రెండో అధికారిక భాషగా ఉర్దూ | Urdu is second official language Unanimous approval of Assembly | Sakshi
Sakshi News home page

రెండో అధికారిక భాషగా ఉర్దూ

Published Thu, Mar 24 2022 3:17 AM | Last Updated on Thu, Mar 24 2022 3:30 PM

Urdu is second official language Unanimous approval of Assembly - Sakshi

సాక్షి, అమరావతి: మైనార్టీల సంక్షేమం, ఉర్దూ భాషాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ అధికార భాషల చట్ట సవరణ–2022 బిల్లును, కొత్తగా మైనార్టీల ప్రత్యేక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ మైనార్టీస్‌ కాంపోనెంట్, ఆర్థిక వనరులు, వ్యయ కేటాయింపులు, వినియోగ చట్టం–2022 బిల్లును డిప్యూటీ సీఎం అంజాద్‌ బాష ప్రతిపాదించారు. ఈ బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్‌ బాష మాట్లాడుతూ.. ఉర్దూ ఒక మతానికి సంబంధించిన భాష కాదని, నిఖార్సయిన భారతీయ భాష అని చెప్పారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉర్దూకు తెలుగుతో సమాన హోదాను కల్పించడంతో ప్రతి మైనార్టీ ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ‘ఆంధ్రప్రదేశ్‌ మైనార్టీస్‌ కాంపోనెంట్‌ మరియు ఆర్థిక వనరులు, వ్యయ కేటాయింపులు మరియు వినియోగ చట్టం–2022’ బిల్లుతో వచ్చే 10 ఏళ్లలో అల్ప సంఖ్యాక వర్గాలకు భద్రత, సామాజిక హోదాతో పాటు సమధర్మాన్ని పాటించేందుకు వీలుంటుందని  అంజాద్‌ బాషా చెప్పారు. ఆర్థిక, విద్య, మానవ వనరుల అభివృద్ధి విషయాల్లో ఆయా వర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ మూడేళ్లలో ఇది చారిత్రక సెషన్‌ అని కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్‌ హఫీజ్‌ చెప్పారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు తెలుపుతూ ఆయన మాట్లాడారు. 

ఉర్దూకు అరుదైన గౌరవం
రాష్ట్రంలో రెండో అధికారిక భాషగా ఉర్దూకు అరుదైన గౌవరం లభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 జిల్లాల్లో ఉర్దూ రెండో అధికారిక భాషగా కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉర్దూకు రెండో అధికారిక భాషగా చట్టబద్ధత కల్పించింది. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లూ దానిని పూర్తిగా విస్మరించింది. మైనార్టీలు, ఉర్దూ ప్రేమికుల ఆవేదనను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూకు స్థానం కల్పించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యకలాపాలు, ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగుతో పాటు ఉర్దూలోనూ సాగించేలా సమాన హోదా కల్పించినట్టయింది. రాష్ట్రంలో 32.45 లక్షల మందికి ఉర్దూ మాతృభాషగా ఉంది. ఉర్దూ మాట్లాడే ప్రజలు వైఎస్సార్‌ కడపలో 19 శాతం, గుంటూరులో 15.55 శాతం, చిత్తూరు 13.16 శాతం, అనంతపురంలో 12.91, కర్నూలు 11.55, కృష్ణాలో 8.42 శాతం, ప్రకాశంలో 5.65 శాతం, నెల్లూరులో 7.84 శాతం ఉన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ సుమరు రెండు శాతం ఉర్దూ మాట్లాడే ప్రజలున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement