సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉత్తర్వులు ఉంచే వెబ్‌సైట్‌ను ఎప్పటిలోపు పునరుద్దరిస్తారో స్పష్టంగా చెప్పాలని హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల వెబ్‌సైట్‌ను తెలంగాణ సర్కార్ మూసివేయడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వెబ్‌సైట్‌ను గతంలో వలే అందరూ ఉపయోగించుకునేందుకు వీలుగా పునరుద్దరించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ బుధవారం విచారించారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఆర్.రఘునందన్‌రావు వాదనలు వినిపిస్తూ, గతంలో ఈ వెబ్‌సైట్ అందరికీ అందుబాటులో ఉండేదని, తద్వారా ప్రభుత్వం జారీ చేసే అన్ని జీవోల గురించి తెలుసుకునే అవకాశం ప్రజలందరికీ ఉండేదన్నారు. అయితే ప్రభుత్వం సహేతుక కారణాలు లేకుండానే గత నెల నుంచి వెబ్‌సైట్‌ను మూసివేసిందని, దీని వల్ల ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ప్రజలకు లేకుండాపోయిందని ఆయన వివరించారు.
ప్రజాస్వామ్యవ్యవస్థలో ప్రభుత్వ పాలన గురించి, అది జారీ చేసే ఉత్తర్వుల గురించి తెలుసుకునే హక్కు ప్రజలకుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల వెబ్‌సైట్‌ను మూసివేయడం ద్వారా పారదర్శకతకు ప్రభుత్వం పాతరేసినట్లయిందన్నారు. ఇలా ప్రభుత్వ ఉత్తర్వులను తెలుసుకునే అవకాశం లేకుండా చేయడం రాజ్యాంగంలోని అధికరణ 19(1)కి, సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమని ఆయన కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై ఏం చెబుతారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు.
దీనికి ఐటీశాఖ తరఫు న్యాయవాది నజీబ్‌ఖాన్ బదులిస్తూ, వెబ్‌సైట్‌ను మూసివేయలేదని, కొంత కాలం వరకు మాత్రమే అది ప్రజలకు అందుబాటులో ఉండదన్నారు. వెబ్‌సైట్‌ను క్రమబద్ధం చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు తగిన మార్గదర్శకాలు జారీ చేశామని ఆయన వివరించారు. లోపాలను సరిదిద్దిన తరువాత వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తామని, ఇందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ఎప్పటిలోపు వెబ్‌సైట్‌ను పునరుద్దరిస్తారో స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
ఆ వెబ్‌సైట్‌ను ఎప్పటిలోపు పునరుద్ధరిస్తారు?
Published Wed, Mar 23 2016 7:29 PM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM
Advertisement
Advertisement