ఉర్దూలో మాట్లాడుతూ.. మధ్యలో 'అధ్యక్షా'
ఉర్దూ భాషను అన్ని జిల్లాల్లో రెండో భాషగా గుర్తిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయనీ విషయం చెప్పారు. అలాగే జంట నగరాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ భూములను సొంతం చేసుకోడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీనిపై బాజిరెడ్డి గోవర్ధన్ నేతృత్వంలో కమిటీని నియమించామని, ఆ కమిటీ ఎక్కడెక్కడ వక్ఫ్ భూములున్నాయో గుర్తించి తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.
కమిటీ సమావేశాలకు మజ్లిస్ నేతలు కూడా వెళ్లి తాము గుర్తించిన విషయాలను కూడా చెప్పాలని అన్నారు. వక్ఫ్ భూములు, ఉర్దూ భాషకు సంబంధించిన విషయం కావడంతో తన సమాధానం అంతా ఉర్దూలోనే ఇచ్చిన కేసీఆర్.. మధ్యలో మాత్రం అలవాటుగా 'అధ్యక్షా' అని రెండుసార్లు తెలుగులోనే సంబోధించారు. దానికి ముందు, తర్వాత కూడా ఉర్దూలోనే మాట్లాడిన ఆయన.. ఉర్దూ భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.