
సాక్షి, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో పాలక మండలి (ఈసీ) సభ్యుల నియామకం విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధి విధానాలు, వాటికి సంబంధించిన చట్ట నిబంధనలు తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం పిటిషనర్‌ను ఆదేశించింది. వీటిపై స్పష్టత వచ్చిన తర్వాతనే మిగిలిన అంశాల జోలికి వెళతామంది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఈసీ సభ్యుల నియామకాలు రాజకీయ నేతల సిఫారసుల మేరకు జరిగాయని, అందువల్ల ఈసీ సభ్యుల నియామక జీవోలను రద్దు చేయాలని కోరుతూ ముందడుగు ప్రజా పార్టీ నాయకురాలు నక్క నిమ్మి గ్రేస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ రాకేశ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.