లు సైబర్ దాడులకు గురైన సంగతి అంత తేలిగ్గా మర్చిపోలేం. వ్యక్తిగత ఆరోగ్య వివరాలు, అలాగే ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ సమాచారం ఉన్న ఇతర పత్రాలకు మరింత భద్రత అవసరమని తాజా ఘటన అప్రమత్తం చేసింది. ‘వందకోట్ల సార్లు యత్నించినా ఆధార్ భద్రతను ఛేదించడం అసాధ్యమంటూ 2018లో అప్పటి ఐటీ మంత్రి పార్లమెంట్ సాక్షిగా బల్లగుద్దారు. కానీ, మరిప్పుడు తాజా డేటా ఉల్లంఘనలో మొబైల్ నంబర్‌ను బట్టి ఆధార్ వివరాలు అంత కచ్చితంగా టెలిగ్రామ్ బాట్లో ఎలా వస్తున్నాయి? నిజానికి శరవేగంతో అన్నీ డిజిటలీకృతమవుతున్న ప్రపంచంలో కొత్త ముప్పు – వ్యక్తిగత డేటా లీకులు. అది ఇప్పుడు ప్రపంచమంతా ఉన్నదే. లక్షలాది రిటైల్ కస్టమర్లతో లావాదేవీలు నడిపే డొమినో ఇండియా నుంచి 18 కోట్ల మంది సమాచారం లీకు సహా అనేక పోర్టల్స్ నుంచి వ్యక్తిగత డేటా అంగట్లో సరుకు కావడం కొన్నేళ్ళుగా మన దేశంలో ఆనవాయితీ అయింది. 2020 నుంచి చూస్తే, అమెరికా, రష్యా, ఇరాన్‌ల తర్వాత ప్రపంచంలోనే అధికంగా 14 కోట్ల డేటా గోప్యత ఉల్లంఘనలు జరిగిన దేశం మనదే. ఇంత జరుగుతున్నా వ్యక్తిగత డేటా రక్షణపై దేశంలో ఇప్పటికీ సరైన చట్టం లేదు. భారత్‌లో 2017లో డేటా గోప్యత బిల్లు తొలిసారిగా రూపుదిద్దుకున్నప్పటి నుంచి ఇప్పటికీ కొత్త చట్టం పనులు నత్తనడక నడుస్తున్నాయి. గడచిన వర్షాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని అనుకున్నా, చివరకు దాన్ని పక్కన పడేసి, 2022 డిసెంబర్లో కొత్త ముసాయిదాను తెచ్చారు. అనేక విడతల సలహా సంప్రతింపులు జరిపినా, కొత్త బిల్లు ఇంకా పార్లమెంట్ మెట్లెక్కనే లేదు. కాగా, కేంద్రం త్వరలోనే ప్రతిపాదిత ‘డిజిటల్ ఇండియా’ చట్టాన్నీ, అలాగే సవరించిన ‘డిజి టల్ డేటా పరిరక్షణ బిల్లు 2022’నూ పార్లమెంట్లో పెడుతుందని సమాచారం. అలాగే అన్ని రకాల ప్రభుత్వ డేటా నిల్వ, అందుబాటు, భద్రతా ప్రమాణాలకు ఉమ్మడి చట్రాన్నిచ్చే ‘నేషనల్ డేటా గవ ర్నెన్స్ పాలసీ’ని ఖరారు చేస్తున్నామని అమాత్యుల మాట. భవిష్యత్తులో అవి ఊరట కావచ్చేమో. అయితే, ఇకనైనా సంస్థలు తాము సేకరించిన వ్యక్తిగత డేటాను ఒక్కసారికే, సదరు నిర్ణీత ప్రయోజనానికే వాడుకొనేలా చట్టంలో కట్టుదిట్టాలు చేయడం కీలకం. సంస్థలపైనే బాధ్యత మోపాలి. అలాగే, డేటా చోరీ అనుమానం రాగానే సంభావ్య బాధితులందరికీ సదరు సంస్థలు సమాచారమివ్వడం తప్పనిసరి చేయాలి. దానివల్ల వారు వెంటనే పాస్వర్డ్లు మార్చుకొని, సురక్షితులయ్యే వీలుంటుంది. అయినా, ప్రభుత్వం చేతిలోని ‘కోవిన్’ లాంటి వాటి నుంచే డేటా లీకవుతూ పోతే పౌరులకిక ఏం నమ్మకం మిగులుతుంది? సమస్తం డిజిటలైన వేళ ఉల్లంఘనలు తప్పవనుకున్నా, నష్టాన్ని తగ్గించడం, డేటా గోప్యతకు చట్టబద్ధ రక్షణ కల్పించడం ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వ కనీస కర్తవ్యం. లీకైన కోట్లాది ప్రజల డేటా నేరగాళ్ళ చేతిలో పడితే ఆర్థికంగా, సామాజికంగా చెలరేగే సంక్షోభం అనూహ్యం. అందుకే, ఈ లీకుల్ని కొట్టిపారేసే వైఖరి వదిలి, సర్కార్ కఠిన చర్యలకు దిగాలి. ప్రతిదానికీ పుట్టుపూర్వోత్తరాలన్నీ సేకరించే ధోరణి మాని, వీలైనంత వరకు అతి తక్కువ డేటానే సేకరించే పద్ధతి మేలంటున్న పౌరసమాజం మాటల్నీ పట్టించుకోవాలి. -
ప్రభుత్వ పోర్టల్ ద్వారానే సినిమా టిక్కెట్లు విక్రయించాలి
కర్నూలు (సెంట్రల్): ప్రభుత్వ పోర్టల్ ద్వారానే సినిమా టిక్కెట్లను ఆన్లైన్లో విక్రయించాలని జాయింట్ కలెక్టర్ రామసుందర్‌రెడ్డి థియేటర్ల యజమానులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఆయన డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఆర్డీఓలతో కలసి థియేటర్ల యజమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఓ నంబర్ 69 ప్రకారం సినిమా టిక్కెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారానే విక్రయించాలన్నారు. సినిమా ప్రదర్శన కంటే ఏడు రోజుల ముందు టిక్కెట్లను విక్రయించరాదన్నారు. బుక్ చేసుకున్న టిక్కెట్‌ను వినియోగదారుడు నాలుగు గంటల ముందు రద్దు చేసుకుంటే జీఎస్టీ, సర్వీసు చార్జీలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేయాలన్నారు. కార్యక్రమంలో పత్తికొండ, ఆదోని, కర్నూలు ఆర్డీఓలు మోహన్‌దాస్, రామకృష్ణారెడ్డి, హరిప్రసాద్ పాల్గొన్నారు. (క్లిక్: టెన్త్ విద్యార్థులకు తీపి కబురు) -
ఆన్లైన్లో ఉంచితే నష్టమేంటి?
సాక్షి, అమరావతి: సీక్రెట్, టాప్ సీక్రెట్ అంశాలకు సంబంధించినవి తప్ప, రొటీన్ అంశాలకు సంబంధించిన జీఓలన్నింటినీ ఎందుకు వెబ్సైట్లో అప్లోడ్ చేయకూడదని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అన్ని జీఓలను వెబ్సైట్లో ఉంచడంవల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటని అడిగింది. సీక్రెట్, టాప్ సీక్రెట్ వ్యవహారాలకు సంబంధించిన వాటిని వెబ్సైట్లో ఉంచకపోవడాన్ని ఎవరూ తప్పుపట్టరని.. అయితే, రొటీన్ జీఓలను కూడా వెబ్సైట్లో ఉంచకపోవడం సరికాదేమోనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాధనంతో ముడిపడి ఉన్న విషయాలకు సంబంధించిన జీఓలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం మేలని సూచించింది. అన్ని జీఓలను 24 గంటల్లో వెబ్సైట్లో ఉంచేలా చూడాలంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఆ హక్కు ప్రజలకుందని.. జీఓలను ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచకపోవడం సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ కొందరు వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై గురువారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు శ్రీకాంత్, యలమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ.. జీఓలను వెబ్సైట్లో ఉంచకపోవడం సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. వీటి గురించి తెలుసుకునే హక్కు ప్రజలకుందని తెలిపారు. వెబ్సైట్ మాత్రమే మార్చాం.. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ, కాన్ఫిడెన్షియల్, సీక్రెట్, టాప్ సీక్రెట్ జీఓలు మినహా మిగిలిన వాటిని వెబ్సైట్లో ఉంచుతున్నామన్నారు. అంతకుముందు.. జీఓఐఆర్ వెబ్సైట్లో ఉంచే వారమని, ఇప్పుడు ఏపీ ఈ–గెజిట్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నామని, కేవలం వెబ్సైట్ మాత్రమే మార్చామని చెప్పారు. చిన్నచిన్న చెల్లింపులకు సంబంధించిన జీఓలను పెట్టడంలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. అసలు కాన్ఫిడెన్షియల్ జీఓలు అంటే ఏమిటని ప్రశ్నించింది. ఏపీ సెక్రటేరియట్ మాన్యువల్‌లో కాన్ఫిడెన్షియల్, సీక్రెట్, టాప్ సీక్రెట్ జీఓలంటే ఏమిటో వివరించారంటూ సుమన్ వాటి గురించి చదివి వినిపించారు. రొటీన్ విషయాలకు సంబంధించిన జీఓలను కూడా వెబ్సైట్లో ఎందుకు ఉంచడం లేదని, అలా ఉంచడంవల్ల ప్రభుత్వానికి నష్టంలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
ఏపీ సీఎం ఆలోచన చరిత్రాత్మకం
‘‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ పోర్టల్‌లో మాత్రమే విక్రయించా లనుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన చరిత్రాత్మకం’’ అని ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’(టీఎఫ్‌పీసీఏపీ) అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టిక్కెట్ల దోపిడీ గురించి తెలుసుకున్న జగన్‌గారు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకులకు వినోదం భారం కాదు.. పైగా నిర్మాతలు చిత్ర నిర్మాణ ఖర్చులను తగ్గించుకునేందుకు దోహదపడుతుంది.. బడ్జెట్ అదుపులో ఉంటుంది. జగన్‌గారి ఆలోచన చిత్రపరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుంది. ముఖ్యంగా కార్మికులకు, చిన్న నిర్మాతలకు మేలు జరుగుతుంది. కానీ కొంత మంది నిర్మాతలు తమ వ్యక్తిగత లాభాలకు గండి పడుతుందని భావించి, ఆ ఆలోచన తప్పు అని ప్రచారం చేస్తున్నారు. త్వరలో జగన్‌గారిని కలిసి, పరిశ్రమలోని సమస్యలను వివరిస్తాం’’ అన్నారు. చదవండి: Mrunal Thakur: విరాట్ కోహ్లిని పిచ్చిగా ప్రేమించాను: హీరోయిన్ -
రెండ్రోజుల పాటు ప్రభుత్వ వెబ్సైట్లు, ఆన్లైన్ సేవల నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: ఆధునిక యూపీఎస్ (అన్ ఇంటరప్టబుల్ పవర్ సోర్స్) ఏర్పాటు కోసం ఈ నెల 9వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 11వ తేదీ రాత్రి 9 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లతో పాటు ఆన్లైన్ సేవలు నిలిపివేస్తున్నట్లు స్టేట్ డేటా సెంటర్ (ఎస్డీసీ) ప్రకటించింది. 2010లో హైదరాబాద్ గచ్చిబౌలి టీఎస్ఐఐసీ సెంటర్లో నిర్మించిన ఎస్డీసీ 2011 నుంచి సేవలందిస్తోంది. ఈ సెంటర్ నుంచి వివిధ ప్రభుత్వ విభాగాలు తమ యాప్‌లు, వెబ్సైట్లను ప్రారంభించాయి. ప్రభుత్వ, పౌర సేవల్లో ఈ ఎస్డీసీ కీలకపాత్ర పోషిస్తోంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా ప్రభుత్వ, పౌరసేవలు అందించేందుకు పాత యూపీఎస్ స్థానంలో ఆధునిక యూపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే సందర్భాల్లో కొత్త వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. -
వెబ్సైట్ల సాక్షిగా కోడ్ ఉల్లంఘన
విశాఖసిటీ : సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైనప్పటి నుంచి కోడ్ వర్తిస్తోంది. కోడ్ కూసిన వెంటనే.. ప్రభుత్వ వెబ్సైట్లలో ఉన్న ఫొటోల్ని మార్చాల్సి ఉంటుంది. కానీ.. ఇంత వరకు ఏపీ ప్రభుత్వం మాత్రం కోడ్ మాకు వర్తించదన్నట్లుగా నిర్లక్ష్యపు ధోరణిని ప్రదర్శిస్తోంది. ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల వెబ్సైట్లలో సీఎం చంద్రబాబు, అనేక మంది మంత్రుల ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఇక ఆయా వెబ్సైట్లను పరిశీలిస్తే.. డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్‌లో సీఎంగా చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణుడు, బీసీవెల్ఫేర్ కమిషనర్ వెబ్సైట్లో బాబు, మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైట్లో బాబు, నారాయణ ఫొటోలు ఉన్నాయి. ఓవైపు.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని వెబ్సైట్లలోనూ ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రుల ఫొటోలను తొలగిస్తూ.. ఎన్నికల కమిషన్ నియమాల్ని పాటిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇలా బరితెగించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
జీవోల గోప్యత.. ఏదీ పారదర్శకత!
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ పాలనలో నిర్ణయాల అమలుకు ఉద్దేశించి వెలువరించే జీవోల గోప్యత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం జీవో రూపంలో ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులో ఉంచే సంప్రదాయం క్రమంగా కనుమరుగవుతోంది. ప్రభుత్వం 2016లో వెలువరించిన జీవోల్లో 56 శాతాన్నే వెబ్సైట్లో పెడితే, 2017లో 42 శాతానికి పడిపోయింది. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం పోరాడుతున్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సమాచార హక్కు చట్టం కింద సేకరించిన జీవోల వివరాలను శుక్రవారం వెల్లడించింది. జీవోలన్నింటినీ ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలన్న డిమాండ్‌ను ఇప్పటికే ప్రభుత్వం, గవర్నర్, న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లింది. అయినా ప్రభుత్వం మాత్రం గత రెండేళ్లలో మొత్తం 44,329 జీవోలకు గాను 21,869 అంతర్గత (ఇంటర్నల్) జీవోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదని సమాచారహక్కు చట్టం ద్వారా ఐటీశాఖ తేల్చిచెప్పింది. జీవోలన్నీ పెట్టేదాకా పోరాటం ప్రభుత్వం ఇప్పటికే అంతర్గత జీవోల పేరుతో ఏసీబీ కేసుల విత్‌డ్రా, ప్రాజెక్టుల అంచనాలు పెంచడం, న జరాల ప్రకటనలకు సంబంధించిన నిర్ణయాల జీ వోలను ‘ఇంటర్నల్’పేరుతో వెబ్సైట్లో ప్రజలకు అం దుబాటులో ఉంచకపోవటం సరైన నిర్ణయం కాదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి అన్నారు. తాము ఇప్పటికే గవర్నర్‌ను కలిశామని, హైకోర్టును కూడా ఆశ్రయించామని తెలిపారు. వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్న జీవోలు అధికారుల టూర్లు, అలవెన్సులకు సంబంధించినవే ఉంటున్నాయని, దీని వల్ల ప్రజల కు ఏమీ ఉపయోగం ఉంటుందని ప్రశ్నించారు. ప్రజల నిధులు, వారి అవసరాలకు సంబంధించి కీలక నిర్ణయాలు వెల్లడించకపోవటం దారుణమైన పరిణామమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పారదర్శకత కోసం కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని పద్మనాభరెడ్డి చెప్పారు. -
డజను ప్రభుత్వ వెబ్సైట్లపై సైబర్ దాడి!
న్యూఢిల్లీ: రక్షణ, హోం మంత్రిత్వశాఖలు సహా 12కు పైగా ప్రభుత్వ వెబ్సైట్లు శుక్రవారం హ్యాకింగ్‌కు గురయ్యాయి. సైబర్‌దాడికి గురైన ఈ వెబ్సైట్లలో చైనీస్ అక్షరాలు కన్పించడంతో ఈ పని చైనా హ్యాకర్లే చేసుంటారని అధికారులు అనుమానిస్తున్నారు. రక్షణ, హోం మంత్రిత్వశాఖలతో పాటు న్యాయ, కార్మిక మంత్రిత్వశాఖల వెబ్సైట్లపై కూడా సైబర్‌దాడి జరిగింది. ఈ ఘటనపై స్పందించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో రక్షణ శాఖ వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తామని ట్వీట్ చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లపై ఎలాంటి సైబర్‌దాడి జరగలేదని జాతీయ సైబర్ భద్రత (ఎన్సీఎస్) సమన్వయకర్త గుల్షన్ రాయ్ అన్నారు. నెట్వర్కింగ్ వ్యవస్థలో హార్డ్‌వేర్ ఫెయిల్యూర్ కారణంగానే ఈ ఇబ్బంది తలెత్తిందని వెల్లడించారు. -
షాకింగ్: ప్రభుత్వ సైట్లలో ఆధార్ వివరాలు లీక్
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ గోప్యతపై ఆందోళను తీవ్ర స్థాయిలో కొనసాగుతుండగానే ఆధారం సెక్యూరిటీపై షాకింగ్ విషయం వెలుగు చూసింది. అనేక మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలు 200 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లలో లీక్ అయ్యాయి. దాదాపు 200కిపైగా వెబ్ సైట్లలో ఆధార్ డేటా లీక్ అయింది. వీటిలొ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలతో పాటు పలు విద్యాసంస్థలు ఉన్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పిటిఐ నివేదించింది. ఆధార్ వివరాలు చాలా సెక్యూర్డ్‌గా ఉంటాయని కేంద్రం పదే పదే హామి ఇస్తున్నప్పటికీ వందల మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలు భారీగా లీక్ అయ్యాయన్న వార్త సంచలనం రేపింది. మరోవైపు ఈ లీక్‌వ్యవహారంపై యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు స్పందించారు. సమాచార లీక్ అంశం బహిర్గతం కావడంతో ఆ డేటాను వెబ్సైట్లనుంచి తొలగించినట్టు అధికారులు తెలిపారు. వినియోగదారుడి వ్యక్తిగత సమాచర భద్రత కోసం యూఐడీఏఐ పలు అంచెల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తుందని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు వాటి పనితీరును అధికారులు సమీక్షిస్తారని ముఖ్యంగా డేటా సెంటర్లను కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. డేటా భద్రత, గోప్యతను బలోపేతం చేయడానికి సెక్యూరిటీ ఆడిట్లను క్రమ పద్ధతిలో నిర్వహిస్తామని, డేటా సురక్షితంగా ఉండటానికి అన్ని చర్యలు తీసుకుంటామని,ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చింది. -
రుణాలు గోవిందా!
♦ లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వ వెబ్సైట్లో ♦ అప్లోడ్ చేయడంలో ఆలస్యం ♦ వైబ్‌సైట్‌ను మూసివేసిన సర్కారు ♦ ఎస్సీ, బీసీ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం ♦ మంజూరుకు నోచుకోని రూ. 2 లక్షలపై విలువ యూనిట్లు ♦ 271 మంది లబ్ధిదారులకు మొండిచేరుు ♦ వెబ్‌సైట్‌ను పునఃప్రారంభించాలి : ఉన్నతాధికారులు ఇందూరు : రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రుణాలు అందిస్తున్న నేపథ్యంలో 2015-16 సంవత్సరానికి నాలుగు నెలల క్రితం మండల, మున్సిపల్ కార్యాలయాల్లో భారీ సం ఖ్యలో రుణాల కోసం దరఖాస్తులు వచ్చారుు. ప్రధానంగా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు యూ నిట్ల కోసం ఒక్క రుణానికి ఇద్దరు చొప్పున పోటీ పడ్డారు. అయితే తొలుత మండల, మున్సిపల్ కార్యాలయాల్లో ఎంపిక చేసి మార్చి 28న కలెక్టర్ కార్యాలయంలో వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్లో 212 మంది, బీసీ కార్పొరేషన్లో 59 మంది, మొత్తం కలిపి 271 మందిని ఎంపిక చేశారు. జాబితాను కూడా ప్రకటించారు. అనంతరం కలెక్టర్ తో కాగితాలపై అప్రూవల్ చేయించిన ఎస్సీ, బీసీ కా ర్పొరేషన్ అధికారులు ప్రభుత్వం రుణాలు మం జూ రు చేసేందుకు ఏర్పాటు చేసిన (ఆన్లైన్ మం జూ రుకు సంబంధించిన) వెబ్సైట్లో లబ్ధిదారుల వివరా లు నమోదు చేయడం జాప్యం చేశారు. అయితే ప్రభుత్వం ఏప్రిల్ 21న వెబ్‌సైట్‌ను క్లోజ్ చే సింది. ఉన్నతాధికారులు వెబ్‌సైట్‌ను ప్రభుత్వం తెరి స్తేగాని రుణాల మంజూరు సాధ్యపడదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏం చెయ్యాలో అర్థం కాక, రుణాలు మంజూరు కాకపోతే లబ్ధిదారులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. నిర్లక్ష్యానికి పరాకాష్ఠ రాష్ట్ర ప్రభుత్వం అధిక మొత్తంలో రుణాలకు రాయితీ ఇస్తున్నందుకు పోటీ పెరిగింది. అర్హులను గుర్తించడానికి అధికారులు సెలవు రోజుల్లో కూడా పని చేసి ఎంపిక పక్రియ పూర్తి చేశారు. కానీ ఆ తరువాత కా ర్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆన్లైన్ మం జూరుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ వెబ్సైట్లో వెంట వెంటనే వివరాలు అప్లోడ్ చేయడంలో జాప్యం చేశారు. ఒక పక్క కలెక్టర్ యోగితారాణా పారదర్శకంగా రుణాలు అర్హులకు అందించడానికి చర్యలు చేపడితే, మరో పక్క అధికారులు జాప్యాన్ని ప్రదర్శిం చి రుణాలకు ఎసరు తెచ్చారు. అదేవిధంగా రుణాలను అందించడానికి సంబంధిత శాఖల అధికారులు భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. కానీ.. ఎస్సీ, బీసీ కార్పొరేషన్లకు కొంత కాలంగా రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో వేరే శాఖలకు చెందిన అధికారు లు ఇన్‌చార్జీలుగా పని చేస్తున్నారు. ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు. వెబ్సైట్ తెరిస్తేనే ఆశలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్లైన్ మంజూరు వెబ్‌సైట్‌ను మళ్లీ తెరిచే అవకాశాలు కనపించడం లేదు. అయితే ఒక్క విషయంలో మాత్రం ఆశలు కలుగుతున్నాయి. అదేంటంటే నిజామాబాద్ జిల్లాతోపా టు కరీంనగర్,ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఇదే విధంగా జరిగింది. లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్ మంజూరు కోసం అప్లోడ్ చేయలేదు. నాలుగు జిల్లాల ఉన్నతాధికారు లు కలిసి సర్కారుపై ఒత్తిడి తెస్తే వెబ్‌సైట్‌ను తిరిగి పునఃప్రారంభించే అవకాశాలున్నాయి. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల అధికారులు తమ రాష్ట్ర ప్రధాన కార్యాలయాల అధికారులకు, ప్రభుత్వానికి లేఖల ద్వారా వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వం ఇంత వరకు వెబ్‌సైట్‌ను ప్రారంభించలేదు. -
ఆ వెబ్‌సైట్‌ను ఎప్పటిలోపు పునరుద్ధరిస్తారు?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉత్తర్వులు ఉంచే వెబ్‌సైట్‌ను ఎప్పటిలోపు పునరుద్దరిస్తారో స్పష్టంగా చెప్పాలని హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల వెబ్‌సైట్‌ను తెలంగాణ సర్కార్ మూసివేయడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెబ్‌సైట్‌ను గతంలో వలే అందరూ ఉపయోగించుకునేందుకు వీలుగా పునరుద్దరించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ బుధవారం విచారించారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఆర్.రఘునందన్‌రావు వాదనలు వినిపిస్తూ, గతంలో ఈ వెబ్సైట్ అందరికీ అందుబాటులో ఉండేదని, తద్వారా ప్రభుత్వం జారీ చేసే అన్ని జీవోల గురించి తెలుసుకునే అవకాశం ప్రజలందరికీ ఉండేదన్నారు. అయితే ప్రభుత్వం సహేతుక కారణాలు లేకుండానే గత నెల నుంచి వెబ్‌సైట్‌ను మూసివేసిందని, దీని వల్ల ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ప్రజలకు లేకుండాపోయిందని ఆయన వివరించారు. ప్రజాస్వామ్యవ్యవస్థలో ప్రభుత్వ పాలన గురించి, అది జారీ చేసే ఉత్తర్వుల గురించి తెలుసుకునే హక్కు ప్రజలకుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల వెబ్‌సైట్‌ను మూసివేయడం ద్వారా పారదర్శకతకు ప్రభుత్వం పాతరేసినట్లయిందన్నారు. ఇలా ప్రభుత్వ ఉత్తర్వులను తెలుసుకునే అవకాశం లేకుండా చేయడం రాజ్యాంగంలోని అధికరణ 19(1)కి, సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమని ఆయన కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై ఏం చెబుతారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. దీనికి ఐటీశాఖ తరఫు న్యాయవాది నజీబ్‌ఖాన్ బదులిస్తూ, వెబ్‌సైట్‌ను మూసివేయలేదని, కొంత కాలం వరకు మాత్రమే అది ప్రజలకు అందుబాటులో ఉండదన్నారు. వెబ్‌సైట్‌ను క్రమబద్ధం చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు తగిన మార్గదర్శకాలు జారీ చేశామని ఆయన వివరించారు. లోపాలను సరిదిద్దిన తరువాత వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తామని, ఇందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ఎప్పటిలోపు వెబ్‌సైట్‌ను పునరుద్దరిస్తారో స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
బంగారు తల్లికి బెంగ
వీరఘట్టం : బంగారుతల్లి పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆడపిల్లల తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పేరును మా ఇంటి మహాలక్ష్మిగా మార్చి అమలు చేస్తామని ప్రకటించిన తెలుగుదేశం ప్రభుత్వం.. ఆ పని చేయకపోగా ఉన్న పథకానికే మంగళం పాడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పథకానికి చెందిన ప్రభుత్వ వెబ్సైట్ ఈ నెల 9 నుంచి మూతపడింది. ఫలితంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. మరోవైపు గత ఏడాది మార్చి నుంచి ఈ పథకం లావాదేవీలను ప్రభుత్వం నిలిపివేసింది. అప్పటి నుంచి కొత్త దరఖాస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కొద్దిరోజులుగా అది కూడా నిలిచిపోవడంతో బంగారు తల్లులకు నిరాశే మిగులుతోంది. బంగారంలాంటి పథకం: ఇప్పటికే దరఖాస్తు చేసుకొని ఆర్థిక ప్రోత్సాహం కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు ప్రభుత్వ చర్యలు తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. గత ప్రభుత్వం హయాంలో 2013 మే ఒకటో తేదీన ఈ పథకం అమలులోకి వచ్చింది. ఆస్పత్రిలో కాన్పు జరిగి ఆడబిడ్డ పుట్టిన వెంటనే అర్హతలుండి దరఖాస్తు చేసుకున్న వారి పేరిట తక్షణమే రూ.2500 ఖాతాలో జమ చేస్తారు. మొదటి ఏడాది వ్యాధి నిరోధక టీకాలన్నింటిని సక్రమంగా వేయిస్తే రెండో ఏడాది ప్రోత్సాహకంగా రూ.1000 జమ చేస్తారు. ఇలా ఆడపిల్లకు 21 ఏళ్లు వచ్చే వరకు ప్రోత్సాహకాలు జమచేసి పెళ్లి సమయానికి ఏకమొత్తంగా అందజేస్తారు. ఈ పథకం లబ్ధిదారులుగా చేరిన వారికి 2014 పిబ్రవరి నిధులు జమ అయ్యాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మార్చి నుంచి జమలు నిలిచిపోయాయి. 2014 మే ఒకటో తేదీకి సంవత్సరం గడిచిపోయినా ఒక్క లబ్ధిదారుకు కూడా రెండో సంవత్సరం ప్రోత్సాహక నగదు జమ కాలేదు. ఇప్పుడు మూడో సంవత్సరం సమీపిస్తున్నా అదే పరిస్థితి. బంగారు తల్లి పథకం కింద జిల్లాలో 14734 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో 6637 మందికి రూ.2500 చొప్పున జమ అయింది. 695 మంది తల్లులు ఇంటి వద్ద ప్రసవించడంతో వీరికి ప్రోత్సాహకం అందలేదు. మిగిలిన 7402 మందికి ఈ మొత్తం జమ కావాల్సి ఉంది. కాగా దరఖాస్తు చేసుకున్న వారిలో 5688 మందికే సర్టిఫికెట్లు అందాయి. సర్టిఫికెట్ అందితేనే బంగారుతల్లి పథకం కింద నమోదైనట్లు నిర్థారిస్తారు. పలువురు సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్నా అధికారులు పెద్దగా స్పందించడం లేదు. తల్లిదండ్రుల అసంతృప్తి :గత ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిన పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నిలిపివేయడంపై ఆడపిల్లలు తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ వరకు చదువులో రాణిస్తే వివాహ సమయానికి రూ.2.16 లక్షలు సంబంధిత కుటుంబానికి చేరుతుంది. బంగారుత ల్లి ఉద్దేశం మంచిదే అయినా ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తూ నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తుండటంతో వేలాది మంది ఆశలు నీరుగారుతున్నాయి.